ఇది అరాచకం భయ్యా..నెలకు 50 వేల కార్లా ? రికార్డులు బద్దలు కొట్టిన ఆనంద్ మహీంద్రా టీమ్
భారతదేశపు స్వదేశీ ఎస్‌యూవీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra) 2025 ఏడాదిని ఘనమైన విజయంతో ముగించింది. ఒకప్పుడు నెలకు పది, ఇరవై వేల కార్లు అమ్మడమే గగనంగా ఉండే రోజులు పోయి, ఇప్పుడు ఏకంగా నెలకు 50 వేలకు పైగా కార్లను విక్రయిస్తూ మహీంద్రా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.
ముఖ్యంగా డిసెంబర్ 2025లో ఈ కంపెనీ సాధించిన వృద్ధి చూస్తుంటే, భారత ఆటోమొబైల్ మార్కెట్లో మహీంద్రా హవా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. స్కోర్పియో, థార్ వంటి మోడళ్లకు జనం బ్రహ్మరథం పడుతుండటంతో కంపెనీ అమ్మకాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

డిసెంబర్‌లో అదిరిపోయే పెర్ఫార్మెన్స్
మహీంద్రా సంస్థ 2025 డిసెంబర్ నెలలో ప్యాసింజర్ వాహనాల విభాగంలో 50,946 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. 2024 డిసెంబర్‌లో అమ్ముడైన 41,424 కార్లతో పోలిస్తే ఇది ఏకంగా 23 శాతం వృద్ధి.
కేవలం ఒకే ఒక నెలలో 50 వేల మైలురాయిని దాటడం మహీంద్రా చరిత్రలో ఒక కీలక ఘట్టం. ముఖ్యంగా ప్రభుత్వం సెప్టెంబర్ నెలలో 1500సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న ఎస్‌యూవీలపై పన్నును 50% నుంచి 40%కి తగ్గించడం మహీంద్రాకు కలిసి వచ్చింది. ధరలు తగ్గడంతో కస్టమర్లు ఎగబడి మహీంద్రా కార్లను కొనుగోలు చేశారు.

రికార్డులు తిరగరాస్తున్న మోడళ్లు
మహీంద్రా బ్రాండ్‌కు వెన్నెముకగా నిలిచే స్కోర్పియో-ఎన్ (Scorpio-N), థార్ (Thar), ఎక్స్‌యూవీ 700 (XUV700), బొలెరో (Bolero) కార్లకు మార్కెట్లో తిరుగులేని డిమాండ్ ఉంది. 2025 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు (తొమ్మిది నెలల కాలంలో) మహీంద్రా మొత్తం 4,76,476 కార్లను విక్రయించి, గత ఏడాది కంటే 18% వృద్ధిని సాధించింది.
త్వరలో లాంచ్ కాబోతున్న సరికొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ 7XO (XUV7XO) కోసం కూడా కస్టమర్లు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇది మార్కెట్లోకి వస్తే అమ్మకాలు మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయం.

కమర్షియల్, త్రీ-వీలర్ విభాగంలోనూ జోరు
కేవలం ప్యాసింజర్ కార్లే కాకుండా, కమర్షియల్ వాహనాల విభాగంలో కూడా మహీంద్రా తన పట్టును నిరూపించుకుంది. 2 నుంచి 3.5 టన్నుల బరువు మోసే లైట్ కమర్షియల్ వెహికల్స్ (LCV) డిసెంబర్‌లో 37% వృద్ధిని నమోదు చేశాయి.
అలాగే ఎలక్ట్రిక్ వాహనాలతో కూడిన త్రీ-వీలర్ సెగ్మెంట్‌లో మహీంద్రా 31% వృద్ధితో 7,538 యూనిట్లను విక్రయించింది. ఈ కామర్స్, లాస్ట్-మైల్ డెలివరీ అవసరాలు పెరగడం వల్ల మహీంద్రా ఆటోలకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆదరణ పెరిగింది.
ఎగుమతుల విభాగం, భవిష్యత్తు ప్రణాళికలు
మహీంద్రా ఎగుమతులు డిసెంబర్‌లో స్వల్పంగా (9%) తగ్గినప్పటికీ, ఏడాది మొత్తం మీద (ఏప్రిల్-డిసెంబర్) 25% వృద్ధితో 30,061 యూనిట్లను అంతర్జాతీయ మార్కెట్లకు పంపింది. 2026 సంవత్సరంలో మహీంద్రా మూడు సరికొత్త మోడళ్లను రంగంలోకి దించేందుకు సిద్ధమవుతోంది.
ఇందులో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు కూడా ఉన్నాయి. సేఫ్టీ విషయంలో 5-స్టార్ రేటింగ్స్ ఉండటం, పవర్ఫుల్ ఇంజిన్ సామర్థ్యం మహీంద్రాను ఇతర కంపెనీల కంటే ముందు వరుసలో ఉంచుతున్నాయి. మారుతి సుజుకి, హ్యుందాయ్ వంటి దిగ్గజాలకు మహీంద్రా ఇప్పుడు గట్టి పోటీనిస్తోంది.


Click it and Unblock the Notifications








