ఎమ్‌జి కార్లకు పెరుగుతున్న డిమాండ్.. మార్కెట్ డిమాండ్‌కి అనుగుణంగా రానున్న మరిన్ని కొత్త కార్లు!
చైనీస్ యాజమాన్యంలో ఉన్న బ్రిటీష్ కార్ బ్రాండ్ 'ఎమ్‌జి మోటార్' (MG Motor) భారత మార్కెట్లో ప్రస్తుతం ఐదు మోడళ్లను (ఆస్టర్, హెక్టర్, హెక్టర్ ప్లస్, గ్లోస్టర్ మరియు జెడ్ఎస్ ఈవీ) విక్రయిస్తోంది. వీటిలో ఒక ఎలక్ట్రిక్ కారు (ZS EV) కూడా ఉంది. దేశీయ విపణిలో ఈ కంపెనీ విక్రయిస్తున్న కార్లకు డిమాండ్ అధికంగా ఉంది. గడచిన జనవరి 2022లో ఎమ్‌జి మోటార్ ఇండియా మొత్తం 4,306 యూనిట్ల వాహనాలను విక్రయించింది. ఇది గత సంవత్సరం జనవరిలో విక్రయించిన అమ్మకాలతో పోలిస్తే 20 శాతం అధికం.

అలాగే, డిసెంబర్ 2021 నెలలో కంపెనీ విక్రయించిన 2,550 యూనిట్లతో పోలిస్తే గత నెలలో అమ్మకాలు ఏకంగా 69 శాతం వృద్ధిని నమోదు చేసాయి. ఎమ్‌జి మోటార్ ఇండియా తాజాగా మార్కెట్లో విడుదల చేసిన ఫ్యూచరిస్టిక్ ఎస్‌యూవీ ఆస్టర్ (MG Astor) అమ్మకాల పరంగా దూసుకుపోతోంది. ఇది ఈ విభాగంలోనే మొదటిసారిగా లెవల్ 2 అటానమస్ డ్రైవింగ్ ఫీచర్లను అందిస్తోంది. అయితే, సెమీకండక్టర్ చిప్ కొరత కారణంగా కంపెనీ ఈ మోడల్ ను ఆశించిన స్థాయిలో ఉత్పత్తి చేయలేకపోతోంది.

ఎమ్‌జి మోటార్ ఇండియా ఈ చిప్ కొరతను ఇప్పుడు సమర్థవంతంగా ఎదుర్కునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరిస్తోంది. ఫలితంగా, గత నెలలో కంపెనీ వాహనాల ఉత్పత్తి స్వల్పంగా మెరుగుపడింది. దీని కారణంగా గత జనవరి నెలలో వాహనాల డెలివరీలు కాస్తంత మెరుగ్గా ఉన్నాయి. వాస్తవానికి, ఇది పూర్తిగా మునుపటి స్థాయికి రానప్పటికీ, చిప్ కొరత నుండి క్రమంగా కోలుకుంటున్నామని, రానున్న రోజుల్లో కార్ల ఉత్పత్తి మరియు వాహనాల వెయిటింగ్ పీరియడ్ సాధారణ స్థాయికి చేరుకోవచ్చని కంపెనీ తెలిపింది.

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఈ ఏడాది ద్వితీయార్థం నాటికి పరిస్థితులు మెరుగుపడవచ్చని ఎంజి మోటార్ తెలిపింది. కంపెనీ 2020 సంవత్సరంతో పోల్చుకుంటే, గత సంవత్సరంలో మెరుగైన ఫలితాలను నమోదు చేసింది. ఈ సమయంలో ఎమ్‌జి మోటార్ దాదాపు 43 శాతం వృద్ధిని నమోదు చేసింది. కరోనా మహమ్మారి ప్రభావం నుండి బయటపడిన తర్వాత, కంపెనీ గత సంవత్సరం తన అన్ని కార్ మోడళ్ల అమ్మకాలలో భారీ వృద్ధిని నమోదు చేసింది. ఇందులో కొత్తగా ప్రారంభించిన MG Aster అధిక సంఖ్యలో బుకింగ్‌లను అందుకుంటోంది.

గడచిన 2021లో అమ్మకాలు ఎలా ఉన్నాయి?
గత 2020 సంవత్సరంతో పోలిస్తే, ఎమ్‌జి మోటార్ ఇండియా 2021 సంవత్సరంలో హెక్టర్ అమ్మకాల్లో 21.5 శాతం వృద్ధిని, జెడ్ఎస్ ఈవీ అమ్మకాలలో 145 శాతం వృద్ధిని మరియు గ్లోస్టర్ అమ్మకాల్లో 252 శాతం వృద్ధిని నమోదు చేసింది. ప్రస్తుతం, మోటార్ ఇండియాకు గుజరాత్‌లోని హలోల్‌లోని అత్యాధునిక తయారీ కేంద్రం ఉంది. కంపెనీ విక్రయిస్తున్న వాహనాలన్నీ ఈ ప్లాంట్ లోనే తయారవుతున్నాయి. ఈ ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఏటా 80,000 వాహనాలుగా ఉన్నాయి. ఈ ప్లాంట్ లో దాదాపు 2,500 మంది కార్మికులు పనిచేస్తున్నారు, వీరిలో మహిళా వర్కర్లు కూడా ఉన్నారు.

