చైనాలో ప్రజలకు ఇష్టమైన కారు ఇండియాలోకి.. ముహూర్తం ఫిక్స్.. తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUV రాక!
భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలపై పెరుగుతున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ (Jsw Mg Motor India) ఇండియా మరో కీలక అడుగు వేయడానికి సిద్ధమవుతోంది. దేశంలో తన తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ (PHEV)ను విడుదల చేసే దిశగా కంపెనీ సన్నాహాలు ప్రారంభించింది. తన తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUVను జూలై 16న అధికారికంగా ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. ఈ మోడల్‌పై ఇప్పటికే మార్కెట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గత కొన్ని నెలలుగా ఈ SUVను భారతీయ రహదారులపై విస్తృతంగా పరీక్షిస్తున్న ఎంజీ, ఇప్పుడు దానిని మార్కెట్లోకి తీసుకురావడానికి తుది ఏర్పాట్లు చేస్తోంది. ఈ కొత్త SUVలో అత్యంత ఆకర్షణీయమైన అంశం మూడు వరుసల సీట్ల లేఅవుట్.
దీంతో పెద్ద కుటుంబాలకు అనువైన ప్రీమియం SUVగా ఇది నిలిచే అవకాశం ఉంది. విశాలమైన క్యాబిన్, ఆధునిక టెక్నాలజీ, హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ కలయికతో ఈ మోడల్‌ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రీమియం SUVలను ఇష్టపడే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఎంజీ ఈ వాహనాన్ని తీసుకువస్తుండటంతో, భారతీయ మార్కెట్లో ఇది ప్రత్యేక గుర్తింపు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంజీ కొత్త హైబ్రిడ్ SUVపై ఆటోమొబైల్ రంగంలో ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది.

ఈ కొత్త మోడల్ మిడ్-సైజ్ SUV విభాగంలోకి రానుండగా, అంతర్జాతీయ మార్కెట్లో మంచి ఆదరణ పొందిన వులింగ్ స్టార్‌లైట్ ఎస్ (Wuling Starlight S) ఆధారంగా అభివృద్ధి చేయబడుతుందని సమాచారం. ఇప్పటికే వులింగ్‌కు చెందిన మైక్రో ఎలక్ట్రిక్ కారును 'ఎంజీ కామెట్ EV' పేరుతో భారతదేశంలో విజయవంతంగా విక్రయిస్తున్న ఎంజీ, ఇప్పుడు అదే వ్యూహాన్ని అనుసరిస్తూ మరింత పెద్ద, ప్రీమియం SUVను భారతీయ వినియోగదారులకు పరిచయం చేయాలని భావిస్తోంది.
ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల ప్రయోజనాలతో పాటు, పెట్రోల్ ఇంజిన్ సౌలభ్యాన్ని కూడా అందించే ప్లగ్-ఇన్ హైబ్రిడ్ టెక్నాలజీ ఈ SUVకు ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా విడుదల చేసిన కొత్త టీజర్ ఆటోమొబైల్ రంగంలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. టీజర్‌లో వాహనం పూర్తి వివరాలను వెల్లడించకపోయినా, ఇది కంపెనీ నుంచి రానున్న కొత్త తరం SUVకు సంబంధించినదేనని స్పష్టమవుతోంది.

అంతర్జాతీయ మార్కెట్లో వులింగ్ స్టార్‌లైట్ S రెండు పవర్‌ట్రెయిన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. ఇందులో పూర్తిగా ఎలక్ట్రిక్ వెర్షన్‌తో పాటు ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) వేరియంట్ కూడా ఉంది. PHEV మోడల్‌లో 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను ఎలక్ట్రిక్ మోటార్‌తో జత చేశారు. ఈ హైబ్రిడ్ వ్యవస్థ కలిపి 197 హెచ్‌పీ శక్తిని, 230 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ మంచి పనితీరు, ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది.
ఈ SUVలోని మరో ప్రధాన ఆకర్షణ దాని ఎలక్ట్రిక్ డ్రైవింగ్ సామర్థ్యం. కేవలం బ్యాటరీ పవర్‌తోనే సుమారు 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలగడం వల్ల నగరాల్లో రోజువారీ ప్రయాణాలను పెట్రోల్ వినియోగం లేకుండానే పూర్తి చేసే అవకాశం ఉంటుంది. దీంతో ఇంధన ఖర్చులు తగ్గడంతో పాటు పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. క్యాబిన్ విషయానికి వస్తే, స్టార్‌లైట్ S ఆధునిక సాంకేతికతతో కూడిన ప్రీమియం ఇంటీరియర్‌ను అందిస్తుంది.
ఇందులో 12.8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 8.8 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆకర్షణీయమైన 2-స్పోక్ స్టీరింగ్ వీల్‌ను అందించారు. ప్రయాణికుల సౌకర్యాన్ని మరింత పెంచేందుకు పనోరమిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటి ప్రీమియం ఫీచర్లు కూడా ఉన్నాయి. భద్రత పరంగా ADAS వంటి స్మార్ట్ సేఫ్టీ ఫీచర్లతో ఇది మరింత సురక్షితమైన డ్రైవింగ్ అనుభూతిని అందించేలా రూపొందించబడింది.


Click it and Unblock the Notifications