విదేశాల నుంచి వచ్చినా మనోళ్లు గుండెల్లో పెట్టుకున్నారు.. అమ్ముడయ్యే ప్రతి మూడు కార్లలో ఒకటి ఈ కంపెనీదే
భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్‌లో సౌత్ కొరియా దిగ్గజం హ్యుందాయ్ తన పట్టును నిలబెట్టుకుంటూనే ఉంది. ఈ ఏడాది మార్చి నెల విక్రయాల గణాంకాలను పరిశీలిస్తే, హ్యుందాయ్ పోర్ట్‌ఫోలియోలో ఎప్పటిలాగే ఒక కారు మాత్రం తన హవాను చాటుతోంది. వెన్యూ, ఆరా, ఎక్స్‌టర్ వంటి మోడల్స్ మార్కెట్లో ఉన్నప్పటికీ, కస్టమర్ల మొదటి ఛాయిస్ మాత్రం క్రెటాగానే నిలిచింది. ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీ అమ్మకాల్లో తన తోటి మోడల్స్ అయిన i10, i20లను దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు.
క్రెటా అమ్మకాల జాతర
హ్యుందాయ్ మోటార్ ఇండియా విడుదల చేసిన మార్చి 2026 విక్రయాల నివేదిక ప్రకారం.. కంపెనీకి చెందిన అత్యధిక విక్రయాలు పొందిన మోడల్ గా క్రెటా నిలిచింది. గత నెలలో మొత్తం 17,838 యూనిట్ల క్రెటా కార్లు అమ్ముడయ్యాయి. అయితే, గత ఏడాది ఇదే కాలంలో (మార్చి 2025) జరిగిన 18,059 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే ఇది ఒక శాతం స్వల్ప తగ్గుదల. అయినప్పటికీ, హ్యుందాయ్ విక్రయాల్లో సగానికి పైగా వాటా క్రెటాదే కావడం విశేషం. మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో క్రెటాకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి.

దూసుకుపోతున్న న్యూ వెన్యూ.. ఆకట్టుకుంటున్న ఎక్స్‌టర్
హ్యుందాయ్ జాబితాలో రెండో స్థానంలో వెన్యూ నిలిచింది. మార్చి 2026లో వెన్యూ 11,147 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. గతేడాది ఇదే నెలలో జరిగిన 10,441 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే ఇది 7 శాతం వార్షిక వృద్ధిని సాధించింది. ఇక మైక్రో ఎస్‌యూవీ విభాగంలో టాటా పంచ్‌కు గట్టి పోటీ ఇస్తున్న ఎక్స్‌టర్ కూడా మెరుగైన ప్రదర్శన కనబరిచింది. మార్చి నెలలో 6,478 యూనిట్లు అమ్ముడై, గతేడాది కంటే 10 శాతం వృద్ధిని నమోదు చేసింది. ముఖ్యంగా ఫిబ్రవరి నెలతో పోలిస్తే ఎక్స్‌టర్ అమ్మకాలు ఏకంగా 54 శాతం పెరగడం గమనార్హం.
సెడాన్ విభాగంలో ఆరా, వెర్నా హవా
కాంపాక్ట్ సెడాన్ విభాగంలో హ్యుందాయ్ ఆరా అనూహ్యమైన వృద్ధిని కనబరిచింది. గత నెలలో 6,663 యూనిట్ల అమ్మకాలతో 31 శాతం వార్షిక వృద్ధిని తన ఖాతాలో వేసుకుంది. ఇక ప్రీమియం సెడాన్ విభాగంలో వెర్నా తన ఉనికిని చాటుకుంది. మార్చి 2026లో 1,399 యూనిట్ల వెర్నా కార్లు అమ్ముడయ్యాయి. గతేడాది అమ్మకాలతో పోలిస్తే ఇది కేవలం 3 శాతం వృద్ధి అయినప్పటికీ, నెలవారీ ప్రాతిపదికన వెర్నా ఏకంగా 102 శాతం అద్భుతమైన వృద్ధిని కనబరిచింది. దీనివల్ల సెడాన్ లవర్స్ ఆదరణ వెర్నాపై మళ్ళీ పెరుగుతోందని తెలుస్తోంది.

వెనుకబడిన i10 నియోస్, i20 హ్యాచ్‌బ్యాక్‌లు
ఒకప్పుడు హ్యుందాయ్ బ్రాండ్‌కు వెన్నెముకగా నిలిచిన గ్రాండ్ i10 నియోస్, i20 మోడల్స్ ఇప్పుడు ఎస్‌యూవీల ధాటికి వెనుకబడ్డాయి. మార్చి నెలలో i20 అమ్మకాలు 5,614 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇది గతేడాది కంటే 26 శాతం వృద్ధిని సూచిస్తున్నప్పటికీ, క్రెటా, వెన్యూ అమ్మకాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఇక గ్రాండ్ i10 నియోస్ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. కేవలం 5,032 యూనిట్ల అమ్మకాలతో ఇది ఒక శాతం స్వల్ప వృద్ధిని మాత్రమే సాధించింది. కస్టమర్లు హ్యాచ్‌బ్యాక్‌ల కంటే ఎస్‌యూవీలు లేదా సెడాన్‌ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు ఈ ట్రెండ్ స్పష్టం చేస్తోంది.

గణనీయంగా తగ్గిన అల్కజార్ విక్రయాలు
హ్యుందాయ్ 7 సీటర్ ఎస్‌యూవీ అల్కజార్ విక్రయాల్లో భారీ పతనం కనిపించింది. మార్చి 2025లో 1,431 యూనిట్లు అమ్ముడవగా, ఈ ఏడాది మార్చిలో కేవలం 893 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే దాదాపు 38 శాతం వార్షిక క్షీణత నమోదైంది. మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో హ్యుందాయ్ అయోనిక్ 5, టక్సన్ వంటి మోడల్స్ గత నెలలో సున్నా విక్రయాలను నమోదు చేయడం గమనార్హం. ఇవి ప్రీమియం విభాగం కావడంతో కస్టమర్లు కొత్త వేరియంట్ల కోసం వేచి చూస్తున్నారా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద హ్యుందాయ్ తన క్రెటా, వెన్యూ మోడల్స్ ద్వారా మార్కెట్ షేర్‌ను బలంగా నిలబెట్టుకుంటోంది.


Click it and Unblock the Notifications








