విండ్సర్ ఈవీ ఉత్పత్తిలో సరికొత్త రికార్డు.. అమ్మకాల్లోనూ తగ్గేదేలా అన్నట్లుగా దూసుకుపోతున్న ఎలక్ట్రిక్ కారు!
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో.. ఆనేక వాహన తయారీ సంస్థలు ఈవీలతో మార్కెట్లో పోటీ పడుతున్నాయి. స్టార్టప్ సంస్థల నుంచి దిగ్గజ సంస్థల వరకు కొత్త మోడళ్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. అయితే.. ఈ కంపెనీల్లో ఎంజీ సంస్థ 'తగ్గేదేలే' అంటోంది. ఈ బ్రాండ్ నుంచి ఎంజీ విండ్సర్ ఈవీ ఎలక్ట్రిక్ కారు అమ్మకాల్లో దూసుకుపోతోంది. వరుసగా నాలుగు నెలలుగా ఈ కారు.. బెస్ట్-సెల్లింగ్ కారుగా కొనసాగుతోంది. అంతకుముందు ఈ స్థానం టాటా నెక్సాన్ ఈవీ పేరిట ఉంది. తాజాగా ఈ ఎంజీ విండ్సర్ ఈవీ కారు ఉత్పత్తి పరంగా ఓ కీలక రికార్డును నమోదు చేసింది. ఆ వివరాలు ఈ కథనంలో పూర్తిగా చూసేద్దాం.
2024 అక్టోబర్ నుంచి ఎంజీ విండ్సర్ ఈవీ.. తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. అక్టోబర్ నుంచి 2025 జనవరి వరకు ఈ కారు ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో టాప్‌లో కొనసాగుతోంది. కస్టమర్ల నుంచి ఈ కారుకు డిమాండ్ అధిక స్థాయిలో ఉండడంతో.. ఈ కారు ఉత్పత్తి కొత్త శిఖరాన్ని చేరుకున్నట్లు అయింది.

ఇప్పటివరకు ఎంజీ విండ్సర్ ఈవీ కారు 15,000 యూనిట్ల ఉత్పత్తి జరిగింది. ఈ కారు భారత్‌లో తొలి ఎలక్ట్రిక్ CUV కారు మోడల్‌గా చెప్పవచ్చు. ఈ సెగ్మెంట్ లో మరే ఇతర సంస్థల మోడళ్లు దీనికి పోటీగా లేవు. దీంతో ఈ కారుకు ఈ స్థాయిలో వినియోగదారుల నుంచి స్పందన రావడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
అంతేకాకుండా.. ఎంజీ సంస్థ అందిస్తున్న "బ్యాటరీ యాస్ ఏ సర్వీస్" ప్రోగ్రాం కూడా ఈ కారు రెస్పాన్స్ రావడానికి మరో ముఖ్య కారణంగా చెప్పొచ్చు. ఈ స్కీం కింద ఈ విండ్సర్ ఈవీని కొనుగోలు చేసినప్పుడు ఇందులోని బ్యాటరీ కోసం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. అదే సమయంలో ఈ బ్యాటరీ వినియోగించి ప్రయాణించిన ప్రతి కిలోమీటరుకు 'ఫీ' చెల్లించాలి.

అంటే.. ప్రతి కిలోమీటరుకు రూ.3.50 చొప్పున రుసుమును JSW MG motor సంస్థకు వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ విండ్సర్ ఈవీ అమ్మకాలు ఈ స్థాయిలో పెరగడానికి తోడ్పడింది. అలాగే ఈ కారు SUV లకు టఫ్‌నెస్ ఇవ్వగలిగే సామర్థ్యం కలిగి ఉంది. ఇది కూడా ఈ కారు బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా కొనసాగడానికి మరో ముఖ్య కారణంగా ఉంది.
ఎంజీ సంస్థ ఈ కారులో ఎక్కువ స్పేస్ మాత్రమే కాకుండా సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని పొందే విధంగా ఫెసిలిటీస్ అందించింది. ముఖ్యంగా ఇందులో ఏరోప్లేన్లలో ఉండే తరహాలో సీట్లను ఏర్పాటు చేసింది. ఇవి 130° ల వరకు వంగుతాయి. అలాగే ఈ కారులో 604 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది. వెంటిలేటెడ్ సీట్స్, 256 కలర్స్‌లో ప్రకాశించే యాంబియంట్ లైటింగ్ ఉంటుంది.
ఈ కారు మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. Exide, Exclusive, Essence అనేవి ఇందులోని వేరియంట్లు. ఈ కారు ప్రారంభ ధర రూ.13,99,800గా ఉంది. ఇది ఎక్స్-షోరూం ధర, అలాగే battery as a service స్కీం ఈ ధరకు వర్తించదు. ఈ కారును ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 332 కిలోమీటర్ల రేంజ్ అందించగలదు.
డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రవేశంతో భారత్‌లో ఎలక్ట్రిక్ కార్లకు పాపులారిటీ రెట్టింపు అయిందని చెప్పవచ్చు. ఈ కారుకు ఉన్న డిమాండ్ కారణంగా దీని ఉత్పత్తిలో ఈ కొత్త రికార్డును నమోదు చేయగలిగింది. రాబోయే రోజుల్లో ఈ కారు మరిన్ని రికార్డులు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








