ఎలక్ట్రిక్ కారు టీజర్ విడుదల చేసిన ఓలా.. ఇక లాంచ్ ఎప్పుడంటే?
ఎలక్ట్రిక్ టూ వీలర్స్ విడుదలతో ఎలక్ట్రిక్ వాహన విభాగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందిన 'ఓలా ఎలక్ట్రిక్' (Ola Electric) ఇప్పుడు దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ కారుని విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే కంపెనీ దీని కోసం తగిన సన్నాహాలు సిద్దంచేసుకుంటోంది. కంపెనీ ఈ కారుకి సంబంధించిన టీజర్ ఫోటోలను ఇప్పటికే విడుదల చేసింది. అయితే ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ విడుదల చేయనున్న ఎలక్ట్రిక్ కారుకి సంబంధించిన ఒక టీజర్ వీడియో విడుదల చేసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికే అందించిన సమాచారం ప్రకారం, భారతీయ మార్కెట్లో తన ఎలక్ట్రిక్ కారుని 2023 నాటికి విడుదల చేయనున్నట్లు తెలిపింది. అయితే ఇప్పుడు కంపెనీ సీఈఓ 'భవిష్ అగర్వాల్' ఈ ఎలక్ట్రిక్ కారుకి సంబంధించిన టీజర్ వీడియో విడుదల చేశారు. అంతే కాకుండా ఇతడు 'మేము భారతీయ మార్కెట్లో స్పోర్టియస్ట్ కారును తయారు చేయబోతున్నామని' రాసారు.

కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారుకి సంబంధించిన ఎక్కువ సమాచారం తెలియచేయలేదు, కానీ ఇది దేశీయ మార్కెట్లో విడుదలకానున్న ఒక సెడాన్ అని తెలుస్తోంది. అంతే కాకుండా కంపెనీ దీని డిజైన్ గురించి కానీ, ఫీచర్స్ గురించి కానీ, ఇతర పవర్ ట్రైన్ గురించి కానీ ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. అయితే త్వరలోనే ఈ ఎలక్ట్రిక్ కారుకి సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడవవుతాయి.

భవిష్ అగర్వాల్ ఈ టీజర్ విడుదల చేసిన సందర్భంగా మాట్లాడుతూ.. ఓలా ఎలక్ట్రిక్ నుంచి రానున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు అత్యంత స్పోర్టియస్ కారు కానుంది. ఇప్పటివరకు ఇతర ఏ కంపెనీ తీసుకురానటువంటి అద్భుతమైన కారు కానుంది అన్నారు. భారతీయ మార్కెట్లో చాలాకంపెనీలు ఎక్కువగా సాధారణ కార్లను తయారుచేయడంపైనే దృష్టిని కేంద్రీకరిస్తున్నాయి. అటువంటి సమయంలో ఓలా ఎలక్ట్రిక్ తీసుకురానున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు తప్పకుండా వాహనం వినియోగదారులకు నచ్చుతుంది.

ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ ఇప్పటికే చాలాసార్లు తమ ఎలక్ట్రిక్ కారుని 2023 నాటికి దేశీయ మార్కెట్లో విడుదల చేస్తామని తెలిపారు. కావున వచ్చే ఏడాదినాటికి ఓలా ఎలక్ట్రిక్ కారు భారతీయ రోడ్లపైన తిరగనుంది. అయితే కంపెనీ దీనిని భారతీయ మార్కెట్ కి అనుకూలంగా ఏవిధంగా తయారు చేస్తుంది అనేది కూడా త్వరలోనే తెలుస్తుంది.

ఇదిలా ఉండగా ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల దేశీయ మార్కెట్లో లిథియం-అయాన్ సెల్ NMC 2170 ని ఆవిష్కరించింది. ఇద్ పూర్తిగా దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న ముడి సరుకులు మరియు టెక్నాలజీతో కంపెనీ ఈ బ్యాటరీ సెల్స్ ని తయారు చేసింది. ఓలా ఎలక్ట్రిక్ 2023 నుంచి తన గిగాఫ్యాక్టరీలో ఈ బ్యాటరీ సెల్స్ ను భారీ మొత్తంలో ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపింది.

కంపెనీఆవిష్కరించిన ఈ లేటెస్ట్ హై నికెల్ సెల్ NMC 2170 క్యాథోడ్ వైపు మరియు యానోడ్ వైపు గ్రాఫైట్ మరియు సిలికాన్‌లను ఉపయోగిస్తుంది. ఈ బ్యాటరీ సెల్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది ఎలక్ట్రిక్ వాహనాలలో ఉపయోగించే సాధారణ లిథియం సెల్ కంటే ఎక్కువ శక్తిని నిల్వ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా దీని లైఫ్ టైమ్ కూడా మిగిలిన వాటికంటే ఎక్కువగా ఉంటుంది. కావున దీనిని ఎక్కువ రోజులు ఉపయోగించవచ్చు.

భారతదేశంలో తయారు చేయబోయే ఈ లిథియం-అయాన్ సెల్ తమ సెల్ టెక్నాలజీ రోడ్‌మ్యాప్‌లోని అనేక లక్ష్యాలలో ఒకటి అని భవిష్ అగర్వాల్ తెలిపారు. ప్రపంచ ఈవీ హబ్‌గా మారడానికి భారతదేశం బలమైన స్థానిక ఈవీ పర్యావరణ వ్యవస్థను కలిగి ఉండటం చాలా ముఖ్యమని ఆయన అభిప్రాయ పడ్డారు.
స్వదేశీ సెల్ టెక్నాలజీలను రూపొందించడానికి, తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి మరియు ఇంటిగ్రేటెడ్ ఓలా ఎలక్ట్రిక్ వెహికల్ హబ్‌ను రూపొందించడానికి పరిశోధన మరియు అభివృద్ధిలో పెట్టుబడులు పెట్టడానికి కట్టుబడి ఉన్నామని కంపెనీ తెలిపింది. దీన్ని బట్టి చూస్తుంటే ఓలా ఎలక్ట్రిక్ దేశీయ విఫణిలో నిలదొక్కుకోవడానికి పక్కా ప్రణాళికలను సిద్ధం చేస్తోందని స్పష్టమవుతోంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
భారతీయ మార్కెట్లో ఇప్పటికే చాలా మంది వాహన వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించటానికి ఆసక్తి చూపుతున్నారు. కావున వాహన తయారీ సంస్థలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. కావున ఈ సమయంలో ఆధునిక డిజైన్ తో ఓలా ఎలక్ట్రిక్ తీసుకురానున్న ఈ ఎలక్ట్రిక్ కారు తప్పకుండా వాహన ప్రియులను ఆకర్షించనుందని భావిస్తున్నాము.


Click it and Unblock the Notifications








