ఒక్క మార్చి నెలలోనే 1500 బుకింగ్ లను దక్కించుకున్న ఎమ్‌జి జెడ్ఎస్ (MG ZS EV) ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ
బ్రిటీష్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్స్ (MG Motors), గడచిన మార్చి నెలలో భారత మార్కెట్లో తమ సరికొత్త అప్‌డేటెడ్ 2022 మోడల్ ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ (2022 MG ZS EV) ని విడుదల చేసిన సంగతి తెలిసినదే. అప్‌డేటెడ్ డిజైన్ మరియు లాంగ్ రేంజ్ బ్యాటరీ ప్యాక్ తో వచ్చిన ఈ కొత్త మోడల్ కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, మార్చి 2022 నెలలో ఈ కొత్త జెడ్ఎస్ ఈవీ కోంసం 1,500 కంటే ఎక్కువ బుకింగ్‌లు వచ్చాయి. కొత్త 2022 MG ZS EV ని మార్చి 7వ తేదీన కంపెనీ మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో దాని ప్రారంభ ధర రూ. 22 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

కొత్త 2022 మోడల్ జెడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కంపెనీ పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో విడుదల చేసింది. ఇందులో ఇప్పుడు 50.3 kWh సామర్థ్యం కలిగిన బ్యాటరీ ప్యాక్‌ని ఉపయోగించారు. అంతకు ముందున్న మోడల్ తో పోల్చిచూస్తే, ఈ కొత్త మోడల్ బ్యాటరీ ప్యాక్ అదనంగా 5.7 kWh సామర్థ్యాన్ని అందిస్తుంది. పెద్ద బ్యాటరీ ప్యాక్ కారణంగా, ఈ కొత్త 2022 మోడల్ జెడ్ఎస్ ఈవీ రేంజ్ కూడా భారీగా పెరిగింది. ఇది పూర్తి ఛార్జ్ పై గరిష్టంగా 461 కిలోమీటర్ల వరకూ రేంజ్ ను అందిస్తుందని సర్టిఫై చేయబడింది. పాత మోడల్ తో పోలిస్తే, కొత్త మోడల్ రేంజ్ 42 కిలోమీటర్లు ఎక్కువగా ఉంటుంది.

కొత్త 2022 మోడల్ ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీలో కేవలం బ్యాటరీ ప్యాక్ లో మాత్రమే కాకుండా, కంపెనీ దాని డిజైన్ లో కూడా మార్పులు చేర్పులు చేసింది. ఇప్పుడు కంపెనీ విక్రయిస్తున్న పెట్రోల్ పవర్డ్ ఎమ్‌జి ఆస్టర్ (MG Astor) డిజైన్ కి అనుగుణంగా ఉండేలా, ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ యొక్క స్టైలింగ్‌ను కూడా అప్‌డేట్ చేశారు. పొడిగించిన బ్యాటరీ ప్యాక్ ఈ కారులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 173.6 బిహెచ్‌పి శక్తిని మరియు 280 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, 2022 ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ కేవలం 8.5 సెకన్లలోనే గంటకు గరిష్టంగా 0 నుండి 100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది. చార్జింగ్ టైం విషయానికి వస్తే, ఈ బ్యాటరీ ప్యాక్ ని 50 kW DC ఫాస్ట్ ఛార్జర్ సాయంతో ఛార్జ్ చేసినప్పుడు, ఇందులోని బ్యాటరీ కేవలం 60 నిమిషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఈ కొత్త మోడల్ లో చేసిన అప్‌డేట్స్ విషయానికి వస్తే, ఇందులో కొత్త డిజైన్‌తో కూడిన హెడ్‌లైట్‌లు, ఫ్రంట్ ఎండ్ MG బ్యాడ్జ్, ఫ్రంట్ అండ్ సెంటర్‌తో క్లోజ్డ్ ఆఫ్ గ్రిల్ సెక్షన్ మరియు పవర్‌ట్రెయిన్‌ను చల్లగా ఉంచడంలో సహాయపడే పెద్ద ఎయిర్ ఇన్‌టేక్స్ తో కూడిన ఫ్రంట్ బంపర్ వంటి మార్పులు ఉన్నాయి.

మునుపటి జెడ్ఎస్ ఈవీకి మరియు ఈ కొత్త 2022 మోడల్ కి సైడ్ ప్రొఫైల్ లో ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే, వీల్స్ అప్‌డేట్ లో భాగంగా, ఈ కొత్త మోడల్ ఇప్పుడు కొత్త అల్లాయ్ వీల్స్ తో లభిస్తుంది. కంపెనీ ఈ కొత్త వెనుక డిజైన్ ను కూడా స్వల్పంగా అప్‌గ్రేడ్ చేసింది. ఇందులో కొత్త ఎల్ఈడి టెయిల్ లైట్లు మరియు అప్‌డేట్ చేయబడిన రియర్ బంపర్ వంటి మార్పులు ఉన్నాయి.

కొత్త 2022 జెడ్ఎస్ ఈవీలో అప్‌డేట్స్ ని కేవలం ఎక్స్టీరియర్లకు మాత్రమే పరిమితం చేయకుండా, కంపెనీ దాని ఇంటీరియర్ లో కూడా సరికొత్త మార్పులు చేసింది. ఈ 2022 మోడల్ ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీలో Apple CarPlay మరియు Android Auto ను సపోర్ట్ చేసే పెద్ద 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే ఉంటుంది. ఈ కొత్త మోడల్ లో ఇది డాష్‌బోర్డ్ మధ్యలో కనిపించే అతిపెద్ద మార్పుగా చెప్పుకోవచ్చు. స్టీరింగ్ వీల్ వెనుక ఉండే 7 ఇంచ్ డ్రైవర్ డిస్‌ప్లే కూడా కొత్తదిగా ఉంటుంది.

కొత్త 2022 MG ZS EV ఇప్పుడు డిజిటల్ కీ ఫంక్షన్‌తో వస్తుంది. ఇది ఎస్‌యూవీని అన్‌లాక్ చేయడానికి మరియు డ్రైవ్ చేయడానికి యజమానులను అనుమతి కల్పిస్తుంది. ఈ కారులోని ఇతర ఫీచర్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, లేన్ చేంజ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి అధునాతన భద్రతా ఫీచర్లతో పాటు ఇతర స్చాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కారులో పెద్ద డ్యూయల్ పేన్ పానోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్ కూడా లభిస్తుంది.

అలాగే, ఈ ఎలక్ట్రిక్ కారులో వాయిస్ కమాండ్‌తో కంట్రోల్ చేయగలిగే 75కి పైగా ఐ-స్మార్ట్ కనెక్టెడ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇది అడ్వాన్సడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్లు మరియు 360 డిగ్రీ కెమెరా వంటి ఇతర ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. కొత్త జెడ్ఎస్ ఈవీ నాలుగు ఆకర్షణీయమైన కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది. వీటిలో ఫెర్రిస్ వైట్, కరెంట్ రెడ్, అషెన్ సిల్వర్ మరియు సేబుల్ బ్లాక్ కలర్స్ ఉన్నాయి. ఇది ఈ విభాగంలో హ్యుందాయ్ కోనా వంటి ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లకు పోటీగా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications








