షాకింగ్.. రూ.30,000 మేర పెరిగిన నిస్సాన్ మాగ్నైట్ ధరలు
నిస్సాన్ మాగ్నైట్ కారును కొనాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. కంపెనీ అందిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ మాగ్నైట్‌లో టర్బో వేరియంట్ ధరలను కంపెనీ భారీగా పెంచింది. గతేడాది డిసెంబర్ నెలలో మార్కెట్లో విడుదలైన నిస్సాన్ మాగ్నైట్, వినియోగదారుల నుండి మంచి స్పందనను అందుకుంటోంది.

నిస్సాన్ మాగ్నైట్‌ను డిసెంబర్ 2020లో కేవలం రూ.4.99 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధరకే విడుదల చేశారు. అయితే, ఆ తర్వాత జనవరి 2021లో ఈ ప్రారంభ వేరియంట్ ధరను మాత్రమే రూ.50,000 మేర పెంచి రూ.5.49 లక్షలు చేశారు. కాగా, ఇప్పుడు ఇందులో టర్బో వేరియంట్ ధరలను మాత్రమే రూ.30,000 మేర పెంచారు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

నిస్సాన్ మాగ్నైట్ 1.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ మరియు 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. టర్బో వేరియంట్లపై పెరిగిన ధరలు మార్చి 2 నుండి అమల్లోకి వస్తాయని కంపెనీ పేర్కొంది. కాగా, ఇందులో న్యాచురల్ పెట్రోల్ వేరియంట్ ధరలను మాత్రం కంపెనీ పెంచలేదు.

అయితే, నిస్సాన్ మాగ్నైట్ కారును ఇప్పటికే బుక్ చేసుకున్న కస్టమర్లకు మాత్రం ఈ ధరల పెంపు వర్తించదు. పాత ధరల వద్దనే వారికి డెలివరీలను అందజేయనున్నారు. కాగా, ఈ టర్బో వేరియంట్లను కొత్తగా బుక్ చేసుకునే కస్టమర్లు మాత్రం కొత్త ధరల వద్దనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

మాగ్నైట్ ఎక్స్‌వి టర్బో, ఎక్స్‌వి టర్బో సివిటి వేరియంట్ల ధరలు రూ.16,000 మేర పెరిగాయి. అలాగే ఎక్స్‌వి టర్బో ప్రీమియం (ఓ), ఎక్స్‌వి ప్రీమియం సివిటి (ఓ) ధరలు రూ.26,000 మేర పెరగగా ఎక్స్‌ఎల్ టర్బో మరియు ఎక్స్‌ఎల్ టర్బో సివిటి వేరియంట్ల ధరలు రూ.30,000 పెరిగాయి.

తాజా ధరల పెంపు తర్వాత నిస్సాన్ మాగ్నైట్ ఎక్స్‌ఎల్ టర్బో ధర రూ.6.99 లక్షల నుంచి రూ.7.29 లక్షలకు చేరుకుంది. ఎక్స్‌వి టర్బో ధర రూ.7.82 లక్షల నుంచి రూ.7.98 లక్షలకు పెరగగా, ఎక్స్‌వి టర్బో ప్రీమియం (ఓ) ధర రూ.8.59 లక్షల నుంచి రూ.8.85 లక్షలకు పెరిగింది.

అలాగే, మాగ్నైట్ ఎక్స్‌ఎల్ టర్బో సివిటి ధర రూ.7.89 లక్షల నుంచి రూ.8.19 లక్షలకు పెరగగా, ఎక్స్‌వి టర్బో సివిటి ధర రూ.8.72 లక్షల నుంచి రూ.8.88 లక్షలకు చేరుకుంది. ఇకపోతే, టాప్-ఎండ్ వేరియంట్ అయిన ఎక్స్‌వి ప్రీమియం సివిటి (ఓ) ధర రూ.9.49 లక్షల నుంచి రూ.9.75 లక్షలకు పెరిగింది (పైన పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

నిస్సాన్ మాగ్నైట్‌ను మార్కెట్లో విడుదల చేసిన 3 నెలల వ్యవధిలోనే కంపెనీ ఇందులోని వివిధ వేరియంట్ల ధరలను పెంచడం ఇది వరుసగా రెండవసారి. అయితే, కొత్తగా ధరలు పెంచిన తర్వాత కూడా మాగ్నైట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.10 లక్షల లోపే ఉంది.

నిస్సాన్ ఇండియా ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఎక్స్‌ఇ (బేస్), ఎక్స్‌ఎల్ (మిడ్), ఎక్స్‌వి (హై) మరియు ఎక్స్‌వి (ప్రీమియం) నాలుగు వేరియంట్లలో అందిస్తుంది. ప్రతి వేరియంట్ కూడా న్యాచురల్ మరియు టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది.

మార్కెట్లో నిస్సాన్ మాగ్నైట్ అనూహ్యమైన విజయాన్ని సాధించింది. ఈ మోడల్ మార్కెట్లోకి ప్రవేశించినప్పటి నుండి ఇప్పటి వరకూ సుమారు 40,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లను దక్కించుకుంది. ప్రస్తుతం ఇందులోని కొన్ని వేరియంట్ల కోసం సుమారు 6 నెలల వరకూ వెయిటింగ్ పీరియడ్ ఉంటోంది.

నిస్సాన్ మాగ్నైట్ వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించేందుకు కంపెనీ తమ చెన్నై ప్లాంట్‌లో మూడవ షిఫ్టును కూడా ప్రారంభించి, ఈ మోడల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచింది. దీని ఫలితంగా, రానున్న రోజుల్లో మాగ్నైట్ వెయిటింగ్ పీరియడ్ తగ్గొచ్చని భావిస్తున్నారు.

నిస్సాన్ మాగ్నైట్ టర్బో పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 99 బిహెచ్‌పి పవర్‌ను మరియు 160 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. దీని మ్యాన్యువల్ గేర్‌బాక్స్ వెర్షన్ లీటరుకు 20 కిలోమీటర్లు మరియు ఆటోమేటిక్ వెర్షన్ లీటరుకు 17.7 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

టర్బో ఇంజన్ కాకుండా మాగ్నైట్ రెగ్యులర్ పెట్రోల్ ఇంజన్‌తో కూడా లభిస్తుంది. ఇందులో 1.0-లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 72 బిహెచ్‌పి పవర్‌ను మరియు 96 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఇందులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉండదు. ఇది లీటరుకు 18.75 కిలోమీటర్ల సర్టిఫైడ్ మైలేజ్‌ను ఆఫర్ చేస్తుంది.


Click it and Unblock the Notifications








