షోరూమ్ లో ఈ కార్లను చూస్తే భయపడిపోతున్న జనం.. అమ్మకాల్లో దారుణమైన రికార్డు!
భారతదేశ ఆటోమొబైల్ రంగం 2025లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. టాప్-10 కార్ల అమ్మకాలు సగటున 1.9 లక్షల యూనిట్లకు పైగా నమోదయ్యాయి. అయితే నాణేనికి మరో వైపు ఉన్నట్లుగా.. కొన్ని కార్లు కస్టమర్లను ఆకట్టుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాయి. కొన్ని మోడళ్లను కొనడానికి జనం ఎంతగా వెనుకాడుతున్నారంటే, ఏడాది మొత్తం మీద వాటి అమ్మకాలు రెండంకెల సంఖ్యను కూడా దాటలేదు. ముఖ్యంగా ఒక కారునైతే దేశం మొత్తం మీద కేవలం ఐదుగురు మాత్రమే కొనుగోలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 2025 సేల్స్ చార్ట్‌లో అత్యంత దిగువన నిలిచిన ఆ మూడు కార్ల కథాకమీమామిషు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
1. సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్
ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం సిట్రోయెన్ భారత్‌లో అడుగుపెట్టినప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి. కంపెనీ తన తొలి మోడల్‌గా C5 ఎయిర్‌క్రాస్‌ను లాంచ్ చేసింది. అయితే 2025 ఏడాదికి సంబంధించి ఈ కారు అమ్మకాల గణాంకాలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. గడిచిన ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా ఈ కారును కేవలం ఐదుగురు మాత్రమే కొన్నారు. దీని ప్రారంభ ధర సుమారు రూ.37.32 లక్షలుగా ఉంది.

ఈ కారు ఫ్లాప్ అవ్వడానికి ప్రధాన కారణం దాని ధర. సుమారు 40 లక్షల బడ్జెట్ పెట్టినప్పుడు కస్టమర్లు తమ కారులో వెంటిలేటెడ్ సీట్స్, 360-డిగ్రీ కెమెరా వంటి మోడ్రన్ ఫీచర్లను ఆశిస్తారు. కానీ C5 ఎయిర్‌క్రాస్‌లో ఇవి లేవు. పైగా ఇదే ధరలో లేదా అంతకంటే తక్కువ ధరలో జీప్ కంపాస్, హ్యుందాయ్ టూసాన్ వంటి బలమైన పోటీదారులు మార్కెట్లో ఉన్నారు. సిట్రోయెన్ బ్రాండ్ ఇమేజ్ భారత్‌లో ఇంకా పుంజుకోకపోవడం, సర్వీస్ సెంటర్ల కొరత కూడా ఈ కారును పాతాళానికి తొక్కేశాయి.
2. కియా EV9
దక్షిణ కొరియా కంపెనీ కియాకు భారత్‌లో మంచి క్రేజ్ ఉంది. కానీ వారి ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కియా EV9 విషయంలో మాత్రం ఫలితం రివర్స్ అయింది. 2025లో ఈ కారు కేవలం 20 యూనిట్లు మాత్రమే అమ్ముడైంది. దీని ధర సుమారు రూ.1.3 కోట్లు. ఇది పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుని (CBU) ఇక్కడ విక్రయించడమే ఈ భారీ ధరకు కారణం.

కోటి రూపాయలకు పైగా ఖర్చు పెట్టే కస్టమర్ సహజంగానే లగ్జరీ బ్రాండ్ వైపు మొగ్గు చూపుతాడు. ఇదే బడ్జెట్‌లో మెర్సిడెస్ బెంజ్ EQS SUV లేదా బీఎమ్‌డబ్ల్యూ వంటి దిగ్గజ బ్రాండ్ల కార్లు అందుబాటులో ఉండటంతో కియా EV9 వైపు ఎవరూ చూడటం లేదు. డిజైన్ పరంగా ఇది చాలా ఫ్యూచరిస్టిక్‌గా ఉన్నా, కియా అనే బ్రాండ్ మీద కోటిన్నర పెట్టడానికి భారతీయ ధనవంతులు సిద్ధంగా లేరని ఈ గణాంకాలు చెబుతున్నాయి. హై-టెక్ ఫీచర్లు ఉన్నప్పటికీ, ప్రైసింగ్ స్ట్రాటజీ ఈ కారు కొంపముంచింది.
3. జీప్ గ్రాండ్ చెరోకీ
ఆఫ్-రోడింగ్ రాజుగా పేరుగాంచిన జీప్ (Jeep) బ్రాండ్ నుంచి వచ్చిన ప్రీమియం ఎస్‌యూవీ గ్రాండ్ చెరోకీ పరిస్థితి కూడా దారుణంగా ఉంది. 2025లో ఈ కారు కేవలం 92 యూనిట్లు మాత్రమే అమ్ముడైంది. అంటే కనీసం వంద మార్కును కూడా ఇది దాటలేకపోయింది. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.63 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

భారతీయ మార్కెట్ లో ఎస్‌యూవీ అంటే ఇప్పటికీ చాలామంది డీజిల్ ఇంజిన్ కావాలని కోరుకుంటారు. కానీ గ్రాండ్ చెరోకీ కేవలం పెట్రోల్ వేరియంట్ లోనే లభిస్తోంది. అలాగే ఇది కేవలం 5-సీటర్ ఆప్షన్ తో రావడం మరో పెద్ద మైనస్. అదే బడ్జెట్ లో టయోటా ఫార్చ్యూనర్ వంటి 7-సీటర్ కార్లు ఉండటం వల్ల జనం అటువైపు వెళ్తున్నారు. సర్వీస్ నెట్‌వర్క్ తక్కువగా ఉండటం, విడిభాగాలు దొరకడం కష్టమనే అపవాదు జీప్ అమ్మకాలను దెబ్బతీసింది. రోడ్డుపై దీని రాజసం అద్భుతంగా ఉన్నా, ప్రాక్టికాలిటీ దగ్గరకు వచ్చేసరికి కస్టమర్లు పెదవి విరుస్తున్నారు.


Click it and Unblock the Notifications








