హవ్వ.. హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta)కి 3-స్టార్ సేఫ్టీ రేటింగ్ మాత్రమేనా..? సేఫ్టీలో ఇది అంత వీకా..?
భారత మిడ్-సైజ్ ఎస్‌యూవీ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న వాహనాలలో ఎల్లప్పుడూ అగ్రస్థానంలో ఉండే హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta), సేఫ్టీ విషయంలో మాత్రం చాలా వెనుకబడి ఉంది. ఈ విషయాన్ని నేను చెప్పడం లేదు, గ్లోబల్ ఎన్‌క్యాప్ (Global NCAP) ఏజెన్సీ ఈ ఎస్‌యూవీ కోసం నిర్వహించిన క్రాష్ టెస్టులో ఇది 3-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందినట్లు సదరు ఏజెన్సీ తెలిపింది. హ్యుందాయ్ విక్రయిస్తున్న పాపులర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఐ20 (Hyundai i20) కూడా ఈ క్రాష్ టెస్టులో 3-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది.

ఈ క్రాష్ టెస్ట్ కోసం గ్లోబల్ ఎన్‌క్యాప్ ఎంట్రీ లెవల్ క్రెటా మరియు ఎంట్రీ లెవల్ ఐ20 వేరియంట్‌లను ఉపయోగించింది. ఈ రెండు మోడళ్లలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్)తో కూడిన ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఫ్రంట్ సీట్‌బెల్ట్ రిమైండర్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి సేఫ్టీ ఫీచర్లను మాత్రమే స్టాండర్డ్‌గా అందిస్తున్నారు. అయినప్పటికీ, ఈ రెండు కార్లు గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో 3-స్టార్ రేటింగ్‌ను మాత్రమే పొందాయి.

హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీని గంటకు 65 కిలోమీటర్ల వేగంతో ఫ్రంటల్ ఆఫ్‌సెట్ క్రాష్ టెస్ట్‌కు గురిచేసినప్పుడు, హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ పెద్దల రక్షణ కోసం 3 స్టార్ రేటింగ్‌ను సాధించింది. ఈ పరీక్షలో ఎస్‌యూవీ యొక్క బాడీ షెల్ అస్థిరంగా ఉన్నట్లు కనుగొనబడింది మరియు అది ప్రమాద తీవ్రతను తట్టుకోలేకపోయింది. అంతేకాకుండా, ఈ కారు యొక్క ఫుట్‌రెస్ట్ కూడా చాలా అస్థిరంగా ఉన్నట్లు కనుగొనబడింది.

ఈ ఎస్‌యూవీ మొత్తం 17 పాయింట్లకు గానూ 8 పాయింట్లు సాధించింది. అయితే, డ్రైవర్ మరియు కో-ప్యాసింజర్ హెడ్ ప్రొటెక్షన్ విషయంలో మంచిగా రేట్ చేయబడింది. గ్లోబల్ ఎన్‌క్యాప్ యొక్క నివేదిక ప్రకారం, ఈ ఎస్‌యూవీలో డ్రైవర్ మరియు కో-డ్రైవర్ మెడకు మంచి రక్షణ లభించింది. అయితే, డ్రైవర్‌కు ఛాతీ భాగంలో మాత్రం రక్షణ అంతంతమాత్రంగానే ఉంది మరియు కో-ప్యాసింజర్ ఛాతీ రక్షణ బాగానే ఉంది.

ఫ్రంటల్ కొల్లైజన్ (ముందు వైపు నుండి జరిగే యాక్సిడెంట్స్) సమయంలో డ్రైవర్ మరియు కో-ప్యాసింజర్ ముందు ఉన్న డాష్‌బోర్డ్ వెనుక ఉండే 'ప్రమాదకరమైన నిర్మాణాల' నుండి డ్యాష్‌బోర్డ్ వారి మోకాలికి రక్షణ అందిస్తుందని ఈ నివేదికలో పేర్కొనబడి ఉంది. చిన్నారుల విషయంలో కూడా హ్యుందాయ్ క్రెటా 3-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. ఈ విషయంలో ఇది గరిష్టంగా 49 పాయింట్లకు గాను 28.29 పాయింట్లను స్కోర్ చేసింది. హ్యుందాయ్ క్రెటా బేస్ వేరియంట్ ISOFIX చైల్డ్ సీట్ యాకంర్లు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం అని నివేదికలో పేర్కొన్నారు.

