టాటా ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న డిమాండ్.. వెయిటింగ్ పీరియడ్ తగ్గించేందుకు టాటా ప్లాన్స్..
భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. దేశంలో నిరంతరాయంగా పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో, కొనుగోలుదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపు ఆసక్తి చూపుతున్నారు. దీంతో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను కొనేవారి సంఖ్య కూడా అధికమైంది. ఈ నేపథ్యంలో టాటా మోటార్స్ (Tata Motors) దేశంలో ఈవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి తమ ఎలక్ట్రిక్ కార్లు మరియు ఎస్‌యూవీల ఉత్పత్తిని పెంచనున్నట్లు కంపెనీ ధృవీకరించింది.

టాటా మోటార్స్, ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికల్ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో టాటా టిగోర్ ఈవీ (Tata Tigor EV) సెడాన్ మరియు టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV) ఎస్‌యూవీలను విక్రయిస్తుండగా, ఫ్లీట్ ఆపరేటర్ల కోసం టాటా ఎక్స్‌ప్రెస్-టి (Tata Xpress-T) ఎలక్ట్రిక్ కారును విక్రయిస్తోంది. ప్రతి నెలా కంపెనీ తమ ఈవీ లైనప్ కోసం సగటున 5,500 నుండి 6,000 బుకింగ్‌లను స్వీకరిస్తోంది. టాటా ఈవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి కంపెనీ ఇప్పుడు తమ వాహనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచనుంది.

ఈ విషయం గురించి టాటా మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ (ప్యాసింజర్ వెహికల్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్) ఎమ్‌డి శైలేష్ చంద్ర మాట్లాడుతూ, "ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ వాటి సరఫరా కంటే గణనీయంగా పెరుగుతుండటాన్ని మేము చూస్తున్నామని, ప్రతి నెలా టాటా మోటార్స్ దాదాపు 6,000 యూనిట్ల ఎలక్ట్రిక్ వాహనాలకు ఆర్డర్‌లను స్వీకరిస్తోందని, తమ ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ ఖచ్చితంగా చాలా బలంగా ఉందని, ఇది తమ వద్ద ఉన్న బుకింగ్‌ల సంఖ్యలో ప్రతిబింబిస్తుందని" అన్నారు.

ప్రస్తుతం, టాటా మోటార్స్ తయారు చేస్తున్న ఎలక్ట్రిక్ కార్ల కన్నా ఎక్కువ సంఖ్యలో బుకింగ్‌లు వస్తున్నాయి. కంపెనీ తమ ఎలక్ట్రిక్ వాహనాల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చలేకపోతోంది. ఫలితంగా, టాటా ఎలక్ట్రిక్ కార్లకు వెయిటింగ్ పీరియడ్ కూడా అధికంగా ఉంటోంది. టాటా మోటార్స్ ప్రస్తుతం ప్రతి నెలా సగటున 3,300 నుండి 3,400 ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తోంది. అయితే, వీటికి డిమాండ్ మాత్రం ఉత్పత్తి కన్నా రెట్టింపు సంఖ్యలో ఉంది. దీంతో కంపెనీ ఇప్పుడు తమ వాహనాల ఉత్పత్తి సంఖ్యలను పెంచాలని చూస్తోంది.

టాటా మోటార్స్ తయారు చేస్తున్న ఎలక్ట్రిక్ కార్లలో ప్రస్తుతం అతి ముఖ్యమైన భాగం సెమీ కండక్టర్ చిప్స్. ఇలాంటి ముఖ్యమైన వస్తువులకు స్థిరమైన సరఫరాను నిర్ధారించడానికి కంపెనీ బహుళ సరఫరాదారుల నుండి సెమీకండక్టర్ల సోర్సింగ్ చేస్తోంది. ఈ చర్యల వలన వాహనాల ఉత్పత్తిని గణనీయంగా పెంచడం సాధ్యమవుతోందని, కేవలం ఏడు నెలల క్రితం తాము కేవలం 600 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేసామని, ఆ తర్వాత తీసుకున్న చర్యల కారణంగా వాటిని నెలకు 1,500-1,700 స్థాయిలకు మరియు ఆ తరువాత 3,000-3500 స్థాయిలకు పెంచగలిగామని శైలేష్ చంద్ర చెప్పారు.

ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) అందించిన డేటా ప్రకారం, టాటా మోటార్స్ గడచిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 15,198 EV లను విక్రయించింది. అంటే, టాటా మోటార్స్ గత ఆర్థిక సంవత్సరంలో దేశంలో విక్రయించిన మొత్తం ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్లలో 85.37 శాతం వాటాను కలిగి ఉంది. ప్రస్తుతం, ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో టాటా మోటార్స్‌కు నెక్సాన్ EV అగ్రగామి మోడల్‌గా ఉంది. ఈ నెలాఖరు లోపుగా కంపెనీ ఇందులో పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో కూడిన లాంగ్ రేంజ్ వేరియంట్ ను విడుదల చేయవచ్చని సమాచారం.

పెరిగిన టాటా టిగోర్ మరియు టాటా నెక్సాన్ ఈవీ ధరలు
ఇదిలా ఉంటే టాటా మోటార్స్ ఇటీవలే తమ టిగోర్ ఈవీ (Tata Tigor EV) మరియు నెక్సాన్ ఈవీ (Tata Nexon EV) ధరలను రూ.25,000 వరకూ పెచింది. దీంతో ఇప్పుడు టిగోర్ ఈవీ ప్రారంభ ధర రూ. 12.24 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరుకుంది. అలాగే, తాజా ధరల పెంపు అనంతరం మార్కెట్లో నెక్సాన్ ఈవీ ధరలు రూ. 14.54 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి. ధరల పెంపు మినహా కంపెనీ ఈ రెండు మోడళ్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. టిగోర్ ఈవీ పూర్తి చార్జ్ పై 306 కిమీ సర్టిఫైడ్ రేంజ్ ను అందిస్తుండగా, నెక్సాన్ ఈవీ పూర్తి చార్జ్ పై గరిష్టంగా 312 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ను అందిస్తుంది.

టాటా కర్వ్ (Tata Curvv) ఈవీ కాన్సెప్ట్ ఆవిష్కరణ
టాటా మోటార్స్ తాజాగా తమ సరికొత్త ఎలక్ట్రిక్ కార్ కాన్సెప్ట్ 'టాటా కర్వ్' (Tata Curvv) ను ఈ నెల ఆరంభంలో అధికారికంగా ఆవిష్కరించింది. టాటా కర్వ్ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ ఈ బ్రాండ్ నుండి రాబోయే మూడవ ఆల్-ఎలక్ట్రిక్ కారు అవుతుంది. కంపెనీ ఈ కారును కూపే డిజైన్ తో తయారు చేసింది. టాటా కర్వ్ ఈవీ కాన్సెప్ట్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకూండా చాలా స్పోర్టీగా కూడా కనిపిస్తుంది. ఈ కొత్త 'టాటా కర్వ్' (Tata Curvv) భారత మార్కెట్లో 2024 నాటికి అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంది. - ఈ కారుకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications