గుడ్ న్యూస్.. పండగ ముందే వచ్చేసింది బ్రో.. టాటా నుంచి బీఎండబ్ల్యూ వరకు లక్షల్లో తగ్గనున్న కార్ల ధరలు
పండుగ సీజన్ దగ్గర పడుతుండటంతో కొత్త కారు కొనాలని కలలు కనేవారికి ఇది సరైన సమయం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న ఒక కీలక నిర్ణయం వల్ల కార్ల ధరలు భారీగా తగ్గాయి. ప్రభుత్వం వాహనాలపై జీఎస్టీని తగ్గించడంతో, ప్రముఖ కార్ల కంపెనీలైన టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, రెనాల్ట్, బీఎండబ్ల్యూ, మారుతీ సుజుకి వంటివి ఈ ప్రయోజనాలను వినియోగదారులకు అందించడానికి సిద్ధమయ్యాయి.
దీనితో కార్ల ఆన్-రోడ్ ధరలు 2 నుంచి 9 శాతం వరకు తగ్గుతాయని కొందరు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో వాహనాల పన్ను స్లాబ్‌లను మార్చింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం.. కార్లను వాటి సైజు, ఇంజిన్ కెపాసిటీ ఆధారంగా రెండు ప్రధాన పన్ను స్లాబ్‌లలోకి మార్చారు.

4 మీటర్ల కంటే తక్కువ పొడవు, 1200 సీసీ (పెట్రోల్) లేదా 1500 సీసీ (డీజిల్) కంటే తక్కువ ఇంజిన్ కెపాసిటీ ఉన్న కార్ల పన్ను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గింది. పెద్ద కార్లు, ఎస్‌యూవీలపై గతంలో 50% (28% జీఎస్టీ + 22% సెస్) ఉన్న పన్ను, ఇప్పుడు 40%కి తగ్గింది. ఇది వినియోగదారులకు పెద్ద ఉపశమనం. ఈ ధరల తగ్గింపు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తుంది.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ రేట్ల తగ్గింపు నిర్ణయం ఆటోమొబైల్ రంగానికి కొత్త ఊపునిచ్చింది. కార్ల కేటగిరీని బట్టి జీఎస్టీని 18% లేదా 40%కి తగ్గించారు. ఇంతకు ముందు ఇది 45-50% వరకు ఉండేది. కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ నివేదిక ప్రకారం.. ఈ తగ్గింపు వల్ల ఆన్-రోడ్ ధరలు 5-8% వరకు తగ్గుతాయి.

పండుగ సీజన్‌కు ముందు కార్లు కొనాలనుకునేవారికి టాటా మోటార్స్ శుభవార్త చెప్పింది. వాహనాలపై జీఎస్టీ రేట్ల తగ్గింపును వినియోగదారులకు అందించడానికి కంపెనీ సిద్ధమైంది. దీనివల్ల టాటా కార్ల ధరలు రూ. 75,000 నుంచి రూ. 1.45 లక్షల వరకు తగ్గుతాయి. ఈ ధరల తగ్గింపు టాటా మోటార్స్ పోర్ట్‌ఫోలియోలోని వివిధ మోడళ్లకు వర్తిస్తుంది. ఇప్పుడు ఏ కారు ధర ఎంత తగ్గిందో చూద్దాం. టాటా టియాగో కారుపై రూ. 75,000 తగ్గింపు లభిస్తుంది. దీని కొత్త ధర రూ. 4,99,990. టాటా టిగోర్ పై రూ. 80,000 తగ్గింపుతో, కొత్త ధర రూ. 5,99,990.
| కారు | మోడల్ | తగ్గింపు | రిటైల్ ధర |
| టాటా | టియాగో | రూ.75,000 | రూ.4,99,990 |
| టాటా | టిగోర్ | రూ.80,000 | రూ.5,99,990 |
| టాటా | ఆల్ట్రోజ్ | రూ.1.10 లక్షలు | రూ.6,89,000 |
| టాటా | పంచ్ కాంపాక్ట్ SUV | రూ.85,000 | రూ.6,19,990 |
| టాటా | నెక్సాన్ కాంపాక్ట్ SUV | రూ.1.55 లక్షలు | రూ.7,99,990 |
| టాటా | కర్వ్ మిడ్-సైజ్ SUV | రూ.65,000 | రూ.9,99,990 |
| టాటా | హారియర్ ప్రీమియం SUV | రూ.1.4 లక్షలు | రూ.14,99,990 |
| టాటా | సఫారీ ప్రీమియం SUV | రూ.1.45 లక్షలు | రూ.15,49,990 |
టాటా అల్ట్రోజ్ ధర రూ. 1.10 లక్షలు తగ్గింది, కొత్త ధర రూ. 6,89,000. కాంపాక్ట్ ఎస్‌యూవీ అయిన పంచ్‌పై రూ. 85,000 తగ్గింపుతో, దీని ధర రూ. 6,19,990. నెక్సాన్‌పై అత్యధికంగా రూ. 1.55 లక్షల తగ్గింపు ఉంది. దీని కొత్త ధర రూ. 7,99,990. మిడ్-సైజ్ ఎస్‌యూవీ అయిన కర్వ్ ధర రూ. 65,000 తగ్గి రూ. 9,99,990కి లభిస్తుంది. హారియర్ ధర రూ. 1.4 లక్షలు తగ్గి రూ. 14,99,990కి చేరింది. సఫారిపై కూడా రూ. 1.45 లక్షల భారీ తగ్గింపు లభించింది. దీని కొత్త ధర రూ. 15,49,990. ఈ తగ్గింపుల వల్ల వినియోగదారులు తక్కువ ధరలో కొత్త కార్లను కొనుగోలు చేయగలుగుతారు.

