దేశంలో ప్రతి గల్లీలో ఈ బైక్ ఉంటుంది.. కానీ దీని ఎలక్ట్రిక్ వెర్షనే ఎవరూ కొనట్లేదు
దేశవ్యాప్తంగా పెట్రోల్ స్కూటర్ల అమ్మకాల్లో మకుటం లేని మహారాజులా వెలిగిపోతున్న హోండా సంస్థకు ఎలక్ట్రిక్ సెగ్మెంట్ మాత్రం కోలుకోలేని దెబ్బ తీసింది. 2025 జనవరిలో భారీ అంచనాలతో విడుదలైన హోండా యాక్టివా ఇ (Activa e), క్యూసి1 (QC1) మోడళ్లు ఏడాది తిరిగేసరికి మార్కెట్లో ఘోరంగా విఫలమైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.
కేవలం ఏడాది కాలంలోనే ఈ స్కూటర్ల అమ్మకాలు భారీగా పడిపోవడంతో, కంపెనీ ఏకంగా వీటి ఉత్పత్తిని (ప్రొడక్షన్) నిలిపివేయాల్సిన క్లిష్ట పరిస్థితి ఏర్పడింది. గతేడాది ఫిబ్రవరి నుండి ఈ ఏడాది జనవరి వరకు కేవలం 3,723 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అమ్మకాల పరంగా ఈ స్కూటర్లు ఇంత ఘోరంగా ఫ్లాప్ అవ్వడానికి ప్రధాన కారణం వీటిలోని బ్యాటరీ టెక్నాలజీ అని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా యాక్టివా ఇ మోడల్ పూర్తిగా బ్యాటరీ స్వాపింగ్ (బ్యాటరీ మార్చుకునే సౌకర్యం) విధానంపైనే ఆధారపడింది. అంటే వినియోగదారులు తమ ఇంట్లో చార్జింగ్ పెట్టుకునే అవకాశం లేదు, కేవలం హోండా ఏర్పాటు చేసిన కేంద్రాలకు వెళ్లి బ్యాటరీలను మార్చుకోవాలి.
ఈ విధానం భారతీయ వినియోగదారులకు ఏమాత్రం రుచించలేదు. దీనికి తోడు ఈ బ్యాటరీ మార్పిడి కేంద్రాలు కేవలం బెంగళూరు, ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాలకే పరిమితం కావడంతో, ఇతర ప్రాంతాల వారు ఈ స్కూటర్లను కొనేందుకు అస్సలు ఆసక్తి చూపలేదు. ఫీచర్ల పరంగా కూడా హోండా తన ప్రత్యర్థులైన ఓలా, ఏథర్, టీవీఎస్ వంటి కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వలేకపోయింది.

ఇతర కంపెనీలు తమ స్కూటర్లలో అత్యాధునిక సాఫ్ట్‌వేర్, ఎక్కువ మైలేజీ, స్మార్ట్ ఫీచర్లను అందిస్తుంటే, హోండా మాత్రం పాతకాలపు పద్ధతిలోనే సాదాసీదాగా ఉండటం వినియోగదారులను నిరాశపరిచింది. మరోవైపు ధర విషయానికి వస్తే యాక్టివా ఇ మోడల్ రూ.1.18 లక్షల నుంచి రూ.1.52 లక్షల వరకు ఉండటం సామాన్యులకు భారంగా మారింది. పైగా బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ కోసం అదనంగా చెల్లించాల్సి రావడం కూడా ఈ స్కూటర్ల కొంపముంచింది.
హోండా నుంచి వచ్చిన మరో మోడల్ క్యూసి1 పరిస్థితి కూడా ఇలాగే ఉంది.రూ.90,000 తక్కువ ధరకే లభించినప్పటికీ, దీని వేగం, రేంజ్ చాలా తక్కువగా ఉండటం మైనస్ అయింది. గంటకు కేవలం 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ స్కూటర్, ఒక్కసారి చార్జ్ చేస్తే 80 కిలోమీటర్లు మాత్రమే వెళ్తుంది.

ఇది కేవలం డెలివరీ బాయ్స్ వంటి గిగ్ వర్కర్ల కోసం చేసినట్లు అనిపించినా, ఆ విభాగంలో కూడా దీనికి ఆదరణ లభించలేదు. దీంతో డీలర్ల వద్ద స్టాక్ గుట్టలుగా పేరుకుపోయింది. తయారు చేసిన 11,168 యూనిట్లలో సగం కూడా డీలర్ల దగ్గరకు వెళ్లకపోవడంతో హోండా యాజమాన్యం ప్రొడక్షన్ ఆపివేయాలని నిర్ణయించుకుంది.
ప్రస్తుతానికి ఈ రెండు మోడళ్లు మార్కెట్లో డిజాస్టర్‌గా మిగిలినప్పటికీ, హోండా తన ఎలక్ట్రిక్ కలలను వదులుకోవడం లేదు. ఈ వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకున్న కంపెనీ, 2027 నాటికి భారతీయ రోడ్లు, కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా సరికొత్త మోడళ్లను సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా హోమ్ చార్జింగ్ సౌకర్యం ఉన్న స్కూటర్లపై దృష్టి సారించాలని ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం పేరుకుపోయిన పాత స్టాక్ అంతా క్లియర్ అయిన తర్వాతే కొత్త ఉత్పత్తి గురించి కంపెనీ ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








