కూతుళ్లు ఇచ్చిన గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్ అయిన నాన్న.. కొత్త కారును చూసి ఆనందబాష్పాలు, వీడియో వైరల్
పిల్లల బంగారు భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తారు. అందుకే వారి రుణం తీర్చేందుకు పిల్లలు ఎంత చేసినా తక్కువే అంటారు. అందుకేనేమో తమను సమాజంలో ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దినందుకు ఇక్కడ ఇద్దరు అక్కాచెల్లెళ్లు తమ తండ్రికి జీవితంలో మరిచిపోలేని గిఫ్ట్‌ను ఇచ్చారు.
తమ తండ్రికి సరికొత్త నిస్సాన్ మాగ్నైట్(Nissan Magnite) కారును బహుమతిగా ఇచ్చారు ఇద్దరు కూతుళ్లు. ఇందుకు సంబంధించిన వీడియోను తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఇది ఇప్పుడు వైరల్‌గా మారింది. తండ్రితో కలిసి సంతోషకరమైన క్షణాలను నెటిజన్లతో షేర్ చేసుకోవడంతో వారిని అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ఇద్దరు యువతులు(అక్కాచెల్లెళ్లు), వారి తల్లి కారులో వెనుక సీట్లలో కూర్చొని నిస్సాన్ డీలర్‌షిప్‌కు చేరుకోవడాన్ని వీడియోలో చూడవచ్చు. ఇద్దరూ కలిసి షోరూమ్‌లో తిరుగుతూ చివరికి నిస్సాన్ మాగ్నైట్ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ వద్దకు చేరుకుంటారు. వారితో కలిసి వారి తల్లిదండ్రులు కూడా ఉంటారు. ఆ కారును వారు పరిశీలిస్తుండగా.. ఇంతలో అక్కడ ఓ ఆశ్చర్యకరమైన సంఘటన జరుగుతుంది.
కాసేపటికి డీలర్‌షిప్ ప్రతినిధి ఒకరు అక్కడికి వచ్చి నిస్సాన్ మాగ్నైట్ కారు కీని యువతుల తండ్రికి అందజేస్తారు. దీంతో ఈ ఊహించని సంఘటనకు తండ్రి షాక్ అవుతూ, కాసేపు ఏం జరుగుతుందో అర్థం కాక డైలమాలో ఉంటారు. ఆయన సందేహాన్ని నివృత్తి చేయడానికి వెంటనే డీలర్‌షిప్ ప్రతినిధి, యువతులు ఇది మీ కారే అని పేర్కొంటూ సర్‌ప్రైజ్ చేశారు.

వెంటనే చప్పట్లు కొడుతూ అభినందనలు తెలిపారు. దీంతో ఆ తండ్రి ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. అనంతరం అక్కాచెల్లెళ్లు ఇద్దరూ తాము కొనుగోలు చేసిన సరికొత్త నిస్సాన్ మాగ్నైట్ కారు కవర్‌ను తొలగిస్తారు. అనంతరం అక్కడ కొత్త కారు కొనుగోలు చేసినందుకు సెలబ్రేట్ చేసుకుని తమ నాన్న డ్రైవ్ చేస్తుండగా అక్కడి నుంచి మాగ్నైట్ కారులో వెళ్లిపోతారు.
సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ యువతులిద్దరూ ఆకట్టుకునే శీర్షికను రాశారు. 'మా అమ్మ మాకు జీవితాన్ని ఇచ్చింది. మా నాన్న మా కలలను నెరవేర్చారు. వారి కృషి వల్లే మేము ఈ రోజు ఉన్నత స్థితిలోకి చేరుకోగలిగాము. మీరు మా కోసం చేసిన త్యాగాలకు ఓ చిన్న రిటర్న్ గిఫ్ట్.. ధన్యవాదాలు' అంటూ హృదయాన్ని కదిలించేలా పేర్కొన్నారు.

ఇక నిస్సాన్ మాగ్నైట్ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విషయానికొస్తే ఇది దాని విభాగంలో అత్యంత సరసమైన SUV లలో ఒకటి. ఇది ప్రసిద్ధి చెందిన వాహనం. ఇది ఏ వేరియంట్ అనేది స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదు. డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ కారణంగా ఇది ఆ విభాగంలో టాప్ స్పెక్ వేరియంట్‌గా తెలుస్తోంది.
కాగా భారత మార్కెట్లో ప్రస్తుతం, నిస్సాన్ మాగ్నైట్ రెండు ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. మొదటిది 1.0-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్. ఇది 72 PS పవర్, 96 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరొకటి 1.0-లీటర్ టర్బో ఇంజిన్‌తో అందుబాటులో ఉంది. ఇది 100 PS మరియు 16 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

అంతేకాకుండా ఇటీవల నిస్సాన్ మాగ్నైట్ EZ-Shift AMT ట్రాన్స్‌మిషన్ వేరియంట్‌ను కూడా కంపెనీ ప్రవేశపెట్టింది. ఇది మునుపెన్నడూ లేని 1.0-లీటర్ నేచురల్లీ అస్పిరేటెడ్ మోడల్‌తో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన కారును తన కూతుళ్లు బహుమతిగా అందించడంతో ఆ తండ్రి ఆనందం మాటల్లో వర్ణించలేనిది.


Click it and Unblock the Notifications