రెనాల్ట్ కూడా తమ కార్ల ధరలను సెప్టెంబర్ 22 నుంచి రూ. 96,395 వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ట్రైబర్ మోడల్‌పై రూ. 53,695 నుంచి రూ. 80,195 వరకు ధర తగ్గుతుంది. కైగర్ మోడల్‌పై రూ. 53,695 నుంచి రూ. 96,395 వరకు ధర తగ్గుతుంది. క్విడ్ మోడల్‌పై రూ. 40,095 నుంచి రూ. 54,995 వరకు ధర తగ్గుతుంది.
మహీంద్రా మాత్రం తన కస్టమర్ల కోసం ఆ ప్రయోజనాలను ముందుగానే అంటే సెప్టెంబర్ 6 నుంచే అందించడం మొదలుపెట్టింది. ఈ ధరల తగ్గింపు కేవలం పెట్రోల్, డీజిల్ వేరియంట్లకు మాత్రమే వర్తిస్తుంది, ఎలక్ట్రిక్ కార్లకు కాదు. బొలెరో/బొలెరో నియో మోడళ్లపై రూ. 1.27 లక్షల తగ్గింపు లభిస్తుంది. ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ పెట్రోల్ వేరియంట్‌పై రూ. 1.40 లక్షల తగ్గింపు ఉంది. ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ డీజిల్ వేరియంట్‌పై అత్యధికంగా రూ. 1.56 లక్షల తగ్గింపు ఉంది. థార్ 2WD డీజిల్ మోడల్‌పై రూ. 1.35 లక్షల తగ్గింపు లభిస్తుంది.
| కారు | మోడల్ | తగ్గింపు | రిటైల్ ధర |
| మహీంద్రా | బొలెరో | రూ.1.27 లక్షలు | రూ.9,81,400 |
| మహీంద్రా | బొలెరో నియో | రూ.1.27 లక్షలు | రూ.9,96,600 |
| మహీంద్రా | XUV 3XO (పెట్రోల్) | రూ.1.4 లక్షలు | రూ.7,99,000 |
| మహీంద్రా | XUV 3XO (డీజిల్) | రూ.1.56 లక్షలు | రూ.9,99,001 |
| మహీంద్రా | థార్ 2WD (డీజిల్) | రూ.1.35 లక్షలు | రూ.11,50,001 |
| మహీంద్రా | థార్ 2WD (డీజిల్) | రూ.1.01 లక్షలు | రూ.16,12,000 |
| మహీంద్రా | స్కార్పియో క్లాసిక్ | రూ.1.01 లక్షలు | రూ.13,76,599 |
| మహీంద్రా | స్కార్పియో N | రూ.1.45 లక్షలు | రూ.13,99,200 |
| మహీంద్రా | థార్ రాక్స్ | రూ.1.33 లక్షలు | రూ.12,99,000 |
| మహీంద్రా | XUV 700 | రూ.1.43 లక్షలు | రూ.14,49,000 |

స్కార్పియో క్లాసిక్ ధర రూ. 1.01 లక్షలు తగ్గింది. స్కార్పియో-ఎన్ మోడల్‌పై రూ. 1.45 లక్షల తగ్గింపు ఉంది. ఎక్స్‌యూవీ 700 ఈ కారుపై రూ. 1.43 లక్షల తగ్గింపు లభిస్తుంది. మహీంద్రా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కస్టమర్లు పండుగ సీజన్‌కు ముందే తక్కువ ధరలో కొత్త కార్లను కొనుగోలు చేయగలుగుతారు. ఈ ధరల తగ్గింపు గురించి మరిన్ని వివరాల కోసం సమీపంలోని మహీంద్రా డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు.
లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎమ్‌డబ్ల్యూ కూడా తమ మోడళ్ల ధరలను తగ్గించింది. సీఎన్‌బీసీ-టీవీ18 నివేదిక ప్రకారం.. లగ్జరీ కార్ల ధరలు 8-10% తగ్గుతాయి. బీఎమ్‌డబ్ల్యూ తమ ఎక్స్7 ఎస్‌యూవీ ధరను రూ. 9 లక్షలు తగ్గించి వినియోగదారులకు ప్రయోజనం కల్పించింది.
బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 ఎస్‌యూవీ ధర రూ. 9 లక్షలు తగ్గింది. దీని కొత్త ధర రూ. 1.25 కోట్లు. బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 మోడల్‌పై రూ. 6.3 లక్షల తగ్గింపు ఉంది. దీని కొత్త ధర రూ. 93.7 లక్షలు. బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ధర రూ. 1.80 లక్షలు తగ్గింది. దీని కొత్త ధర రూ. 50.6 లక్షలు. ఈ ధరల తగ్గింపు లగ్జరీ కార్లు కొనాలనుకునేవారికి మంచి అవకాశంగా చెప్పవచ్చు.
మారుతి సుజుకి చైర్మన్ ఆర్.సి. భార్గవ ఒక ఇంటర్వ్యూలో తమ ఆల్టో కారు ధర రూ. 40,000-50,000 వరకు తగ్గుతుందని, వాగన్ ఆర్ ధర రూ. 60,000-67,000 వరకు తగ్గుతుందని తెలిపారు. అయితే, ఈ విషయంలో కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.


Click it and Unblock the Notifications