ఈ క్రాష్ టెస్టులో 3 ఏళ్ల ఫ్రంట్ ఫేసింగ్ డమ్మీ కోసం సీట్ బెల్ట్ విఫలమైందని, టీ హెడ్ అధికంగా ముందుకు వెళ్లకుండా నిరోధించవచ్చని నివేదిక సూచిస్తుంది. నిజానికి, ఛాతీ రక్షణ 'బలహీనమైనది'గా రేట్ చేయబడింది. అయితే, 1.5 ఏళ్ల వయస్సు ఉన్న వెనుకవైపు ఉన్న డమ్మీ తల మరియు ఛాతీకి మంచి రక్షణ ఉన్నట్లు గుర్తించబడింది. మొత్తమ్మీద చూస్తే, హ్యుందాయ్ క్రెటా ఈ క్రాష్ టెస్టులో ఓవరాల్ 3-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. నిజానికి, ఇది అంత సంతృప్తికరమైన సేఫ్టీ రేటింగ్ కాదనే చెప్పాలి.

ఇక హ్యుందాయ్ ఐ20 విషయానికి వస్తే, అడల్ట్ సేఫ్టీ విషయంలో ఈ కారు మొత్తం 17 పాయింట్లకు 8.84 పాయింట్ల స్కోరును సాధించింది, ఫ్రంటల్ క్రాష్ టెస్టులో బాడీషెల్ మరియు ఫుట్‌వెల్ ప్రాంతం అస్థిరంగా ఉన్నట్లు గుర్తించబడింది. ఐ20 కారులో డ్రైవర్ ఛాతీకి బలహీనమైన రక్షణ లభిస్తందని గుర్తించబడింది. అలాగే, డ్రైవర్ మరియు క్యో-ప్యాసింజర్ మోకాళ్లకు ఓ మోస్తరు రక్షణ లభిస్తుందని నివేదిక పేర్కొంది.

హ్యుందాయ్ ఐ20లో ఫ్రంట్ ప్యాసింజర్ మరియు డ్రైవర్ యొక్క తల మరియు మెడ భాగాలకు తగిన రక్షణ లభించింది. చిన్నారుల సేఫ్టీ విషయంలో ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 49 పాయింట్లకు 36.89 పాయింట్లను స్కోర్ చేసింది. ఇది ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లను స్టాండర్డ్ ఫీచర్‌గా పొందుతుంది. ఈ క్రాష్ టెస్టులో, ISOFIX యాంకర్లు అధిక ఫార్వర్డ్ మూవ్‌మెంట్‌ను నిరోధించాయి. అయితే, ఇది పిల్లల మెడ ప్రాంతానికి పేలవమైన రక్షణను అందిస్తుందని నివేదిక తెలిపింది.

హ్యుందాయ్ క్రెటా ‘నైట్ ఎడిషన్' (Hyundai Creta Knight Edtion) వస్తోంది..
ఇదిలా ఉంటే, హ్యుందాయ్ తమ క్రెటా ఎస్‌యూవీలో ఓ నైట్ ఎడిషన్ ను (Hyundai Creta Knight Edtion) విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. సమాచారం ప్రకారం, హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. ఇందులో ఒకటి ఎస్ ప్లస్ నైట' వేరియంట్ కాగా మరొకటి ఎస్ఎక్స్(ఓ) నైట్ వేరియంట్. ఇవి రెండూ కూడా పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లతో లభ్యం కానున్నాయి. మార్కెట్లో వీటి ధరలు రూ.13.35 లక్షల నుండి రూ.18.02 లక్షల మధ్యలో ఉండనున్నాయి. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








