తొలి రోజే 15 వేలకు పైగా బుకింగ్స్.. 24 గంటల్లో రికార్డు తిరగరాసిన కొత్త ఎలక్ట్రిక్ కారు.. టాటా ఈవీలకు కష్టమే
గత కొన్ని నెలలుగా దేశంలో టాటా ఎలక్ట్రిక్ కార్ల సేల్స్ భారీగా తగ్గాయి. దీనికి కారణం ఎంజీ మోటార్స్‌కి చెందిన ఎంజీ కామెట్, ఎంజీ జెడ్‌ఎస్ కార్లు భారీ సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఎంజీ మోటార్స్ సేల్స్‌లో 49 శాతం వృద్ధిని సాధించింది. వీటిలో కామెట్ ఈవీ, జెడ్ఎస్ ఈవీల సేల్స్ సంగం వాటాను కలిగి ఉన్నాయి. గత నెలలో ఎంజీ మోటార్స్ విండ్సర్ ఈవీ అనే కొత్త మోడల్‌ని మార్కెట్‌లో విడుదల చేసింది. ఎంజీ విండ్సర్ ఈవీ ప్రారంభ ధర రూ .13.50 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వద్ద విడుదల చేసింది. బ్యాటరీ రెంటల్ స్కీమ్ కింద కేవలం రూ.9.99 లక్షలకు ఈవీని కొనుగోలు చేయవచ్చు.
ఇప్పుడు ఎంజీ విండ్సర్ ఈవీ సరికొత్త రికార్డుని నెలకొల్పింది. ఈ కారు బుకింగ్ విండో అక్టోబర్ 3 ఉదయం 7:30 గంటలకు ఓపెన్ అయ్యాయి. కేవలం 24 గంటల్లో 15,176 బుకింగ్స్‌ని సాధించి రికార్డు నెలకొల్పింది. భారతదేశంలో ఒకే రోజులో భారీ మొత్తంలో ఈ మైలురాయిని సాధించిన మొదటి ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వాహనంగా ఎంజీ విండ్సర్ ఈవీ నిలిచింది.

ఈ ఎలక్ట్రిక్ క్రాసోవర్ యుటిలిటీ వెహికల్ (సీయూవీ) ను సొంతం చేసుకోవాలనుకునే వినియోగదారులు సమీపంలోని ఎంజీ డీలర్‌షిప్‌ని సందర్శించవచ్చు లేదా బ్రాండ్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా వాహనాన్ని బుక్ చేసుకోవచ్చు. దీని బుకింగ్ కోసం రూ.11,000 టోకెన్ అమౌంట్ చెల్లిస్తే సరిపోతుంది. అక్టోబర్ 12, 2024న ఈవీ కస్టమర్ డెలివరీలను సంస్థ ప్రారంభించనుంది.
ఈ సరికొత్త ఎలక్ట్రిక్ కారు ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్, ఎసెన్స్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. అలాగే స్టార్‌బర్ట్స్ బ్లాక్, పెర్ల్ వైట్, క్లే బీజ్, టర్కోయిస్ గ్రీన్ అనే నాలుగు కలర్ ఆప్షన్స్‌లో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. ఈ ఎంజీ కారుని వూలింగ్ క్లౌడ్ ఈవీ ఆధారంగా తీసుకువచ్చింది. విండ్సర్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ వాహనాల మాదిరిగా ఫ్రంట్ ట్రంక్‌ని కలిగి ఉండదు.

LED లైట్ బార్, LED హెడ్‌లైట్స్, ఎంజీ లోగోతో వస్తుంది. విండ్సర్ ఈవీ క్రోమ్ డిజైన్‌ని కలిగి ఉంది. ఫ్లష్-డోర్ హ్యాండిల్స్, 18-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ దీని ఎక్స్‌టీరియర్ హైలైట్స్ అని చెప్పవచ్చు. ఈ ఎంజీ విండ్సర్ ఈవీ 38 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది ఐపి 67 రేటెడ్ బ్యాటరీ ప్యాక్‌గా ఉంటుంది. ఇది నీరు మరియు ధూళి నుంచి రక్షణను అందిస్తుంది.
ఈ ఎలక్ట్రిక్ కారును ఫుల్ ఛార్జ్ చేస్తే 330 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఇది గరిష్టంగా 136 ps శక్తిని, 200 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఎకో+, ఎకో, నార్మల్, స్పోర్ట్ అనే నాలుగు డ్రైవింగ్ మోడ్స్‌తో వస్తుంది. 3.3 కిలోవాట్ల ఛార్జర్‌తో దీనిని 15 గంటల్లో బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.

ఇక 7.4 కిలోవాట్ల ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగించడం వల్ల ఛార్జింగ్ సమయాన్ని సగానికి తగ్గించవచ్చు. ఫాస్ట్ ఛార్జర్‌తో గంటలోనే బ్యాటరీని 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. 15.6 ఇంచెస్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్, కనెక్టివిటీ ఆప్షన్లు, డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, ఎలక్ట్రానిక్ టెయిల్‌గేట్, యాంబియంట్ లైటింగ్, స్టీరింగ్ వీల్‌కి జత చేసిన మీడియా కంట్రోల్స్ ఉన్నాయి.
లెవల్-2 ఏడీఏఎస్, 360 డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, టైర్‌ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ కారుని 3 సంవత్సరాల తర్వాత విక్రయించాలని నిర్ణయించుకుంటే 60 శాతం రీసేల్ విలువతో బైబ్యాక్ ఆప్షన్‌ని ఎంజీ అందిస్తోంది. ఇది టాటా నెక్సాన్ వంటి ప్రజాదరణ పొందిన కార్లకు గట్టి పోటీని ఇస్తుంది.


Click it and Unblock the Notifications








