మీ దగ్గర స్విఫ్ట్, క్రెటా, నెక్సాన్ కార్లు ఉన్నాయా? మైలేజ్ పెంచుకోవడానికి ఈ 5 సింపుల్ సీక్రెట్స్ పాటించండి
భారతీయ కార్ల కొనుగోలుదారులకు ఎప్పుడూ మైలేజ్ అనేది ఒక అత్యంత ముఖ్యమైన విషయం. ఈ రోజుల్లో పెట్రోల్ ధరలు విపరీతంగా పెరగడం, మరోవైపు దేశవ్యాప్తంగా E20 ఇంధనం వేగంగా అందుబాటులోకి రావడం వల్ల చాలామంది కార్ ఓనర్లలో మైలేజ్ గురించిన ఆందోళన మరింత పెరిగింది. సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వాడటం వల్ల మైలేజ్‌లో స్వల్ప తగ్గుదల ఉండవచ్చని స్వయంగా వాహన తయారీ కంపెనీలే అంగీకరిస్తున్నాయి. అయితే, మీ కారు మైలేజ్ అనేది కేవలం పెట్రోల్‌పై మాత్రమే కాకుండా.. మీ డ్రైవింగ్ విధానం, కారు మెయింటెనెన్స్, రోడ్ల పరిస్థితిపై కూడా ఆధారపడి ఉంటుంది. ఈ అలవాట్లలో కొన్ని చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మంచి మైలేజ్ సాధించవచ్చు.
E20 పెట్రోల్‌తో మైలేజ్ నిజంగానే తగ్గుతుందా?
సాంకేతికంగా చూస్తే ఇది నిజమేనని చెప్పాలి. ఎందుకంటే ఈ20 పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్, 80 శాతం సాధారణ పెట్రోల్ ఉంటుంది. సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్‌లో ఎనర్జీ కంటెంట్ కొద్దిగా తక్కువగా ఉంటుంది. దీనివల్ల కారు ఇంజిన్ అదే స్థాయి శక్తిని ఉత్పత్తి చేయడానికి సాధారణం కంటే కొంచెం ఎక్కువ ఇంధనాన్ని దహనం చేయాల్సి వస్తుంది. ఫలితంగా కార్ల మైలేజ్‌లో స్వల్ప వ్యత్యాసం లేదా మైలేజ్ కొద్దిగా తగ్గడం అనేది కనిపిస్తుంది. అయితే దీని గురించి పెద్దగా కంగారుపడాల్సిన అవసరం లేదు. కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ నష్టాన్ని సులభంగా భర్తీ చేయవచ్చు.

రయ్యి రయ్యిమని దూసుకెళ్తే పెట్రోల్ ఖాళీయే
కారు ఇంధనాన్ని ఆదా చేయడానికి అన్నింటికంటే సులభమైన మార్గం మీ డ్రైవింగ్ శైలిని మార్చుకోవడం. చాలామంది కారు నడుపుతున్నప్పుడు ఒక్కసారిగా యాక్సిలరేటర్‌ను గట్టిగా తొక్కడం, వేగంగా దూసుకెళ్లి అకస్మాత్తుగా బ్రేకులు వేయడం లాంటివి చేస్తుంటారు. ఇంజిన్‌ను అనవసరంగా ఎక్కువ RPMకి తీసుకెళ్లడం వల్ల పెట్రోల్ చాలా వేగంగా ఖర్చవుతుంది. అందుకే, ముఖ్యంగా నగరాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు లైట్ ఫుట్ విధానాన్ని పాటించాలి. హైవేలపై ప్రయాణించేటప్పుడు కారును స్థిరమైన వేగంతో నడపడం వల్ల అద్భుతమైన మైలేజ్ వస్తుంది.
ప్రతి 15 రోజులకోసారి టైర్లో గాలి చెక్ చేసుకోండి
ఇందులో ఎలాంటి రాకెట్ సైన్స్ లేదు, చాలా సాధారణ విషయం. మీ కారు టైర్లలో కంపెనీ సూచించిన దానికంటే తక్కువ గాలి ఉంటే, రోడ్డుపై టైర్ల రోలింగ్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. దీనివల్ల కారు ముందుకు సాగడానికి ఇంజిన్ మరింత ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. తద్వారా పెట్రోల్ చాలా వేగంగా అయిపోతుంది. అందుకే ప్రతి 15 రోజులకు ఒకసారి కారు టైర్ల ప్రెజర్‌ను కచ్చితంగా చెక్ చేసుకోవాలి. టైర్లలో సరైన గాలి ఉండటం వల్ల మైలేజ్ పెరగడమే కాకుండా టైర్ల జీవితకాలం కూడా పెరుగుతుంది.

