మధ్యతరగతికి గుడ్‌న్యూస్.. తక్కువ ధరలో రెండు ఆటోమేటిక్ ఆప్షన్లు.. డ్రైవింగ్ ఇక ఈజీ
ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా (Kia India) భారత మార్కెట్లో తన ప్రాచుర్యం పొందిన కాంపాక్ట్ SUV అయిన కియా సోనెట్ (Kia Sonet)ను మోడల్ ఇయర్ 2026 (MY26) కోసం కొత్తగా ప్రవేశపెట్టింది. కస్టమర్లకు మరింత ఎంపికలు, మెరుగైన విలువ అందించాలనే లక్ష్యంతో ఈ అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న సోనెట్‌కు ఇప్పుడు మరిన్ని వేరియంట్ ఎంపికలను జోడించడం ద్వారా కంపెనీ వినియోగదారులను మరింత ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. కొత్త MY26 సోనెట్‌లో ప్రధానంగా ఇంజిన్,ట్రాన్స్‌మిషన్ ఎంపికలలో మార్పులు చేశారు. ముఖ్యంగా డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్‌ను మరింత అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఇప్పటి వరకు చాలా మంది కస్టమర్లు డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్ కోసం ఎక్కువ ధర చెల్లించాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు కంపెనీ దీన్ని రూ. 9.77 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని వల్ల డీజిల్ ఇంజిన్‌తో ఆటోమేటిక్ డ్రైవింగ్ అనుభవాన్ని కోరుకునే వినియోగదారులకు ఇది మరింత ఆకర్షణీయమైన ఆప్షన్‌గా మారింది. ఇదే సమయంలో టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను ఇష్టపడే కస్టమర్ల కోసం కొత్త ఎంపికను తీసుకొచ్చింది.

టర్బో పెట్రోల్ ఇంజిన్‌కు 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ (7DCT) ఎంపికను ఇప్పుడు రూ. 9.89 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందిస్తున్నారు. ఈ వేరియంట్ డ్రైవింగ్‌లో మరింత స్పోర్టీ అనుభవాన్ని అందించడమే కాకుండా, నగర ట్రాఫిక్‌లో స్మూత్ డ్రైవ్‌ను కూడా అందిస్తుంది. మొత్తం మీద చూస్తే, తక్కువ ధరలో ఆటోమేటిక్ వేరియంట్ అందించడం ద్వారా మధ్యతరగతి కస్టమర్లను ఆకర్షించే అవకాశం కూడా పెరిగింది.
కొత్త మోడల్ అప్‌డేట్‌లో భాగంగా, సోనెట్ 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌కు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికను ఇప్పుడు మరిన్ని వేరియంట్లలో అందిస్తున్నారు. ఈ డీజిల్ ఆటోమేటిక్ సెటప్ ఇప్పుడు HTE(O), HTK(O), HTK+, HTK+(O) వేరియంట్లలో కూడా లభిస్తోంది. ఇదే సమయంలో, కంపెనీ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను కోరుకునే కస్టమర్ల కోసం కూడా మరో ముఖ్యమైన అడుగు వేసింది.

1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌కు 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ (7DCT) గేర్‌బాక్స్ ఎంపికను HTK(O), HTK+(O) వేరియంట్లలో కూడా ప్రవేశపెట్టింది. ఈ మార్పులతో Kia Sonet భారత మార్కెట్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించింది. ఎందుకంటే రూ.10 లక్షల లోపే 6-స్పీడ్ ఆటోమేటిక్ (6AT), 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ (7DCT) వంటి రెండు ఆధునిక ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలను అందిస్తున్న తొలి SUVగా ఇది నిలిచింది.
ఇంజిన్ ఎంపికల విషయానికి వస్తే, సోనెట్ SUV విభిన్న అవసరాలున్న వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని మూడు రకాల ఇంజిన్‌లతో అందుబాటులో ఉంది. ఇందులో 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ (NA) పెట్రోల్ ఇంజిన్, 1.0-లీటర్ మూడు సిలిండర్ల టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్, అలాగే 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఉన్నాయి. ముఖ్యంగా డీజిల్ SUV కోసం చూస్తున్న చాలా మంది కొనుగోలుదారులకు సోనెట్ మొదటి ఎంపికగా మారింది.
అంతేకాకుండా, ట్రాన్స్‌మిషన్ ఎంపికల పరంగా కూడా సోనెట్ విస్తృతమైన ఆప్షన్లను అందిస్తుంది. ఇందులో 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ IMT, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్, 6-స్పీడ్ ఆటోమేటిక్, 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లు ఉన్నాయి. ఈ విభిన్న ఎంపికల వల్ల వినియోగదారులు తమ డ్రైవింగ్ శైలి, బడ్జెట్, అవసరాలకు అనుగుణంగా సరైన వేరియంట్‌ను ఎంచుకునే అవకాశం పొందుతున్నారు.
కియా సోనెట్‌లో 6 ఎయిర్‌బ్యాగులు, 360 డిగ్రీల కెమెరా, ముందు-వెనుక పార్కింగ్ సెన్సార్లు, ESC, TPMS, ISOFIX వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. టాప్ వేరియంట్లలో ADAS కూడా అందుతుంది. అలాగే 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, వైర్‌లెస్ ఛార్జర్, సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








