24 కి.మీ మైలేజ్.. ఈ టాటా కారుకి ఫుల్ డిమాండ్.. లేవన్నా వినకుండా షోరూంల ముందు క్యూ కడుతున్న జనం
టాటా నెక్సాన్ (Tata Nexon) కారు ప్రజల్లో చాలా చాలా పాపులారిటీ పొందింది. ఇది ఒక కాంపాక్ట్ ఎస్‌యూవీ. ఆకర్షణీయమైన డిజైన్, అనేక ఫీచర్లను కలిగి ఉంది. కస్టమర్లు కూడా ఒకరి తర్వాత ఒకరు వరుస పెట్టి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. గత ఆగస్టు నెలలో నెక్సాన్ కారు భారీ సంఖ్యలో అమ్ముడైంది. ఈ నెలలో మొత్తం 14,004 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 14% పెరుగుదలను సూచిస్తుంది.
ప్రస్తుతం ఈ ఎస్‌యూవీ ధర రూ. 8 లక్షల నుంచి రూ. 15.60 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంది. కేంద్ర ప్రభుత్వం కార్ల కొనుగోలుపై జీఎస్‌టీని సవరించినందున, ఆ ప్రయోజనాన్ని పూర్తిగా కస్టమర్లకు బదిలీ చేయాలని టాటా మోటార్స్ నిర్ణయించింది. అందుకే నెక్సాన్ ధర రూ. 1.55 లక్షల వరకు తగ్గింది. కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వస్తాయి.

ఈ కారు స్మార్ట్, ప్యూర్ ప్లస్, ప్యూర్ ప్లస్ ఎస్, క్రియేటివ్, క్రియేటివ్ ప్లస్, ఫియర్‌లెస్ వంటి వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇది చూడటానికి చాలా అందమైన డిజైన్‌ను కలిగి ఉంది. ప్యూర్ గ్రే, డేటోనా గ్రే, ప్రిస్టిన్ వైట్, కార్బన్ బ్లాక్, గ్రాస్‌ల్యాండ్ బీజ్, రాయల్ బ్లూ, ఓషన్ బ్లూ వంటి రంగులలో లభిస్తుంది.
కొత్త నెక్సాన్ శక్తివంతమైన పవర్‌ట్రైన్‌ను కలిగి ఉంది. ఇందులో 1.2-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్, 1.2-లీటర్ సిఎన్‌జి ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. ఇది 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్/ఆటోమేటిక్, 7-స్పీడ్ డీసీటీ (డ్యుయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్) గేర్‌బాక్స్‌లను కలిగి ఉంది. ఇది 17 నుంచి 24 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. దీని ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం 44 లీటర్లు.

ఈ ఎస్‌యూవీలో 5 సీటింగ్ ఆప్షన్ ఉంది. ఎక్కువ సామాను తీసుకెళ్లడానికి వీలుగా 382 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. ఇందులో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, 9 స్పీకర్ల జేబీఎల్ సౌండ్ సిస్టమ్‌తో సహా అనేక ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా కూడా ఉన్నాయి.
టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ వేరియంట్లో కూడా లభిస్తుంది. దీని ధర రూ. 12.49 లక్షల నుంచి రూ. 17.19 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఇందులో 30 కిలోవాట్ (kWh), 45 కిలోవాట్ (kWh) బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 489 కిలోమీటర్ల వరకు రేంజ్ (మైలేజ్) ఇస్తుంది.
ఈ ఎలక్ట్రిక్ కారు కూడా మంచి డిజైన్‌ను కలిగి ఉంది. ఎంపవర్‌డ్ ఆక్సైడ్, ప్రిస్టిన్ వైట్, ఫ్లేమ్ రెడ్, డేటోనా గ్రే, ఫియర్‌లెస్ పర్పుల్, ఇంటెన్సి టీల్, క్రియేటివ్ ఓషన్, కార్బన్ బ్లాక్ వంటి రంగులలో లభిస్తుంది. ఇది 5 సీటింగ్‌ను కలిగి ఉంది. ఇందులో ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. ఎక్కువ సామాను తీసుకెళ్లడానికి వీలుగా 350 లీటర్ల బూట్ స్పేస్ ఉంది.
కొత్త నెక్సాన్ ఈవీలో 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫుల్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 9 స్పీకర్ల జేబీఎల్ సౌండ్ సిస్టమ్, ఆటో ఏసీ, క్రూజ్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రయాణికుల రక్షణ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌సీ (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), 360 డిగ్రీ కెమెరా ఉన్నాయి.
డ్రైవ్‌స్పార్క్ విశ్లేషణ: పెరిగిన అమ్మకాలు, ధర తగ్గింపు, అడ్వాన్సుడ్ ఫీచర్లతో టాటా నెక్సాన్ వినియోగదారులకు మరింత ఆకర్షణీయంగా మారింది. ఈ కారు పెట్రోల్, డీజిల్, ఈవీ వేరియంట్‌లలో అందుబాటులో ఉండటం కూడా దీని డిమాండ్ పెరగడానికి ఒక కారణం.


Click it and Unblock the Notifications