ఎమ్‌జి మోటార్ భారత మార్కెట్లో తన వృద్ధి రేటును అలానే కొనసాగించేందుకు, 2022లో అనేక కొత్త వాహనాలను తీసుకురావాలని యోచిస్తోంది. కంపెనీ త్వరలోనే ఓ ఎలక్ట్రిక్ వాహనాన్ని కూడా తీసుకురాబోతోంది, దీని ధర రూ.10-15 లక్షల వరకు ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారును ప్రస్తుతం విక్రయిస్తున్న ZS EV కి దిగువన ఆఫర్ చేయనున్నారు. జెడ్ఎస్ ఈవీ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో కంపెనీ మొత్తం అమ్మకాలలో 20 శాతం అమ్మకాలను ఎలక్ట్రిక్ వాహనాల నుండి దక్కించుకోవాలని చూస్తోంది.

ఇదిలా ఉంటే, వచ్చే 2024 నాటికి ఎమ్‌జి మోటార్ విక్రయించే ప్రతి ఐదు వాహనాలలో ఒకదాన్ని ఈవీగా విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం, దేశంలో ఎలక్ట్రిక్ కార్ల ట్రెండ్ వేగంగా పెరుగుతోంది ఇందుకు ప్రధాన కారణం నిరంతరం పెరుగుతున్న ఇంధన ధరలు మరియు EV లపై లభించే భారీ డిస్కౌంట్లు. ఈ నేపథ్యంలో, ఈ బ్రిటిష్ కార్ల బ్రాండ్ ఎమ్‌జి మోటార్ భారత ఆటో మార్కెట్‌లోని ఈవీ సెగ్మెంట్ అవకాశాలను క్యాష్ చేసుకునేందుకు సిద్ధమవుతోంది.

భారత సెగ్మెంట్‌లోకి ప్రవేశించాలనే ఉద్దేశాలను ప్రకటించినప్పటి నుండి కంపెనీ తన రెండవ కారుగా ఎలక్ట్రిక్ మోడల్‌ను పరిచయం చేయడంతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కంపెనీ యొక్క జెడ్ఎస్ ఈవీ నెలకు సగటున 700 బుకింగ్‌లను అందుకుంటుంది. ప్రస్తుతం, ఇది దేశంలో టాటా నెక్సాన్ ఈవీ తర్వాత అత్యధికంగా అమ్ముడవుతున్న రెండవ ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది. ఈ నేపథ్యంలో, టాటా నెక్సాన్ ఈవీకి పోటీగా ఎమ్‌జి మోటార్ ఓ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారును తీసుకురాబోతోంది.

సమాచారం ప్రకారం, ఈ కొత్త ఎమ్‌జి ఎలక్ట్రిక్ కారు మార్చి 2023 నాటికి రావచ్చని తెలుస్తోంది. ఈ ఈవీ గ్లోబల్ ప్లాట్‌ఫారమ్‌లో నిర్మించబడుతుంది, అయితే ఇది భారతీయ నిబంధనలు మరియు కస్టమర్‌ల అభిరుచికి అనుగుణంగా కస్టమైజ్ చేయబడుతుంది. అదే సమయంలో, కంపెనీ ఈ మోడల్ తయారీలో స్థానికీకరణ యొక్క గరిష్ట స్థాయికి పెంచడం ద్వారా దీని ధరను అందరికీ అందుబాటులో ఉంచాలని చూస్తోంది. ఇందులో ఉపయోగించే బ్యాటరీలు మరియు ఇతర పరికరాలను కంపెనీ స్థానికంగా సేకరించే అవకాశం ఉంది.

ఎమ్‌జి మోటార్ నుండి రాబోయే ఈ సరసమైన ఈవీ టాటా నెక్సాన్ ఈవీతో పోటీ పడబోతోంది, అదే సమయంలో కస్టమర్ల కోసం కొత్త ఆప్షన్లను కూడా సృష్టిస్తోంది. ప్రస్తుతం టాటా టిగోర్ ఈవీ మాత్రమే రూ.15 లక్షల కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉండే ఏకైక మరియు చవకైన ఎలక్ట్రిక్ కారుగా ఉంది. కాబట్టి, ఈ విభాగంలో మరిన్ని కొత్త ఆప్షన్లు రావడంతో కస్టమర్ల నుండి ఈవీలకు డిమాండ్ మరింత పెరుగి అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








