మారుతి సుజుకి WagonR Tour H3 విడుదల: ధర 5.39 లక్షలు, దీని ప్రత్యేకత ఏంటంటే..?
భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (Maruti Suzuki India), దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ టాల్ బాయ్ కార్ "వ్యాగన్ఆర్" (WagonR) ఓ కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. మారుతి సుజుకి వ్యాగన్ఆర్ టూర్ హెచ్3 (WagonR Tour H3) పేరుతో కంపెనీ ఈ కారును పెట్రోల్ మరియు సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్లతో ప్రవేశపెట్టింది. మార్కెట్లో వ్యాగన్ఆర్ టూర్ హెచ్3 పెట్రోల్ వెర్షన్ ధర రూ.5.39 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, ఇందులో సిఎన్‌జి వెర్షన్ ధర రూ.6.34 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

ఫ్లీట్ ఆపరేటర్ల కోసం ప్రత్యేకంగా..
మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఇప్పటి వరకూ కేవలం వ్యక్తిగత వినియోగం కోసం మాత్రమే అందుబాటులో ఉండేది. కాగా, కంపెనీ ఇప్పుడు ఫ్లీట్ ఆపరేటర్ల (టాక్సీ వంటి వాణిజ్య ప్రయోజనాల కోసం) కోసం టూర్ హెచ్3 పేరిట ఓ కమర్షియల్ వెర్షన్‌ను విడుదల చేసింది. ఇది కమర్షియల్ వెర్షన్ కావడంతో కంపెనీ ఇందులో ఎక్కువ వేరియంట్లను అందుబాటులో ఉంచలేదు. అయితే, డ్రైవర్లకు లబ్ధి చేకూర్చేందుకు కంపెనీ దీనిని కనీస ఫీచర్లతో పెట్రోల్ మరియు సిఎన్‌జి ఇంధన ఆప్షన్లతో సరసమైన ధరకే అందుబాటులోకి తెచ్చింది.

వ్యాగన్ఆర్ టూర్ హెచ్3: డిజైన్, ఫీచర్లు
స్టాండర్డ్ వెర్షన్ వ్యాగన్ఆర్ కారుకి మరియు ఈ కొత్త టాక్సీ వెర్షన్ వ్యాగన్ఆర్ టూర్ హెచ్3 మోడల్‌కి డిజైన్ పరంగా ఎలాంటి వ్యత్యాసం ఉండదు. ఈ రెండు మోడళ్ళను పక్కపక్కనే ఉంచి చూస్తే, అవి రెండూ కూడా ఒకేలా కనిపిస్తాయి. కాకపోతే, టూర్ హెచ్3 వేరియంట్లను కంపెనీ సుపీరియర్ వైట్ మరియు సిల్కీ సిల్వర్ అనే రెండు కలర్ ఆప్షన్లలో విక్రయిస్తోంది. ఇది బాడీ-కలర్ బంపర్‌లు, స్టీల్ వీల్స్ విత్ వీల్ క్యాప్స్, బ్లాక్ కలర్ సైడ్ మిర్రర్స్, బ్లాక్ డోర్ హ్యాండిల్స్ మరియు బ్లాక్-అవుట్ ఫ్రంట్ గ్రిల్ ల వంటి ఎక్స్టీరియర్ ఫీచర్లను పొందుతుంది. ఫ్రంట్ బంపర్ ఫాగ్ ల్యాంప్స్ లభించవు, డ్రైవర్ కావాలనుకుంటే, ఆప్షనల్‌గా కొనుగోలు చేయవచ్చు.

ఇక ఇంటీరియర్‌లో లభించే ఫీచర్ల విషయానికి వస్తే, ఇంటీరియర్స్ లో కూడా ఇది స్టాండర్డ్ వ్యాగన్ఆర్ మాదిరిగానే ఉంటుంది. కాకపోతే, కంపెనీ ఇందులో డ్యూయల్ టోన్ ఇంటీరియర్ థీమ్ ని అందించింది. ఇంకా, ఇందులో ముందు వైపు క్యాబిన్ ల్యాంప్, టికెట్ హోల్డర్‌తో డ్రైవర్ సైడ్ సన్ వైజర్ మరియు ముందు మరియు వెనుక హెడ్‌రెస్ట్‌లు, సైడ్ ఆటో డౌన్ ఫంక్షన్‌తో కూడిన ఫ్రంట్ పవర్ విండోస్, మాన్యువల్ ఏసి, వెనుక వైపు పార్శిల్ ట్రే, ముందు వైపు రిక్లైనింగ్ అండ్ స్లైడింగ్ సీట్లు వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

సేఫ్టీ విషయానికి వస్తే, ఇది ఎంట్రీ లెవల్ వేరియంట్ అయినప్పటికీ, కంపెనీ ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబిడి) తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్(ఏబిఎస్), స్పీడ్ లిమిటింగ్ ఫంక్షన్, రియర్ పార్కింగ్ సెన్సార్లు మరియు సెంట్రల్ డోర్ లాకింగ్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి.

వ్యాగన్ఆర్ టూర్ హెచ్3: ఇంజన్, మైలేజ్
మారుతి సుజుకి వ్యాగన్ఆర్ టూర్ హెచ్3 లో కంపెనీ ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు చేయలేదు. స్టాండర్డ్ వ్యాగన్ఆర్ కారులో లభించే అదే 1.0-లీటర్, 3-సిలిండర్, కె10సి పెట్రోల్ ఇంజన్ నే ఈ కొత్త టూర్ హెచ్3 మోడల్ లోనూ ఉపయోగించారు. పెట్రోల్ ఫ్యూయెల్ తో ఈ ఇంజన్ గరిష్టంగా 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 64 బిహెచ్‌పి శక్తిని మరియు 3,500 ఆర్‌పిఎమ్ వద్ద 89 న్యూటన్ మీటర్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. పెట్రోల్ పవర్డ్ వ్యాగన్ఆర్ టూర్ హెచ్3 లీటరుకు 25.40 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది.

కంపెనీ ఇందులో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్‌తో కూడిన వేరియంట్ ను కూడా విక్రయిస్తోంది. సిఎన్‌జి ఫ్యూయెల్ తో నడిచే వ్యాగన్ఆర్ టూర్ హెచ్3 కారు 5,300 ఆర్‌పిఎమ్ వద్ద 56 బిహెచ్‌పి శక్తిని మరియు 3,400 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 82 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కూడా 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ తోనే లభిస్తుంది. సిఎన్‌జి మోడల్ కేజీ సిఎన్‌జి ఇంధనానికి 34.73 కిలోమీటర్ల ARAI సర్టిఫైడ్ మైలేజీని అందిస్తుందని కంపెనీ తెలిపింది.

గమనిక: సాధారణ వినియోగదారులు ఈ కొత్త మారుతి సుజుకి వ్యాగన్ఆర్ టూర్ హెచ్3ని తమ వ్యక్తిగత ఉపయోగం కోసం కొనుగోలు చేయలేరని గమనించాలి. ఇది కేవలం వాణిజ్య వినియోగానికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. వ్యక్తిగత వినియోగం కంపెనీ 11 వేరియంట్లలో రెండు రకాల ఇంజన్ కాన్ఫిగరేషన్లతో కొత్త 2022 మోడల్ వ్యాగన్ఆర్ ను విక్రయిస్తోంది. కొత్త 2022 మారుతి సుజుకి వ్యాగన్ఆర్ గాలంట్ రెడ్ మరియు మాగ్మా గ్రే అనే రెండు డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్ లలో అందుబాటులో ఉంటుంది. - దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








