జూన్ 18న హ్యుందాయ్ అల్కజార్ 7-సీటర్ ఎస్‌యూవీ విడుదల; వివరాలు
హ్యుందాయ్ మోటార్ ఇండియా నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 7-సీటర్ ఎస్‌యూవీ 'హ్యుందాయ్ అల్కజార్' (అలియాస్ క్రెటా 7-సీటర్) విడుదలకు మహుర్తం ఖరారైనట్లుగా తెలుస్తోంది. మార్కెట్ సమాచారం ప్రకారం, కంపెనీ ఈ ఎస్‌యూవీని జూన్ 18వ తేదీ మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది.

వాస్తవానికి, హ్యుందాయ్ అల్కజార్ ఇప్పటికే దేశీయ మార్కెట్లో విడుదల కావల్సి ఉన్నప్పటికీ, దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా ఈ కారు విడుదల ఆలస్యమైంది. అయితే, ప్రస్తుతం కొత్త కోవిడ్ కేసులు తగ్గుతుండటం మరియు పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతుండటంతో, అల్కజార్‌ను కంపెనీ ఈ నెలలోనే విడుదల చేయాలని చూస్తోంది.

హ్యుందాయ్ దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ 'హ్యుందాయ్ క్రెటా' 5-సీటర్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ ఇందులో 'అల్కజార్' పేరుతో ఈ 7-సీటర్ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తోంది. ఈ మోడల్‌ను క్రెటా ప్లాట్‌ఫామ్‌పై తయారు చేస్తున్న నేపథ్యంలో, క్రెటాలో కనిపించే అనేక ఫీచర్లు అల్కజార్‌లో కూడా కనిపించనున్నాయి.

ఈ ఎస్‌యూవీ హ్యుందాయ్ క్రెటా కన్నా పొడవుగా ఉండేలా రూపొందించబడింది. ముఖ్యంగా, ఇది హ్యుందాయ్ క్రెటా కంటే 150 మి.మీ ఎక్కువ వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. పెరిగిన వీల్‌బేస్ కారణంగా, అల్కజార్‌లో మూడవ వరుస సీటును అమర్చడం సాధ్యమైంది. సరికొత్త హ్యుందాయ్ ఆల్కాజార్ ఎస్‌యూవీని పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో 6 వేరియంట్లు మరియు 6 కలర్ ఛాయిస్‌లలో అందించనున్నారు.

హ్యుందాయ్ అల్కాజార్‌ను సిగ్నేచర్, సిగ్నేచర్ (ఓ), ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ (ఓ) మరియు ప్లాటినం, ప్లాటినం (ఓ) అనే ఆరు వేరియంట్లలో విడుదల చేయనున్నారు. కస్టమర్ ఎంచుకునే వేరియంట్‌ను బట్టి ఇది 6-సీటర్ లేదా 7-సీటర్ కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉంటుంది.

అలాగే, ఈ ఎస్‌యూవీని టైఫూన్ సిల్వర్, టైటాన్ గ్రే, టైగా బ్రౌన్, స్టార్రి నైట్, పోలార్ వైట్ మరియు ఫాంటమ్ బ్లాక్ అనే ఆరు కలర్ ఆప్షన్లలో అందించనున్నారు. కాకపోతే, ఇంటీరియర్ మాత్రం ఒకే కలర్‌లో ఉంటుంది. కాగ్నాక్ బ్రౌన్ కలర్ ఆప్షన్ ఇంటీరియర్‌తో కంపెనీ ఈ ఎస్‌యూవీని అందించనుంది.

హ్యుందాయ్ అల్కజార్‌లో క్యాస్కేడింగ్ ఫ్రంట్ గ్రిల్, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ క్లస్టర్, ఆల్-ఎల్ఈడి లైటింగ్, లాంగ్ రియర్ ఓవర్‌హాంగ్, వెనుక భాగంలో క్వార్టర్ గ్లాస్, 18 ఇంచ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ రూఫ్ రైల్స్ మరియు ఆల్‌రౌండ్ బాడీ క్లాడింగ్ మొదలైన ఎక్స్టీరియర్ ఫీచర్లు ఉన్నాయి.

ఇంకా ఇందులో పెద్ద 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో పాటు హ్యుందాయ్ యొక్క లేటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీ, పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మొదలైన ఫీచర్లు మరెన్నో ఉన్నాయి.

అంతేకాకుండా, ఇందులో క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, పానోరమిక్ సన్‌రూఫ్, ఇంజన్ స్టార్ట్ / స్టాప్ బటన్, పెద్ద ఎమ్ఐడి డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆరు ఎయిర్‌బ్యాగులు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్‌లు మొదలైన స్మార్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, హ్యుందాయ్ అల్కాజార్ 2.0-లీటర్ 'ఎన్‌యు' ఫోర్-సిలిండర్ డిఓహెచ్‌సి పెట్రోల్ ఇంజన్ మరియు 1.5-లీటర్ ఫోర్ సిలిండర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లను కలిగి ఉంటుంది. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 157 బిహెచ్‌పి శక్తిని మరియు 192 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

అలాగే, డీజిల్ ఇంజన్ గరిష్టంగా 115 బిహెచ్‌పి శక్తిని మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు కూడా 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యం కానున్నాయి. మార్కెట్ అంచనా ప్రకారం, హ్యుందాయ్ అల్కజార్ ధర సుమారు రూ.11 లక్షల నుంచి రూ.19 లక్షల మధ్యలో ఉండొచ్చని సమాచారం.


Click it and Unblock the Notifications








