ఫలించిన ధోనీ మ్యాజిక్.. ప్రతీ 300 మందిలో ఒకరు ఈ కంపెనీ కారు కొంటున్నారు
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఇతర పెద్ద కంపెనీలతో పోలిస్తే తక్కువ అమ్మకాలు చేస్తున్న సిట్రోయెన్ కంపెనీ అక్టోబర్ 2025లో మాత్రం సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ఎంఎస్ ధోనిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకోవడం, కంపెనీ కొత్త వ్యూహాలు అమలు చేయడంతో ఫలితం కనిపించడం మొదలైంది.
గత నెలలో సిట్రోయెన్ మొత్తం 1,426 కార్లను విక్రయించింది. ఇది 2024 అక్టోబర్‌లో అమ్ముడైన 717 కార్ల కంటే దాదాపు 99% ఎక్కువ వృద్ధి. అంతేకాదు సెప్టెంబర్ (734 యూనిట్లు) తో పోలిస్తే నెలవారీ అమ్మకాలు కూడా 94% పెరిగాయి. ఈ వృద్ధికి ప్రధానంగా C3 హ్యాచ్‌బ్యాక్ కారు కారణమైంది.

సిట్రోయెన్ మొత్తం అమ్మకాల్లో వృద్ధి రావడానికి దాని ప్రధాన మోడళ్లు అద్భుతమైన ప్రదర్శన చేశాయి. C3 హ్యాచ్‌బ్యాక్ కారు అక్టోబర్‌లో 897 యూనిట్లతో బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచింది. ఇది గత ఏడాది అక్టోబర్‌తో పోలిస్తే ఏకంగా 199% వృద్ధిని సాధించింది. దీనిని బట్టి చూస్తే భారీగా అమ్మకాలు పెరిగాయి.
C3 ఎయిర్‌క్రాస్ SUV కూడా అక్టోబర్‌లో 227 యూనిట్లు అమ్మింది. గత సెప్టెంబర్‌లో కేవలం 59 యూనిట్లు మాత్రమే అమ్ముడవగా, దీని నెలవారీ వృద్ధి ఏకంగా 285% పెరిగింది. 4.2-4.4 మీటర్ల SUV లలో అత్యధికంగా అమ్ముడైన 15 కార్లలో C3 ఎయిర్‌క్రాస్, బసాల్ట్ రెండూ చోటు దక్కించుకున్నాయి.

సిట్రోయెన్, ఇతర మోడళ్ల అమ్మకాల వివరాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. కూపే-స్టైల్ SUV అయిన బసాల్ట్ 217 యూనిట్లు అమ్ముడై, నెలవారీగా 3% వృద్ధిని చూపింది. అయితే, గత ఏడాదితో పోలిస్తే 2% తగ్గుదల ఉంది. ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ eC3 కూడా అక్టోబర్‌లో 83 యూనిట్లు అమ్మింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 7% తగ్గినా సెప్టెంబర్‌లో (18 యూనిట్లు) తో పోలిస్తే నెలవారీగా 388% భారీ వృద్ధిని చూపింది.
సిట్రోయెన్ మొదటగా ఇండియాలో లాంచ్ చేసిన C5 ఎయిర్‌క్రాస్ మాత్రం కేవలం 2 యూనిట్లు మాత్రమే అమ్ముడైంది. సిట్రోయెన్ అమ్మకాలు పెరగడానికి కొన్ని కీలకమైన అంశాలు దోహదపడ్డాయి. క్రికెటర్ ఎంఎస్ ధోనితో భాగస్వామ్యం ద్వారా వచ్చిన భారీ ప్రచారం, కంపెనీ బ్రాండ్‌ను భారతీయ కస్టమర్లలోకి మరింత బలంగా తీసుకెళ్లగలిగింది.

సిట్రోయెన్ అమలు చేస్తున్న Shift Into the New అనే కొత్త వ్యూహం కింద ఇటీవల విడుదల చేసిన సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ ఎక్స్, సిట్రోయెన్ బసాల్ట్ ఎక్స్ వంటి కొత్త ఉత్పత్తులు మార్కెట్‌లో ప్రభావం చూపాయి. పండుగ సీజన్‌లో పెరిగిన డిమాండ్, జీఎస్‌టీ తగ్గింపు తర్వాత సిట్రోయెన్ తమ వాహనాల ధరలను తిరిగి సర్దుబాటు చేయడం కూడా ఈ వృద్ధికి ప్రధాన కారణంగా చూడవచ్చు.
మొత్తంగా, కొన్ని కార్లు తక్కువగా అమ్ముడవుతున్నా, సిట్రోయెన్ మొత్తం అమ్మకాలు పెరగడం అనేది భారతీయ మార్కెట్‌లో కంపెనీ కొత్త వ్యూహాలు విజయవంతం అవుతున్నాయని సూచిస్తుంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో సిట్రోయెన్ వాటా 0.3%గా ఉంది. దీని అర్థం కారు కొన్న ప్రతి 300 మందిలో ఒకరు సిట్రోయెన్ కారును కొనుగోలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications








