దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దికున్న కంపెనీ.. డిమాండ్ ఎక్కువ ఉన్న ఆ ఈవీపై ధర పెంపు!
దేశంలో ఈవీల హవా కొనసాగుతున్న నేపథ్యంలో.. ఆటోమొబైల్ సంస్థలు తమ ఎలక్ట్రిక్ వాహనాలతో మార్కెట్లో పోటీనిపెంచుతున్నాయి. దిగ్గజ సంస్థ ఎంజీ మోటార్స్.. కూడా భారత ఈవీ మార్కెట్లో తన సత్తా చాటుతోంది. ఈ సంస్థ నుంచి విండ్సర్ ఈవీ(Windsor EV) వినియోగదారులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ మోడల్ లాంఛ్ అయిన కొద్ది కాలంలోనే ఈ సంస్థ నుంచి బెస్ట్-సెల్లింగ్ మోడల్‌గా నిలిచింది. ఈ సంస్థ మొత్తం అమ్మకాల్లో సగానికి పైగా విండ్సర్ ఈవీవే కావడం గమనార్హం. ఎలక్ట్రిక్ కార్ మార్కెట్‌లో ఈ విండ్సర్ అమ్మకాల ద్వారా ఎంజీ మోటార్ సంస్థ ప్రత్యేక స్థానం సంపాదించుకోగలిగింది. అందుబాటు ధరలో ఉండడం, బ్యాటరీ యాస్ ఏ సర్వీస్ (BaaS) అనే ఆఫర్లను తీసుకురావడంతో ఇది వినియోగదారులకు చేరువైంది. ఇప్పటికే ధరలను పెంచిన ఎంజీ మోటార్స్ ప్రస్తుతం దీని బ్యాటరీ రెంటల్‌ని సైతం పెంచుతున్నట్లు ప్రకటించింది. దీని ప్రస్తుత ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
ఎంజీ విండ్సర్ ఈవీ భారత మార్కెట్లో విడుదలైన నాలుగు నెలల తర్వాత ఈ కారుకు సంబంధించిన ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది ఎంజీ మోటార్ సంస్థ. ఈ కారుకు చెందిన మూడు ఎడిషన్ల ధరలు రూ. 50,000 వరకు పెరిగాయి. ఇందులోని బేస్ ఎడిషన్ అయిన 'ఎగ్జిట్' వేరియంట్ ధర రూ.14 లక్షల్లో ప్రారంభమవుతుండగా.. మిడ్ రేంజ్ 'ఎక్స్‌క్లూజివ్' వేరియంట్ ధర రూ.15 లక్షలుగా ఉంది.

ఇందులో టాప్ వేరియంట్ 'ఎసెన్స్' ధర రూ.16 లక్షలుగా ఉంది. ఈ కార్ల ధరలు పెరిగినప్పటికీ ఇందులోని ఫీచర్ల కారణంగా ఇది ఇతర ఈవీలకు గట్టి పోటీగానే ఉంటుందని చెప్పవచ్చు. విండ్సర్ ఈవీని మొదటిసారి కొనుగోలు చేసే వ్యక్తికి ఎంజీ సంస్థ లైఫ్ టైం వారంటీ ఆఫర్ అందిస్తోంది. ఈ ఆఫర్ ద్వారా.. ఎంజీ సంస్థకు చెందిన పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లలో ఒక సంవత్సరం ఉచితంగా చార్జింగ్ చేసుకోవచ్చు.
మూడు సంవత్సరాలు లేదా 45 వేల కిలోమీటర్ల తర్వాత ఈ కారు పై 60% మనీ బ్యాక్ గ్యారంటీ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్లు.. మొదటిసారి ఈ కారు కొనుగోలు చేసే వారిని బాగా ఆకర్షిస్తున్నాయి. అయితే ఎంజీ మోటార్ అమ్మకాల్లో ఆ సంస్థ ప్రవేశపెట్టిన బాస్(BaaS) మోడల్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ స్కీం కింద తక్కువ ధరకే వీటిని కొనుగోలు చేయవచ్చు.

ఇందులోని 'ఎక్సైట్' వేరియంట్ రూ. 9.99 లక్షలకు అందుబాటులో ఉండగా 'ఎక్స్ క్లూజివ్' వేరియెంట్ రూ.10.99 లక్షలకు, అలాగే 'ఎసెన్స్' వేరియంట్ రూ.11.99 లక్షలకు ఉంది. అయితే బ్యాటరీ రెంటల్ కింద లభించే వీటి సబ్స్క్రిప్షన్ ధరను కిలోమీటర్‌కి రూ. 3.5 నుంచి రూ 3.9కి పెరిగింది. ఇది వినియోగదారులకు కాస్త ఖర్చులు పెంచే అవకాశం ఉంది.
ఈ విండ్సర్ ఈవీ.. 38 kwh బ్యాటరీతో పర్మనెంట్ మ్యాగ్నెట్ మోటార్‌తో కనెక్ట్ అయి ఉంటుంది. ఇది ఫ్రంట్- వీల్ డ్రైవ్‌కు శక్తినందిస్తుంది. ఇది 134 hp పవర్, 200 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ఎకో ప్లస్, ఎకో, నార్మల్, స్పోర్ట్ డ్రైవింగ్ మోడ్స్‌తో అందుబాటులో ఉంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 331 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుంది.

ఈ కారు చార్జింగ్ స్పీడ్ కూడా అధికంగా ఉంటుంది. దీంట్లో DC ఫాస్ట్ చార్జర్ వినియోగిస్తే 40 నిమిషాల్లోనే 80% చార్జింగ్ అవుతుంది. ఈ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం వినియోగదారులను ఆకట్టుకోవడంలో మరో ముఖ్య కారణంగా నిలుస్తోంది. ధరల పెరుగుదల మినహా విండ్సర్ ఈవీకి సంబంధించి ఫీచర్లు, స్పెసిఫికేషన్లలో మరెలాంటి మార్పులు లేవు. ఈ కారు స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్, అడ్వాన్స్ టెక్నాలజీతో రానున్న మోడల్స్ లోనూ కొనసాగనున్నాయి.
డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య: ఎంజి మోటార్ సంస్థ తమ విండ్సర్ ఈవీ కారు ధరలు పెంచుతున్నప్పటికీ వినియోగదారుల కోసం అట్రాక్టివ్ ఆప్షన్లను తీసుకువస్తుండడంతో దీని మార్కెట్ పెరుగుతోంది. దీని స్ట్రాంగ్ పర్ఫామెన్స్ మెట్రిక్స్, కస్టమర్ సెంటర్ ఫీచర్లు.. వినియోగదారులను ఇకపై కూడా ఆకర్షించే అవకాశం కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications








