కొత్త ఏడాది మార్కెట్ పై మహీంద్రా దండయాత్ర.. ఏకంగా మూడు SUVలను రంగంలోకి దింపుతోంది
మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ప్రస్తుతం ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్‌లో తిరుగులేని వేగంతో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఎస్‌యూవీ (SUV) విభాగంలో ఈ సంస్థకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అదే జోరును కొనసాగిస్తూ 2026 సంవత్సరంలో మహీంద్రా మూడు అద్భుతమైన కార్లను లాంచ్ చేయడానికి పక్కా ప్లాన్ సిద్ధం చేసింది. తన పాపులర్ మోడల్స్ అయిన ఎక్స్‌యూవీ 700, స్కార్పియో-ఎన్, థార్ కార్లను సరికొత్త ఫీచర్లతో అప్‌డేట్ చేసి మార్కెట్లోకి వదలబోతోంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ 7XO (XUV 700 ఫేస్‌లిఫ్ట్): మహీంద్రా నుంచి 2026లో రాబోతున్న తొలి భారీ అప్‌డేట్ ఎక్స్‌యూవీ 7XO. ఇది ప్రస్తుతం ఉన్న ఎక్స్‌యూవీ 700కి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్. జనవరి 5వ తేదీనే ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. దీని కోసం ఇప్పటికే రూ. 21,000 చెల్లించి బుకింగ్స్ చేసుకోవచ్చు.

ఈ కొత్త వెర్షన్‌లో 19-అంగుళాల భారీ అలోయ్ వీల్స్, రీ-డిజైన్ చేసిన బంపర్, పదునైన హెడ్‌లైట్లు ఉండబోతున్నాయి. లోపల 12.3-అంగుళాల అతిపెద్ద డిస్‌ప్లే, వెంటిలేటెడ్ సీట్లు, డ్యూయల్ వైర్‌లెస్ ఛార్జింగ్, ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) తో కూడిన హెడ్స్-అప్ డిస్‌ప్లే వంటి హైటెక్ ఫీచర్లు ఆకట్టుకోనున్నాయి.
స్కార్పియో-ఎన్ ఫేస్‌లిఫ్ట్ (Scorpio-N): ఎస్‌యూవీ ప్రియుల ఆల్ టైమ్ ఫేవరెట్ స్కార్పియో-ఎన్ తన మొదటి మేజర్ అప్‌డేట్‌ను 2026 మార్చిలో అందుకోనుంది. 2022లో లాంచ్ అయిన తర్వాత వస్తున్న తొలి ఫేస్‌లిఫ్ట్ ఇదే. ఇందులో కొత్త రకం గ్రిల్, అప్‌డేటెడ్ హెడ్‌లైట్ గ్రాఫిక్స్, 17-అంగుళాల కొత్త అలోయ్ వీల్స్ రాబోతున్నాయి.

లోపలి భాగంలో 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, మరింత ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్ వాడబోతున్నారు. ఇంజిన్, గేర్‌బాక్స్‌లో పెద్దగా మార్పులు ఉండకపోయినా, లుక్ పరంగా మాత్రం ఇది మరింత పవర్‌ఫుల్ గా ఉండబోతోంది.
మహీంద్రా థార్ అప్‌డేట్ (Thar 3-Door Update): ఆఫ్ రోడింగ్ కింగ్ మహీంద్రా థార్ లో కూడా కొన్ని కాస్మెటిక్ మార్పులు రాబోతున్నాయి. రీసెంట్‌గా వచ్చిన థార్ రాక్స్ (Thar ROXX) లో ఉన్న ప్రీమియం ఫీచర్లు ఇప్పుడు 3-డోర్ థార్‌లో కూడా అందుబాటులోకి రానున్నాయి.

కొత్త బై-ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ లైట్లు, ఆటో డిమ్మింగ్ ఐఆర్‌వీఎమ్ (IRVM), పవర్ ఫోల్డింగ్ ఓఆర్‌వీఎమ్ (ORVM), వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్ వంటి వెసలుబాట్లు ఇందులో చేర్చనున్నారు. సాహసాలను ఇష్టపడే వారికి ఈ అప్‌డేటెడ్ థార్ సరికొత్త అనుభూతిని ఇవ్వడం ఖాయం.
డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: మహీంద్రా ప్రస్తుతం దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న సంస్థలలో ఒకటి. 2026 లో ఈ మూడు కీలక మోడళ్లను అప్‌డేట్ చేయడం ద్వారా, కంపెనీ తన మార్కెట్ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటుంది. 2026 ద్వితీయార్థంలో మరికొన్ని కొత్త మోడళ్లు కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








