ఓర్నీ బడవా.. ఈ బాదుడేంటి ? చిన్న కార్ల ధరలను కూడా ఇంతలా పెంచేస్తే పేదవాళ్ల పరిస్థితి ఏంటి
ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం సిట్రోయెన్ (Citroen) అంతర్జాతీయ మార్కెట్లో ఎంతటి సంచలనాలు సృష్టించినా, భారత మార్కెట్లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. అయినప్పటికీ, పట్టువదలని విక్రమార్కుడిలా తన మోడళ్లలోని లోపాలను సరిదిద్దుకుంటూ భారత్‌లో పాగా వేయాలని గట్టి ప్రయత్నాలే చేస్తోంది. అయితే, ఈ క్రమంలోనే సంస్థ తన ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ సిట్రోయెన్ C3(Citroen C3) ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం కస్టమర్లను కాస్త నిరాశకు గురిచేస్తోంది. బడ్జెట్ ధరలో లగ్జరీ ఫీచర్లు కోరుకునే వారికి ఈ ధరల పెంపు ఒక షాక్ అనే చెప్పాలి.
భారతదేశంలో తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్న ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్, తన పాపులర్ హ్యాచ్‌బ్యాక్ C3 ధరలను సవరిస్తూ కీలక ప్రకటన చేసింది. గతంలో తక్కువ ధరకే ప్రీమియం అనుభూతిని ఇస్తామని చెప్పిన కంపెనీ, ఇప్పుడు ముడిసరుకు ఖర్చులు పెరగడం లేదా ఇతర కారణాల వల్ల ధరలను పెంచక తప్పలేదని పేర్కొంది.

ఈ ధరల పెంపు వేరియంట్‌ను బట్టి రూ.15,000 నుంచి రూ.40,000 వరకు ఉంది. ముఖ్యంగా టాప్-ఎండ్ వేరియంట్లు చూస్తున్న వారికి ఈ పెంపు భారంగా మారనుంది. సిట్రోయెన్ C3 లోని ఎంట్రీ లెవల్ వేరియంట్ అయిన లైవ్ (Live) మ్యాన్యువల్ ధర గతంలో రూ. 4.80 లక్షలుగా ఉండేది. ఇప్పుడది రూ. 15,000 పెరిగి రూ. 4.95 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరింది.
మధ్య స్థాయి వేరియంట్లు అయిన ఫీల్ (Feel), ఫీల్ (O) మ్యాన్యువల్ ధరలు కూడా రూ.15,000 పెరిగాయి. దీనితో ఫీల్ మ్యాన్యువల్ ధర రూ.5.85 లక్షలకు, ఫీల్ (O) ధర రూ.6.80 లక్షలకు చేరుకున్నాయి. అయితే, బేస్ మోడల్ కు కొంచెం పైన ఉండే 'లైవ్ (O)' మ్యాన్యువల్ ధరలో కంపెనీ ఎటువంటి మార్పు చేయకపోవడం గమనార్హం.

నిజమైన బాదుడు మాత్రం టాప్-ఎండ్ వేరియంట్లపైనే ఉంది. సిట్రోయెన్ C3 షైన్ (Shine) మ్యాన్యువల్ ధరపై ఏకంగా రూ.40,000 పెంచారు. దీనితో గతంలో రూ.7.23 లక్షలు ఉన్న ఈ కారు ధర ఇప్పుడు రూ.7.63 లక్షలకు చేరింది. అదేవిధంగా, షైన్ టర్బో మ్యాన్యువల్ ధర రూ.8.34 లక్షల నుంచి రూ.8.74 లక్షలకు పెరిగింది. ఇక అత్యంత ఖరీదైన షైన్ టర్బో ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ.9.05 లక్షల నుంచి రూ.9.45 లక్షల మార్కును తాకింది.
ధరలు పెంచినప్పటికీ, కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు సిట్రోయెన్ ఇటీవలే లైవ్ (O) అనే సరికొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి తెచ్చింది. దీని ధరను రూ.5.49 లక్షలుగా నిర్ణయించింది. ఇది కేవలం పెర్లా నెరా బ్లాక్ అనే ఆకర్షణీయమైన రంగులో మాత్రమే లభిస్తుంది.

బేస్ మోడల్ కంటే మెరుగైన ఫీచర్లు కోరుకునే వారికి ఇది మంచి ఆప్షన్. ఇందులో 10.1 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, రియర్ వ్యూ కెమెరా, స్పీకర్లు వంటి పదికి పైగా అధునాతన ఫీచర్లను జోడించారు.
ధరలు పెరిగినా ఇంజిన్ స్పెసిఫికేషన్లలో ఎటువంటి మార్పులు లేవు. బేస్, మిడ్ వేరియంట్లలో 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 80.4 bhp పవర్, 115 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇక టాప్ వేరియంట్లలో ఉండే 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ మాత్రం అదిరిపోయే పవర్ ఇస్తుంది.

ఇది 108.54 bhp పవర్, 205 Nm టార్క్ ఉత్పత్తి చేయడమే కాకుండా, కేవలం 10 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ఫీచర్ల పరంగా సిట్రోయెన్ ఇప్పుడు ఎయిర్ ప్యూరిఫైయర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి అంశాలను కూడా తన కార్లలో జోడిస్తూ టాటా ఆల్ట్రోజ్ వంటి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తోంది.


Click it and Unblock the Notifications








