యాక్టివా EV ఉత్పత్తికి బ్రేక్..6 నెలల్లోనే మూతపడ్డ ప్లాంట్..టీవీఎస్, బజాజ్‌లను తట్టుకోలేకపోయిన హోండా
భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్ (EV Market) చాలా వేగంగా మారిపోతోంది. స్టార్టప్ కంపెనీలను వెనక్కి నెట్టి, TVS, బజాజ్ వంటి పాత బ్రాండ్‌లు ఈ విభాగంలో దూసుకుపోతున్నాయి. అయితే ఈ పోటీలో హెవీ వెయిట్ బ్రాండ్ అయిన హోండాకు మాత్రం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే పెట్రోల్ స్కూటర్ యాక్టివా.. ఈవీ మార్కెట్‌లోకి వచ్చినా హోండాకు ఆశించిన ఫలితం దక్కలేదు. అందుకే కంపెనీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) గణాంకాల ప్రకారం.. హోండా తన ఎలక్ట్రిక్ స్కూటర్లైన యాక్టివా e:, QC1 ల ఉత్పత్తిని 2025 ఆగస్టు నుంచి పూర్తిగా నిలిపివేసింది. ఈ ఏడాది జనవరిలో ఆటో ఎక్స్‌పోలో లాంచ్ అయిన ఈ ఇవిలు, కేవలం ఆరు నెలల్లోనే మార్కెట్‌లో నిలదొక్కుకోలేకపోయాయి. పెట్రోల్ స్కూటర్ల విభాగంలో నంబర్ 1 గా ఉన్న యాక్టివా నేమ్‌ప్లేట్‌ను ఉపయోగించినా, ఇవి వెర్షన్ మాత్రం కొనుగోలుదారులను ఆకర్షించలేకపోయింది.

ఉత్పత్తి నిలిపివేయడానికి ప్రధాన కారణం సేల్స్ బాగా తగ్గడం, అమ్ముడుపోని స్టాక్ పేరుకుపోవడమే. 2025 ఫిబ్రవరి నుంచి జూలై వరకు హోండా మొత్తం 11,168 యూనిట్ల యాక్టివా e:, QC1 స్కూటర్లను తయారు చేసింది. అయితే డీలర్లకు పంపిణీ చేసింది కేవలం 5,201 యూనిట్లు మాత్రమే. అంటే తయారు చేసిన వాటిలో 46.6% మాత్రమే అమ్ముడయ్యాయి.
ఈ విషయంలో హోండా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినా, స్టాక్ ఎక్కువగా పేరుకుపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు మోడళ్లలో కూడా QC1 మోడల్‌కే కొద్దిగా మెరుగైన సేల్స్ వచ్చాయి. మొత్తం అమ్మకాలలో QC1 వాటా ఏకంగా 86% ఉంది. అంటే 4,252 యూనిట్ల QC1 అమ్ముడైతే, యాక్టివా e: కేవలం 698 యూనిట్లు మాత్రమే అమ్ముడైంది. దీనికి ప్రధాన కారణం ధర, చార్జింగ్ సౌకర్యం.

QC1 ఎక్స్‌షోరూమ్ ధర రూ.90,022 నుంచి మొదలవుతుండగా, యాక్టివా e: ధర రూ.1,03,282 నుంచి ప్రారంభమవుతుంది. QC1 ధర తక్కువగా ఉండటం కలిసొచ్చింది. QC1 లో పోర్టబుల్ చార్జర్ (ఇంట్లో చార్జింగ్) సౌకర్యం ఉంది. కానీ యాక్టివా e: మాత్రం పూర్తిగా హోండా బ్యాటరీ స్వాపింగ్ నెట్‌వర్క్‌పైనే ఆధారపడింది. బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ల పరిమిత లభ్యత అమ్మకాలపై ప్రభావం చూపింది.
మార్కెట్‌లో ఉన్న ఇతర పెద్ద EV స్కూటర్లైన TVS iQube, బజాజ్ చేతక్‌లతో పోలిస్తే హోండా మోడల్స్ రేంజ్ విషయంలో వెనుకబడి ఉన్నాయి. కొనుగోలుదారులు ధరతో పాటు రేంజ్‌కు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

QC1 కేవలం 80 కి.మీ (IDC రేంజ్), యాక్టివా e: 102 కి.మీ రేంజ్ మాత్రమే ఇవ్వగలిగాయి. ప్రత్యర్థులైన బజాజ్ చేతక్ (153 కి.మీ), టీవీఎస్ ఐక్యూబ్ (212 కి.మీ)తో పోలిస్తే ఇది చాలా తక్కువ. వినియోగదారులు ధరతో పాటు రేంజ్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
రేంజ్ తక్కువగా ఉండటం, అలాగే కొన్ని నగరాల్లోనే మాత్రమే ఈ స్కూటర్లు అందుబాటులో ఉండటం కూడా సేల్స్ తగ్గడానికి మరో కారణం.యాక్టివా e: కేవలం బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి కొన్ని నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. అక్కడ కూడా హోండా ఏర్పాటు చేసిన బ్యాటరీ స్టేషన్ల నెట్‌వర్క్ చాలా పరిమితంగా ఉంది.
భారత్‌లో ఎలక్ట్రిక్ టూవీలర్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో హోండా ఈ తాత్కాలిక నిలిపివేతను ఒక కొత్త, పటిష్టమైన EV వ్యూహాన్ని రూపొందించడానికి వినియోగించుకుంటుందని, విస్తృత నెట్‌వర్క్, మెరుగైన మోడళ్లతో తిరిగి మార్కెట్లోకి వస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.


Click it and Unblock the Notifications








