రూ.12.24 లక్షలకే విండ్సర్ కొత్త వేరియంట్.. శక్తివంతమైన బ్యాటరీతో 449కి.మీల రేంజ్.. ఫీచర్స్ ఇవే!
ఎంజీ మోటార్స్‌కు చెందినటువంటి ప్రసిద్ధ ఎలక్ట్రిక్ కారు విండ్సర్ (Windsor) భారతీయ మార్కెట్లో మంచి పేరు సంపాదించుకుంది. శక్తివంతమైన పనితీరు, స్టైలిష్ డిజైన్, ఆకర్షణీయమైన ధర వంటి అంశాల ద్వారా ఈ కార్ చాలా మంది వినియోగదారుల మనసు దోచుకుంది. దీంతో దీనిని మరింత విస్తరించేందుకు MG మోటార్స్ తాజాగా విండ్సర్ ప్రో EV ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇది సాధారణ విండ్సర్ EV కంటే కొంచెం అధిక ధరకు కొనుగోలు చేయడానికి లభిస్తుంది. అందులోని అదనపు ఫీచర్లు, రేంజ్, ప్రీమియం అనుభూతి దాన్ని మరింత విలువైన కార్‌గా మార్చాయి. ఈ కార్ ప్రారంభ సమయంలో ధర రూ.17.49 లక్షలుగా నిర్ణయించబడింది. ఈ ఆఫర్ కేవలం మొదటి 8,000 కస్టమర్లకు మాత్రమే వర్తించగా, ఆ సంఖ్య దాటిన వెంటనే దాని ధరను రూ.18.09 లక్షలకు పెంచారు.
ఇది కొంతమంది కొనుగోలుదారులకు నిరాశ కలిగించినా, కంపెనీ వారికి శుభవార్త తీసుకొచ్చింది. దీనికి కొనసాగింపుగా కొత్త వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. దాని పేరు MG విండ్సర్ ఎక్స్‌క్లూజివ్ ప్రో EV. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.17,24,800. అయితే ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఈ కారును మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయాలని అనుకుంటే బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ (BAS) ప్రోగ్రామ్‌ను వాడుకోవచ్చు.

బాస్ ద్వారా అయితే ఇది కేవలం రూ.12.24 లక్షలకే లభిస్తుంది. ఈ మోడల్‌లో బ్యాటరీను అద్దెకు తీసుకునే విధానం ఉండటంతో, కొనుగోలు ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. వినియోగదారులు బ్యాటరీని ప్రతి కిలోమీటరుకు రూ.4.5 చెల్లిస్తూ ఉపయోగించవచ్చు. దీని వల్ల ప్రారంభ పెట్టుబడి తక్కువగా ఉండి, వాహనం కొనడం మరింత సులభతరం అవుతుంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడంలో ఇంకా సందేహంలో ఉన్న వారికి ఇది ఒక మంచి అవకాశం.
ఈ ఎక్స్‌క్లూజివ్ వేరియంట్‌ను ఆసక్తి ఉన్న వినియోగదారులు ముందస్తుగా రూ.11,000 అమౌంట్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. కంపెనీ ప్రకారం, జూన్ మొదటి వారం తర్వాత డెలివరీలు ప్రారంభంకానున్నాయి. ఇది త్వరలోనే రోడ్లపై కనిపించే అవకాశం ఉన్న ఆకర్షణీయమైన ఎలక్ట్రిక్ కారుగా నిలుస్తోంది. కొత్త ఎక్స్‌క్లూజివ్ వేరియంట్‌లో 52.9kWh కెపాసిటీ గల బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది ఒక్కసారి ఛార్జ్‌తో గరిష్టంగా 449 కిలోమీటర్లు ప్రయాణించగలదు.

ఇది నగర ప్రయాణాలు, లాంగ్ డ్రైవ్‌ల కోసం పూర్తిగా సరిపోయే రేంజ్. దీనిని మరింత ప్రీమియంగా తీర్చిదిద్దారు. బ్లాక్ ఇంటీరియర్ క్యాబిన్ ప్యాలెట్‌తో కలిపి, ఇది డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్‌లో అందించబడుతోంది. కారుకు డ్యూయల్-టోన్ 18 అంగుళాల అల్లాయ్ వీల్స్ ప్రత్యేక ఆకర్షణను చేకూర్చాయి. కలర్స్ విషయంలో కంపెనీ వినియోగదారులకు ఇష్టమైన వాటిని ఇచ్చింది. పెర్ల్ వైట్, స్టారీ బ్లాక్, టర్కోయిస్ గ్రీన్ కలర్స్‌లో ఇది లభిస్తుంది.
ఇంటీరియర్ డిజైన్‌లో మరో హైలైట్‌గా 15.6 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్ స్క్రీన్ ఉంది. ఇది మెరుగైన కనెక్టివిటీ, నావిగేషన్, ఎంటర్‌టైన్‌మెంట్ ఆప్షన్లను అందించేలా రూపొందించబడింది. MG విండ్సర్ ప్రో EV ఎక్స్‌క్లూజివ్ వేరియంట్ స్టైల్, ఫీచర్స్, పనితీరు పరంగా ప్రీమియం అనుభూతిని అందిస్తూ, భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో మరో కీలకమైన మోడల్ లాగా ఎదిగే అవకాశాలు ఉన్నాయి.

కొత్త ఎక్స్‌క్లూజివ్ వేరియంట్‌లో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్‌లు, AI- ఆధారిత వాయిస్ కంట్రోల్, స్పీకర్ సౌండ్ సిస్టమ్, గ్లాస్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, క్యాబిన్ అంతటా యాంబియంట్ లైటింగ్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ వంటి ఫీచర్లు కూడా లభిస్తాయి.


Click it and Unblock the Notifications








