మూడు వారాల్లో 1000 బుకింగ్‌లను దక్కించుకున్న ఆక్టావియా
స్కొడా ఇండియా తాజాగా భారత మార్కెట్లోకి పునఃప్రవేశపెట్టిన తమ సరికొత్త ప్రీమియం సెడాన్ '2013 ఆక్టావియా' ఇప్పుడు విపణిలో హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంది. మునుపటి వెర్షన్ కంటే మరింత స్టయిలిష్‌గా, అనేక రెట్లు మెరుగ్గా, అధునాతన ఫీచర్లు, టెక్నాలజీతో వచ్చిన కొత్త ఆక్టావియాను సొంతం చేసుకునేందుకు కొనుగోలుదారులు ఎగబడుతున్నారు.
కొత్తా స్కొడా ఆక్టావియాను దేశీయ మార్కెట్లో విడుదల చేసిన వారాల్లోనే ఈ మోడల్‌కు 1,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు వచ్చాయని స్కొడా ఆటో ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది. కొత్త ఆక్టావియా కోసం కంపెనీ ఇటీవలే ఆన్‌లైన్ బుకింగ్ సౌకర్యాన్ని కూడా ప్రారంభించింది. స్కొడా కస్టమర్లు ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారా తమ ఫేవరేట్ ఆక్టావియా కారును బుక్ చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: 2013 స్కొడా ఆక్టావియా టెస్ట్ డ్రైవ్ రిపోర్ట్
ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకునే వారు ప్రతి బుకింగ్‌కి కేవలం రూ.5,000 చెల్లిస్తే సరిపోతుంది. ఒకవేళ క్యాన్సిల్ చేసుకోవాలనుకునే వారికి పూర్తిగా 100 శాతం బుకింగ్ మొత్తాన్ని కంపెనీ తిరిగి కస్టమర్లకు వెనక్కు ఇచ్చేస్తుంది. ఆన్‌లైన్‌లో నెట్ బ్యాంకింగ్, డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌ల ద్వారా పేమెంట్ చేసి స్కొడా కారును బుక్ చేసుకోవచ్చు. కస్టమర్లు మిగిలిన మొత్తాన్ని తాము ఎంచుకునే అధీకృత స్కొడా డీలర్‌షిప్ కేంద్రంలో చెల్లించవచ్చు. ఆన్‌లైన్ బుకింగ్ కోసం www.bookyourskodaonline.com వెబ్‌సైట్‌ను సందర్శించండి.
ఇక కొత్త స్కొడా ఆక్టావియా విషయానికి వస్తే, భారత మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ.13.95 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. కొత్త 2013 స్కొడా ఆక్టావియా మూడు వేరియంట్లలో (యాక్టివ్, యాంబిషన్, ఎలిగాన్స్), పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో (1.4 లీటర్ పెట్రోల్, 1.8 లీటర్ పెట్రోల్, 2.0 లీటర్ డీజిల్) లభ్యమవుతుంది. అన్ని వేరియంట్లలో 16-ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఎలక్ట్రిక్ సైడ్ మిర్రర్స్, పవర్ విండోస్, ఏబిఎస్, డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ట్రాక్షన్ కంట్రోల్, డ్రైవర్ సీట్ అడ్జస్ట్‌మెంట్, స్టీరింగ్ అడ్జస్ట్‌మెంట్, రిమోట్ లాకింగ్, రియర్ ఏసి వెంట్స్ వంటి ఫీచర్లు లభ్యం కానున్నాయి.


Click it and Unblock the Notifications









