ఒకప్పుడు టాప్ బ్రాండ్... 16 ఏళ్లలో తొలిసారి టాప్ 10 నుంచి నిష్క్రమించిన నిస్సాన్
ప్రపంచంలోని అత్యుత్తమ కార్ల తయారీ సంస్థల్లో నిస్సాన్ ఒకటి. జపాన్‌కు చెందిన ఈ కార్ల తయారీ సంస్థ ప్రస్తుతం భారతదేశంలో రెండు కార్లను మాత్రమే విక్రయిస్తున్నప్పటికీ గల్ఫ్ దేశాలలో నివసించే వారిని ఈ కంపెనీ గురించి అడిగితే వారికి నిస్సాన్ అంటే చాలా ఇష్టం.
చాలా సంవత్సరాలుగా ప్రపంచంలోని టాప్ 10 కార్ల తయారీదారులలో నిస్సాన్ ఒకటిగా ఉండేది. అయితే ఇప్పుడు కంపెనీ టాప్ 10 జాబితా నుండి బయటకు వచ్చేసింది. గత 16 ఏళ్లలో టాప్ 10 ఆటో బ్రాండ్‌ల జాబితా నుండి నిస్సాన్ బయటకు రావడం ఇదే మొదటిసారి. దీని గురించి మరిన్ని వివరాలను ఈ వార్తలో తెలుసుకుందాం.

నిస్సాన్ ఈ మధ్య కాలంలో మార్కెట్లో నిలదొక్కుకునేందుకు అనేక సమస్యలను ఎదుర్కొంటోందనేది సీక్రెట్ ఏం కాదు. ఆర్థిక సమస్యలు, ఫ్యాక్టరీలలో ఉద్యోగుల తొలగింపు, ఇంజిన్ లోపాల కారణంగా చట్టపరమైన సమస్యలు వంటి వాటి వల్ల నిస్సాన్ గత కొన్ని రోజులుగా ఇబ్బందులు పడుతోంది. ఇప్పుడు అమ్మకాల పరంగా టాప్ 10 గ్లోబల్ ఆటో కంపెనీల జాబితా నుంచి నిస్సాన్ బయటకు వచ్చేసింది.
నిక్కి ఆసియా నివేదిక ప్రకారం.. జనవరి-జూన్ మధ్య కాలంలో ప్రపంచ అమ్మకాలు 6 శాతం పడిపోయి 1.61 మిలియన్ యూనిట్లకు చేరడంతో నిస్సాన్ టాప్ 10 నుండి బయటకు వచ్చింది. దీంతో కంపెనీ తన ప్రధాన ప్రత్యర్థులైన టయోటా, వోక్స్‌వ్యాగన్ గ్రూప్‌ల కంటే చాలా వెనుకబడిపోయింది. నిస్సాన్ అమ్మకాలు పడిపోవడంతో బీవైడీ, గీలీ వంటి బ్రాండ్లు ముందుకు దూసుకొచ్చాయి. చైనాకు చెందిన బీవైడీ అమ్మకాలు 33 శాతం పెరిగి ఎనిమిదో స్థానానికి చేరుకుంది.

స్థానిక కంపెనీ అయిన సుజుకి కూడా 2004 తర్వాత మొదటిసారిగా అమ్మకాలలో నిస్సాన్‌ను అధిగమించింది. 20 ఏళ్ల తర్వాత సుజుకి నిస్సాన్ కంటే 20,000 యూనిట్లు ఎక్కువగా (1.63 మిలియన్ వాహనాలు) అమ్మకాలు చేసి నిస్సాన్‌ను వెనక్కి నెట్టింది.
ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో నిస్సాన్ 104 బిలియన్ డాలర్ల నష్టాన్ని నమోదు చేసింది. ఇది వరుసగా నాలుగో త్రైమాసికంలో నష్టాలను నమోదు చేయడం. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ లాభం 191 మిలియన్ డాలర్లుగా ఉండేది. వాస్తవానికి నిస్సాన్‌కు చైనా అతిపెద్ద మార్కెట్. ఆ దేశ మార్కెట్లో కూడా కంపెనీ అమ్మకాలు 18 శాతం పడిపోయాయి. ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్‌లో చైనాలో కేవలం 2,70,000 యూనిట్లు మాత్రమే విక్రయించగలిగింది.

2018లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన సమయంలో నిస్సాన్ చైనాలో 7.2 మిలియన్ వాహనాలను విక్రయించింది. చైనా మార్కెట్‌లో అమ్మకాలు మూడింట ఒక వంతుకు పడిపోవడం పెద్ద ఎదురుదెబ్బగా మారింది. జపాన్ మార్కెట్‌లో కంపెనీ కేవలం 2.2 మిలియన్ కార్లను మాత్రమే విక్రయించింది. ఇది 10 శాతం క్షీణత. ఇది 1993 తర్వాత అత్యల్ప అమ్మకాలు. నిస్సాన్ చాలా కాలంగా ఆర్థిక సంక్షోభంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే.
నిస్సాన్, రెనాల్ట్‌తో చేతులు కలిపి తమిళనాడులో ఉన్న ప్లాంట్‌లో నిస్సాన్ తన వాటాలను విక్రయించి, ఫ్రాన్స్‌కు చెందిన రెనాల్ట్‌కు పూర్తి యాజమాన్యాన్ని అప్పగించింది. అంతర్జాతీయ స్థాయిలో కంపెనీ మార్కెట్ వాటా పడిపోతోంది. కొత్త కార్లు ఏవీ రాకపోవడంతో భారతదేశంలో కూడా అమ్మకాలు నిరుత్సాహంగా ఉన్నాయి. మాగ్నైట్ ఎస్‌యూవీ మాత్రమే నిలదొక్కుకుంటోంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ సంక్షోభాన్ని పరిష్కరిస్తేనే భారత్‌లో కూడా నిస్సాన్ నిలబడగలుగుతుంది.


Click it and Unblock the Notifications








