'హెక్టర్' ఉత్పత్తిలో రికార్డ్ సృష్టించిన MG Motor.. పూర్తి వివరాలు
భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన అనతి కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన 'ఎంజి మోటార్' ఇప్పుడు తన 'హెక్టర్' (Hector) ఉత్పత్తిలో కొత్త మైలురాయిని ఛేదించింది. కంపెనీ ఇటీవలే 1,00,000 వ యూనిట్ ను అధికారికంగా విడుదల చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.
MG మోటార్స్ ఇండియా గుజరాత్‌లోని తన హలోల్‌లోని ఫెసిలిటీలో హెక్టర్ యొక్క 100,000 వ యూనిట్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా కంపెనీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది నిజంగానే కంపెనీ సాధించిన గొప్ప విజయం అనే చెప్పాలి. 2019 లో ప్రారంభమైన హెక్టర్ యొక్క ఉత్పత్తి 2022 డిసెంబర్ నాటికల్లా 1 లక్ష యూనిట్లను చేరుకుంది. ఇది 2019 జూన్ నుంచి అమ్మకానికి వచ్చిన విషయం తెలిసిందే.

ఎంజి హెక్టర్ అనేది భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన కంపెనీ యొక్క మొదటి మోడల్ కావడం విశేషం. కంపెనీ విడుదల చేసిన హెక్టర్ 1,00,000 వ యూనిట్ గ్లేజ్ రెడ్ కలర్ లో ఉంది. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. ప్రస్తుతం కంపెనీ హెక్టర్, హెక్టర్ ప్లస్, ఎంజి గ్లోస్టర్, ఎంజి ZS EV మరియు ఆస్టర్ వంటి వాటిని దేశీయ మార్కెట్లో విక్రయిస్తుంది.
ఎంజి మోటార్ రాబోయే రోజుల్లో తన హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేయనుంది. కంపెనీ దీనికి కావాల్సిన సన్నాహాలను కూడా సిద్ధం చేస్తోంది. ఈ వెర్షన్ ప్రస్తుతం ఉన్న మోడల్ కంటే కూడా ఆధునిక కాస్మెటిక్ డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుందని ఆశిస్తున్నాము. ఇందులో అతి పెద్ద మార్పు ముందు భాగంలో చూడవచ్చు. ఇది క్రోమ్‌లో పూర్తి చేయబడినట్లు కనిపించే చాలా విభిన్నమైన నమూనాతో పెద్ద గ్రిల్‌ను కలిగి ఉంది.
ఈ SUV దాని స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ రూపాన్ని అదే విధంగా నిలుపుకుంటుంది. కాగా ముందు మరియు వెనుక బంపర్‌ల దిగువ భాగంలో క్రోమ్ ఫినిషింగ్ వంటివి చూడవచ్చు. ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో 14-ఇంచెస్ పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే ఉంటుంది. అంతే కాకుండా ఇందులో అప్‌డేట్ చేయబడిన AC వెంట్స్ డిజైన్, ఆటోమేటిక్ వెర్షన్ కోసం కొత్త గేర్ లివర్ మరియు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్‌తో పాటు డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే కూడా అందుబాటులో ఉంటాయి.
రాబోయే ఎంజి హెక్టర్ లో గమనించదగ్గ మరియు ఉపయోగకరమైన అతి పెద్ద ఫీచర్ ADAS (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం). దేశీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం కలిగి ఉంటుంది, కావున ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్ మరియు బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.
సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ADAS (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం) కాకుండా, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి. మొత్తానికి రాబోయే హెక్టర్ అధునాతనంగా రూపొందించబడుతుందని ఆశిస్తున్నాము.
రాబోయే MG హెక్టర్ 1.5 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ మరియు 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. అదే సమయంలో ఇవి 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ DCT ఆటోమేటిక్ మరియు CVT ఆటోమేటిక్‌తో అందుబాటులో ఉంటాయి. కావున పనితీరు పరంగా కూడా ఉత్తమంగా ఉంటాయి. హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ 2023 జనవరిలో జరిగే ఆటో ఎక్స్‌పోలో తొలిసారిగా ప్రదర్శించబడుతుంది.


Click it and Unblock the Notifications