సమయానికి సర్వీసింగ్ చేయించండి
సకాలంలో కారును సర్వీసింగ్ చేయించకపోతే మైలేజ్ దారుణంగా పడిపోతుంది. కారులోని ఎయిర్ ఫిల్టర్ జిడ్డుగా మారిపోవడం, స్పార్క్ ప్లగ్స్ అరిగిపోవడం లేదా ఇంజిన్ ఆయిల్ పాతబడిపోవడం వల్ల ఇంజిన్ పర్ఫార్మెన్స్ నెమ్మదిస్తుంది. ఇది నేరుగా కారు మైలేజ్‌పై ప్రభావం చూపుతుంది. అందుకే కారు ఓనర్స్ మాన్యువల్‌లో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఇంజిన్ ఆయిల్, ఫిల్టర్లను మార్పిస్తూ ఉండాలి. ఇది మీ కారును, మీ జేబును కూడా స్ట్రెస్ ఫ్రీగా ఉంచుతుంది.
కారులోని అనవసరమైన బరువును తీసేయండి
కారు ఎంత బరువుగా ఉంటే దానిని లాగడానికి ఇంజిన్‌కు అంత ఎక్కువ శక్తి అవసరమవుతుంది. చాలామంది తమ కారు డిక్కీలో అవసరం లేని భారీ వస్తువులను అలాగే ఉంచేస్తుంటారు, అలాంటి వాటిని వెంటనే బయటకు తీసేయండి. అలాగే, కారు పైన అమర్చే రూఫ్ క్యారియర్లు హైవేలపై వెళ్లేటప్పుడు గాలి ప్రవాహాన్ని అడ్డుకుంటాయి, దీనివల్ల కూడా మైలేజ్ తగ్గుతుంది.
ఇక ఏసీ విషయానికొస్తే.. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఏసీని కనీస ఉష్ణోగ్రతలో కాకుండా 22 నుంచి 24 డిగ్రీల సెల్సియస్ వద్ద సెట్ చేసి, కారు లోపల రీసర్క్యులేషన్ మోడ్ ఆన్ చేసుకోవడం వల్ల ఇంధనం ఆదా అవుతుంది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఒక నిమిషం కంటే ఎక్కువ సేపు ఆగాల్సి వస్తే ఇంజిన్ ఆఫ్ చేయడం లేదా ఆటో స్టార్ట్-స్టాప్ ఫీచర్‌ను ఉపయోగించడం చాలా మంచిది.

ప్రీమియం పెట్రోల్ కొట్టిస్తే ఎక్కువ మైలేజ్ వస్తుందా?
చాలామంది ప్రీమియం పెట్రోల్ కొట్టిస్తే మైలేజ్ పెరుగుతుందని నమ్ముతారు, కానీ ఇది పూర్తిగా తప్పు. మీ కారు మాన్యువల్‌లో ప్రత్యేకంగా హై-ఆక్టేన్ లేదా ప్రీమియం పెట్రోల్ వాడాలని సిఫార్సు చేయనంత వరకు, సాధారణ పెట్రోల్ కంటే రెట్టింపు ధర ఉండే ప్రీమియం పెట్రోల్ కొట్టించడం వల్ల మైలేజ్‌లో ఎలాంటి పెద్ద మార్పు రాదు.
మన దేశంలోని సాధారణ కార్లు అన్నీ రెగ్యులర్ పెట్రోల్, ఈ20 ఇంధనంపైనే అత్యుత్తమ పర్ఫార్మెన్స్ ఇచ్చేలా డిజైన్ చేయబడ్డాయి. కాబట్టి పైన పేర్కొన్న సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు, మీ కారు స్విఫ్ట్, క్రెటా, నెక్సాన్ ఏదైనా సరే.. ప్రతి లీటరు పెట్రోల్‌కు పైసా వసూల్ మైలేజ్ రావడం ఖాయం!


Click it and Unblock the Notifications