భారత్‌లో ఉరుస్ అమ్మకాలు పైపైకి.. ఇప్పటికే 200 యూనిట్లు
ఎక్కువమంది సెలబ్రెటీలు ఇష్టపడి కొనుగోలు చేసే లగ్జరీ వెహికల్ బ్రాండ్స్ లో ఒకటి 'లంబోర్ఘిని' (Lamborghini). కావున లంబోర్ఘిని కంపెనీకి ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. భారతదేశంలో కూడా దీనికున్న ఆదరణ తక్కువేమీ కాదు. ఈ కారణంగానే కంపెనీ భారతీయ మార్కెట్లో తన 'ఉరస్' (Urus) ను ఇప్పటివరకు 200 యూనిట్లు విక్రయించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూద్దాం.. రండి.

లంబోర్ఘిని కంపెనీ తన ఉరస్ ఎస్‌యువిని విడుదల చేసిన నాలుగున్నర సంవత్సరాల్లో 200 యూనిట్లను కేవలం భారతీయ మార్కెట్లో విక్రయించగలిగింది.ఇది నిజంగానే కంపెనీ భారతీయ సాధించిన విజయం అనే చెప్పాలి. రానున్న రోజుల్లో ఈ అమ్మకాల సంఖ్య తప్పకుండా పెరుగుతుంది.

2021 మార్చి నాటికి కంపెనీ దేశీయ మార్కెట్ల్ప్ 100 కంటే ఎక్కువ యూనిట్లను విక్రయించింది. మొత్తం మీద భారతదేశంలో లంబోర్ఘిని కంపెనీ నుంచి ఎక్కువమంది కొనుగోలు చేసిన మరియు చేసే వాహనాల్లో 80 శాతం 'ఉరుస్' ఎస్‌యువిలే ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే లంబోర్గిని ఉరుస్ కి భారతీయ మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది అని అర్థమవుతోంది.

ఒక్క భారతేదేశంలోనే 200 యూనిట్లు అమ్ముడైన ఈ SUV ప్రపంచ వ్యాప్తంగా 20,000 యూనిట్ల అమ్మకాలను పొందింది. లంబోర్ఘిని ఉరుస్ ఎస్‌యువిని కొనుగోలు చేసే వారు ఎక్కువగా గియాల్లో ఆజ్ కలర్ (ఎల్లో కలర్) ఎంచుకుంటున్నారు. దీనితోపాటు నీరో నోక్టిస్ (నలుపు) మరియు బియాంకో మోనోసెరోస్ (తెలుపు) కలర్ కూడా ఎక్కువగానే కొనుగోలు చేస్తున్నారు.

భారతీయ మార్కెట్లో లంబోర్ఘిని ఉరస్ ధర రూ. 3.15 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఇది అత్యంత ఆకర్షణీయమైన కలర్ ఆప్సన్స్ తో పాటు, ఆధునిక డిజైన్ మరియు అధునాతన పరికరాలను పొందుతుంది. ఇందులో ఐదు మంది ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. అదే సమయంలో ఇది మంచి పనితీరుని కూడా అందిస్తుంది.

లంబోర్ఘిని ఉరుస్ యొక్క డిజైన్ దాని హురాకాన్ సూపర్‌కార్ నుండి ప్రేరణ పొందింది. కావున ఇది మంచి డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో స్లిమ్ ఎల్ఈడీ హెడ్‌లైట్ మరియు టెయిల్ లైట్స్ ఉంటాయి. ఇది 21 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌తో అందించబడుతుంది. కానీ 22 ఇంచెస్ మరియు 23 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఆప్సన్ కూడా అందుబటులో ఉంటుంది.

లంబోర్ఘిని ఉరస్ లో 4.0 లీటర్, 8-సిలిండర్ ట్విన్-టర్బో వి8 ఇంజన్ అందుబాటులో ఉంటుంది. ఈ ఇంజన్ లంబోర్ఘిని యొక్క అత్యంత శక్తివంతమైన ఇంజిన్‌లలో ఒకటి. కావున ఇది 641 బిహెచ్‌పి పవర్ మరియు 850 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 3.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కి.మీ వరకు వేగవంతం అవుతుంది. అదే సమయంలో 12.8 సెకన్లలో గంటకు 0 నుంచి 200 కి.మీ వరకు వేగవతం అవుతుంది. మొత్తం మీద దీని టాప్ స్పీడ్ గంటకు 305 కిమీ వరకు ఉంది.

లంబోర్ఘిని ఉరస్ ఆరు డ్రైవింగ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. అవి స్ట్రాడా, స్పోర్ట్, కోర్సా, సబ్బియా, టెర్రా మరియు నెవ్ మోడ్స్. ఇందులో ఇన్ని డ్రైవింగ్ మోడ్స్ ఉండటం వల్ల ఎలాంటి రోడ్డుపై అయినా సజావుగా ముందుకు సాగడానికి అనుమతిస్తుంది. కావున వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

ఇదిలా ఉండగా లంబోర్ఘిని గత సంవత్సరం తన ఉరుస్ తో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మోటారు రహదారి 'ఉమ్లింగ్ లా పాస్' పై ప్రయాణించి రికార్డ్ బద్దలు కొట్టింది. ఇది సముద్ర మట్టానికి ఏకంగా 19,300 అడుగుల ఎత్తులో ఉంది. గత సంవత్సరం కంపెనీ ఈ రికార్డు కైవసం చేసుకున్న తరువాత.. ఇప్పుడు అమ్మకాల్లో మరో రికార్డ్ కైవసం చేసుకుంది.
కంపెనీ ఇటీవల తన 'అవెంటడార్ అల్టిమే కూపే' (Aventador Ultimae Coupe) ని భారతదేశపు కస్టమర్ కి డెలివరీ చేసింది. కంపెనీ యొక్క ఈ సూపర్ కార్ భారతదేశంలో మొట్ట మొదటిది కావడం విశేషం. ఇటాలియన్ సూపర్ కార్ తయారీదారు లంబోర్ఘిని ఇప్పటికే 'అవెంటడార్ అల్టిమే' యొక్క రెండు డోర్ల వెర్షన్‌ను భారతదేశంలో డెలివరీ చేసింది. ఈ అవెంటడార్ అల్టిమే ఎల్లో కలర్ లో చాలా ఆకర్షణీయంగా ఉంది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
ఇటాలియన్ సూపర్ కార్ తయారీ సంస్థ 'లంబోర్ఘిని' ఇప్పుడు భారతీయ మార్కెట్లో తన 'ఉరుస్' అమ్మకాలతో దినదినాభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే భారతదేశంలో ఎన్టీఆర్, ప్రభాస్ మొదలైనవారు లంబోర్ఘిని బ్రాండ్ వాహనాలను కలిగి ఉన్నారు. రానున్న రోజుల్లో లంబోర్ఘిని దేశీయ మార్కెట్లో మరింత గొప్ప అమ్మకాలను పొందుతుంది అని ఆశిస్తున్నాము.


Click it and Unblock the Notifications








