కొత్త 2022 MG ZS EV వర్సెస్ Tata Nexon EV: ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటారు..?
చైనీస్ యాజమాన్యంలో ఉన్న బ్రిటీష్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్స్ (MG Motors) ఇటీవల భారత మార్కెట్లో తమ సరికొత్త అప్‌డేటెడ్ 2022 మోడల్ ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ (2022 MG ZS EV) ని విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఈ కొత్త మోడల్ రిఫ్రెష్డ్ డిజైన్ తో పాటుగా పెద్ద బ్యాటరీ ప్యాక్ తో లభిస్తుంది. కంపెనీ ఈ ఎస్‌యూవీని ఎక్సైట్ మరియు ఎక్స్‌క్లూజివ్ అనే రెండు వేరియంట్‌లలో విక్రయిస్తోంది. భారత ఎలక్ట్రిక్ కార్ విభాగంలో ఇది రేంజ్ మరియు ఫీచర్ల పరంగా టాటా నెక్సాన్ (Tata Nexon EV) తో పోటీ పడుతుంది. మరి ఈ రెండు మోడళ్ల మధ్య ఉన్న పోలికలు, వ్యత్యాసాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

2022 MG ZS EV vs Tata Nexon EV: ధర
ఎమ్‌జి మోటార్ ఇండియా తమ కొత్త అప్‌డేటెడ్ 2022 MG ZS EV ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని రూ. 22.00 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 25.88 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఇక Tata Nexon EV ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విషయానికి వస్తే, ప్రస్తుతం మార్కెట్లో దీని ధరలు రూ. 14.29 లక్షల నుండి రూ. 16.90 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి. ధర పరంగా చూసుకుంటే, ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ కన్నా టాటా నెక్సాన్ ఈవీ సరసమైనదిగా ఉంటుంది.

2022 MG ZS EV vs Tata Nexon EV: కొలతలు
కొత్త 2022 ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ 4,323 mm పొడవును, 1,809 mm వెడల్పును మరియు 1,649 mm ఎత్తును కలిగి ఉంటుంది. అదే సమయంలో, దాని వీల్‌బేస్ 2,581 mm గా ఉంటుంది. ఈ కారులో 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ అందుబాటులో ఉంటాయి. ఇత టాటా నెక్సాన్ ఈవీ విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పొడవు 3,993 mm, వెడల్పు 1,811 mm, ఎత్తు 1,606 mm మరియు వీల్‌బేస్ 2,498 mm గా ఉంటుంది. కొలతల పరంగా చూస్తే, టాటా నెక్సాన్ ఈవీ కన్నా ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ విశాలంగా ఉండి, మంచి క్యాబిన్ మరియు బూట్ స్పేస్ ను కలిగి ఉంటుంది.

2022 MG ZS EV vs Tata Nexon EV: మోటార్, బ్యాటరీ మరియు రేంజ్
ఇక ఈ రెండు మోడళ్లలో ఉపయోగించిన పవర్‌ట్రైన్ విషయానికి వస్తే, కొత్త 2022 MG ZS EV ఈవీలో పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ ను ఉపయోగించారు. ఈ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 176 బిహెచ్‌పి శక్తిని మరియు 280 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ కొత్త మోడల్ లో ఇప్పుడు 50 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్ ని ఉపయోగించారు.

ఈ ఎస్‌యూవీలోని బ్యాటరీ పూర్తి ఛార్జ్‌పై గరిష్టంగా 461 కిమీల సర్టిఫైడ్ రేంజ్ ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. కొత్త 2022 మోడల్ ఎమ్‌జి జెడ్ఎస్ యొక్క ప్రస్తుత రేంజ్ (461 కిమీ) ఇదివరకటి మోడల్ కంటే 42 కిమీ ఎక్కువ. ఇక చార్జింగ్ సమయం విషయానికి వస్తే, ఈ బ్యాటరీ ప్యాక్ ని 50 kW DC ఫాస్ట్ ఛార్జర్ సాయంతో ఛార్జ్ చేసినప్పుడు, ఇందులోని బ్యాటరీ కేవలం 60 నిమిషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది.

మరోవైపు, టాటా నెక్సాన్ ఈవీ విషయానికి వస్తే, కంపెనీ ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పర్మినెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ ను ఉపయోగించింది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 129 బిహెచ్‌పి శక్తిని మరియు 245 ఎన్ఎమ్ టార్క్ ను జనరేట్ చేస్తుంది. టాటా నెక్సాన్ ఈవీ లోని బ్యాటరీ గురించి మాట్లాడితే, టాటా మోటార్స్ ఈ ఎలక్ట్రిక్ కారులో 30.2 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్ ని ఉపయోగించిది. ఇది పూర్తి చార్జ్ పై 312 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ను అందిస్తుంది.

ఇక చార్జింగ్ విషయానికి వస్తే, నెక్సాన్ ఈవీలోని బ్యాటరీని 25 kW DC ఫాస్ట్ ఛార్జర్‌తో ఛార్జ్ చేసినప్పుడు కేవలం 60 నిమిషాల్లోనే 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. పవర్ టార్క్ గణాంకాల పరంగా చూస్తే, టాటా నెక్సాన్ ఈవీ కంటే ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ చాలా మెరుగ్గా ఉంటుంది. అయితే, ధర పరంగా చూసుకుంటే మాత్రం టాటా నెక్సాన్ ఈవీ చవకగా ఉంటుంది.

ఇదిలా ఉంటే, టాటా మోటార్స్ కూడా నెక్సాన్ ఈవీలో పూర్తి చార్జ్ పై 400 కిలోమీటర్లకు పైగా రేంజ్ ను అందించే ఓ కొత్త వేరియంట్ ను తయారు చేస్తోంది మరియు త్వరలోనే ఇది మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. లేటెస్ట్ ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








