బుకింగ్‌లేమో బారెడు.. డెలివరీలేమో జానెడు.. XUV700 కి 1.5 లక్షల బుకింగ్స్, ఏడాది పైగా వెయిటింగ్!
దేశీయ వాహన తయారీ సంస్థ 'మహీంద్రా అండ్ మహీంద్రా' ఇండియన్ మార్కెట్లో 'మహీంద్రా ఎక్స్‌యూవీ700' (Mahindra XUV700) విడుదల చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు అంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఎందుకంటే కంపెనీ ఈ SUV కోసం బుకింగ్స్ ప్రారంభించిన రోజు నుంచి ఇప్పటికి ఏకంగా 1.5 లక్షల బుకింగ్స్ స్వీకరించగలిగింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

మహీంద్రా కంపెనీ తన XUV700 కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించిన కేవలం 3 గంటల సమయంలోనే 50,000 బుకింగ్స్ స్వీకరించి గొప్ప రికార్డ్ సృష్టించింది. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే కేవలం 3 గంటల్లో 50,000 బుకింగ్స్ అంటే అది సాధారణమైన విషయం కాదు. దీన్ని బట్టి చూస్తే ఈ SUV కి ప్రారంభం నుంచి ఎంత డిమాండ్ ఉందొ స్పష్టంగా అర్థమవుతుంది.

మహీంద్రా కంపెనీ ఈ SUV ని దేశీయ మార్కెట్లో 2021 ఆగష్టు నెలలో ప్రారంభించింది. అయితే డెలివరీలు 2021 సెప్టెంబర్ నుంచి ప్రారంభమయ్యాయి. మొదట్లో కంపెనీ ఈ SUV డెలివరీలలో కొంత ఆలస్యం చేసినప్పటికీ, క్రమంగా డెలివరీలు వేగవంతం అవుతున్నాయి. మొదట్లో కరోనా ప్రభావం మరియు సెమికండక్టర చిప్ కొరతలు కారణంగా ఉత్పత్తి ,మరియు డెలివరీలు మందగించాయి.

మహీంద్రా కంపెనీ 2021 సెప్టెంబర్ నుండి జూన్ 2022 వరకు, మొత్తం 41,846 యూనిట్లను డెలివరీ చేయగలిగింది. దీనిని బట్టి చూస్తే కంపెనీ సగటున నెలకు 4185 యూనిట్ల XUV700 డెలివరీ చేసినట్లు స్పష్టమవుతోంది. అయితే ఇప్పటికీ దీనికున్న డిమాండ్ తగ్గకపోగా రోజురోజుకి బుకింగ్స్ చేసుకునేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. కావు ఇప్పటికి కూడా దీని కోసం వెయిటింగ్ పీరియడ్ దాదాపు సంవత్సరం ఉంది.

అయితే బుక్ చేసుకున్న కస్టమర్లకు త్వరగా డెలివరీలు చేయడానికి కంపెనీ ఈ SUV యొక్క ఉత్పత్తిని మరింత వేగవతం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి దాదాపు 50,000 యూనిట్లు డెలివరీ చేసింది అనుకున్నా.. ఇంకా ఒక లక్ష యూనిట్ల డెలివరీ పెండింగ్ లో ఉంది. కావున కంపెనీ ఉత్పత్తిని గత కొన్ని నెలలుగా వేగవతం చేసింది.

Mahindra XUV700 ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటమే కాకుండా మంచి పనితీరుని అందించడానికి రెండు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో మొదటిది 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ కాగా, రెండవది 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్.
ఇందులోని 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 153 బిహెచ్‌పి పవర్ మరియు 360 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇక రెండవ ఇంజిన్ 2.2-లీటర్ టర్బో డీజిల్ విషయానికి వస్తే, ఇది 188 బిహెచ్‌పి పవర్ మరియు 380 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇందులోని రెండు ఇంజిన్లు 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను కలిగి ఉన్నాయి.

ఇదిలా ఉండగా మహీంద్రా XUV700 తాజాగా గ్లోబల్ ఎన్‌సిఎపి నుంచి 'సేఫర్ ఛాయిస్ అవార్డు'ను సొంతం చేసుకుంది. గ్లోబల్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (GNCAP) నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో మహీంద్రా ఎక్స్‌యువి700 అడల్ట్ సేఫ్టీ విషయంలో 17 పాయింట్లకు గాను 16.03 పాయింట్లు మరియు పిల్లల సేఫ్టీ విషయంలో 49 పాయింట్లకు 41.66 పాయింట్లు పొందింది. మొత్తం మీదుగా ఇది సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొంది బెస్ట్ ఎస్‌యువిగా మారింది. కావున ఇది దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్స్ కలిగిన కార్లలో ఒకటిగా ఉంది.

మహీంద్రా కంపెనీ యొక్క అత్యుత్తమ భద్రతా ఫీచర్స్ కలిగిన కారుగా కీర్తి గడించిన ఈ SUV కి ఇప్పుడు కంపెనీ రీకాల్ ప్రకటించింది. ప్రొపెల్లర్ షాఫ్ట్‌లో సమస్య కారణంగా మహీంద్రా XUV700 ఆల్-వీల్ డ్రైవ్ గత నెలలో రీకాల్ చేయబడింది, దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
మహీంద్రా కంపెనీ దేశీయ మార్కెట్లో విడుదల చేసిన అతి తక్కువ కాలంలోనే ఎక్కువ సంఖ్యలో బుకింగ్స్ స్వీకరించి మంచి ప్రజాదరణ పొందింది. అంతే కాకుండా కంపెనీ ఆశించిన స్థాయికంటే కూడా ఎక్కువ బుకింగ్స్ పొందింది. కానీ బుక్ చేసుకున్న కస్టమర్లు ఇప్పుడు ఒక సంవత్సరం వరకు వేచి చూడాలి అనేది కొంత క్లిష్టమైన సమస్య. కావున కంపెనీ వీలైనంత త్వరగా కస్టమర్లకు డెలివరీ చేయడానికి తగిన ఏర్పాట్లు చేయాలి.


Click it and Unblock the Notifications








