8లక్షల ఇళ్లకు చేరుకున్న టాటా మోడల్.. అమ్మకాల్లో ఇదో రికార్డు.. దీనిని అందుకోవడం మిగతా వాటికి కష్టమే
మనదేశంలో విశ్వసనీయతకు మారు పేరు టాటా మోటార్స్. సేఫ్టీ, అత్యాధునిక ఫీచర్లతో వాహనాలను తయారు చేస్తూ ప్రజల మన్ననలను పొందుతున్న ఆటోమొబైల్ తయారీదారు. కంపెనీ ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ కొత్త వాహనాలను మార్కెట్లోకి తీసుకొస్తుంది. ఇతర కంపెనీలతో పోల్చుకుంటే వాహనాల ధరలు తక్కువగా ఉండడంతో వీటిని కొనేందుకు జనాలు ఆసక్తి చూపిస్తుంటారు.
ఈ కంపెనీ ప్రస్టేజియస్ ప్రొడక్ట్ అయిన టాటా నెక్సాన్ తాజాగా రికార్డు సృష్టించింది. కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన మోడల్ నెక్సాన్. దాని ప్రస్థానం ప్రారంభించి చాలా కాలం అయింది. కానీ నెక్సాన్ పట్ల ప్రజలకు ఉన్న ప్రేమ ఏమాత్రం తగ్గలేదని తాజాగా నిరూపణ అయింది. దీనికి కారణం కస్టమర్ల ఇష్టాలకు ప్రాధాన్యత ఇచ్చి ఎప్పటికప్పుడు కంపెనీ కొత్త మోడల్స్ తీసుకురావడమే అని చెప్పొచ్చు.

టాటా మోటార్స్ మార్కెటింగ్ వ్యూహం, సేఫ్టీ విషయంలో రాజీ పడకపోవడం కారణంగా నెక్సాన్ అమ్మకాల పరంగా కొత్త రికార్డును సృష్టించింది. టాటా నెక్సాన్ దేశీయ మార్కెట్లో 8 లక్షల అమ్మకాల మైలురాయిని దాటింది. ఈ మ్యాజిక్ నంబర్‌ను చేరుకున్న మొట్టమొదటి SUV బ్రాండ్ గా టాటా నెక్సాన్ నిలిచింది. అమ్మకాల వేగాన్నిఇదే విధంగా కొనసాగిస్తే వచ్చే ఏడాది నాటికి టాటా కాంపాక్ట్ SUV ఒక మిలియన్ యూనిట్ అమ్మకాల మైలురాయిని సాధిస్తుంది.
టాటా ఇప్పుడు లక్షల్లో వ్యాపారం చేస్తోంది. అయితే 2018 ఆర్థిక సంవత్సరంలో కేవలం 27,547 యూనిట్ల నెక్సాన్‌ను మాత్రమే విక్రయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025లో ఫిబ్రవరి 25 వరకు కంపెనీ 1,46,723 యూనిట్ల SUV అమ్మకాలను సాధించింది. జూన్ 2021లో నెక్సాన్ 2 లక్షల అమ్మకాల మైలురాయిని దాటింది. ఈ మైలురాయిని చేరుకోవడానికి కంపెనీకి దాదాపు 45 నెలల సమయం పట్టింది.

తదుపరి రెండు లక్షల అమ్మకాలు చాలా వేగంగా జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. కేవలం 16 నెలల్లో 4 లక్షల అమ్మకాల రికార్డును నెలకొల్పిన నెక్సాన్, తర్వాత 6 నెలల్లో 5 లక్షల కీలక మైలురాయిని దాటింది. అక్కడి నుండి 6 లక్షల యూనిట్ల అమ్మకాలను చేరుకోవడానికి దాదాపు 7 నెలలు పట్టింది. 7 లక్షల అమ్మకాలను చేరుకోవడానికి మరో 7 నెలలు పట్టింది. ఇది జూలై 2024లో సాధించింది.
నెక్సాన్ ఫిబ్రవరి 2025లో 8 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని దాటింది. దీనిని సాధించేందుకు కంపెనీకి దాదాపు 89 నెలలు పట్టింది. దీని అర్థం టాటా నెక్సాన్ బ్రాండ్ బెస్ట్ సెల్లింగ్ SUV గా మారడానికి 7 సంవత్సరాల 5 నెలలు పట్టింది.

2022, 2023, 2024 ఆర్థిక సంవత్సరాల్లో నెక్సాన్ భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన SUVగా నిలిచింది. టాటాకు చెందిన ఈ నెక్సాన్ దానికి పోటీగా నిలిచిన హ్యుందాయ్ క్రెటా, మారుతి బ్రెజ్జాలను ఓడించి ఈ ఘనత సాధించింది. టాటా మోటార్స్ ఇటీవలే 2025 మోడల్ ఇయర్ అప్‌డేట్‌తో ఈ మోడల్లో కొన్ని మార్పులు చేసింది.
కేవలం రూ. 7.99 లక్షల ప్రారంభ ధరతో తీసుకొచ్చిన 2025 టాటా నెక్సాన్‌ను కంపెనీ కొత్త కలర్ ఆఫ్షన్లు, కొత్త వేరియంట్స్, లేటెస్ట్ ఫీచర్లను పరిచయం చేసింది. ఈ SUV కొత్తగా ప్రవేశపెట్టిన కలర్ ఆప్షన్ పేరు గ్రాస్‌ల్యాండ్ బీజ్. అదనంగా, కొత్త ప్యూర్ ప్లస్, క్రియేటివ్ ప్లస్, క్రియేటివ్ ప్లస్ పీఎస్ వేరియంట్స్ కూడా SUVకి యాడ్ చేశారు.
కొత్త నెక్సాన్‌లో వాయిస్ అసిస్టెడ్ పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ లెథరెట్ సీట్స్, కొత్త 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, సబ్ వూఫర్‌తో కూడిన 9 JBL స్పీకర్స్, ఇ షిఫ్టర్, ప్యాడిల్ షిఫ్టర్‌లతో కూడిన 7-స్పీడ్ డీసీఏ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉన్నాయి. కంపెనీ కారుకు మెకానికల్ గా ఎలాంటి మార్పులు చేయలేదు.
నెక్సాన్ ఎస్యూవీ ఇప్పటికీ 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ రెవోట్రాన్ పెట్రోల్, 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ రెవోటార్క్ డీజిల్‌తో పవర్ పొందుతుంది. దీని 1,200 సిసి పెట్రోల్ ఇంజన్ 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 86.7 బిహెచ్‌పి పవర్, 1,750-4,000 ఆర్‌పిఎమ్ వద్ద 170 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిని CNG డ్యూయెల్ ఫ్యూయెల్ ఆఫ్షన్లలో కూడా పొందవచ్చు.


Click it and Unblock the Notifications








