పెట్రోల్ అవసరం లేదు, సౌండ్ అసలే రాదు.. పెళ్లి కూతురిలా ముస్తాబై రాబోతున్న థార్ ఎలక్ట్రిక్
ఇప్పుడు భారతీయ ఆటోమొబైల్ రంగంలో ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ వాహనాల(EV) హవానే కొనసాగుతోంది. ఈ రేసులో దేశీయ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఆఫ్‌రోడ్ లవర్స్ కలల కారుగా పేరుగాంచిన మహీంద్రా థార్ ఇప్పుడు సరికొత్త ఎలక్ట్రిక్ అవతారంలో అలరించడానికి సిద్ధం అవుతుంది. Thar.e పేరుతో రానున్న ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి సంబంధించిన ఆసక్తికర విషయాలు ప్రస్తుం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
మహీంద్రా థార్ అంటేనే కార్ ప్రేమికులకు ఒక ఎమోషన్. ఈ మోడల్‌కు ఉన్నటువంటి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీనిని ఎలక్ట్రిక్ వెర్షన్‌లో తీసుకురావడం ద్వారా మహీంద్రా ఒక పెద్ద సాహసమే చేస్తోంది. 2023లో సౌతాఫ్రికాలో జరిగిన ఒక ఈవెంట్‌లో ఈ కారు కాన్సెప్ట్‌ను మహీంద్రా తొలిసారిగా ప్రపంచానికి పరిచయం చేసింది. అప్పట్లో దీనిని చూసిన వారంతా దీని డిజైన్ చూసి ఫిదా అయిపోయారు. సాంప్రదాయ థార్ కంటే ఇది చాలా భిన్నంగా, చాలా ఫ్యూచరిస్టిక్‌గా ఉండబోతోంది.

థార్ ఎలక్ట్రిక్ (Thar.e) ప్రస్తుత మోడల్ లాగా కేవలం లాడర్ ఫ్రేమ్ ఛాసిస్‌పై ఆధారపడి ఉండదు. ఇది మహీంద్రా మోడ్రన్ INGLO-P1 స్కేట్‌బోర్డ్ ఈవీ ప్లాట్‌ఫారం పై రూపొందుతోంది. దీనివల్ల కారు లోపల క్యాబిన్ స్పేస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కారు ముందు భాగంలో స్క్వేర్ షేప్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, సిగ్నేచర్ ఈవీ గ్రిల్ ఆకట్టుకుంటాయి. వెనుక వైపు వర్టికల్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్, స్ట్రాంగ్ స్కిడ్ ప్లేట్లు దీనికి ఒక రగ్గడ్ లుక్ ఇస్తాయి. ముఖ్యంగా ఇది ఐదు డోర్ల లేఅవుట్‌తో రాబోతోంది. అంటే ఫ్యామిలీతో కలిసి ప్రయాణించడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
మహీంద్రా థార్ ఎలక్ట్రిక్ పవర్ విషయంలో ఎక్కడా రాజీ పడడం లేదు. నివేదికల ప్రకారం.. ఇందులో ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సదుపాయం ఉంటుంది. అంటే బురదలో, కొండల్లో ఎక్కడైనా ఇది ఈజీగా దూసుకెళ్లిపోతుంది. ఇందులో డ్యూయల్ మోటార్ సెటప్‌ను ఉపయోగించనున్నారు.

బ్యాటరీ విషయానికి వస్తే.. 59kWh, 70kWh లేదా 79kWh ఆప్షన్లలో లభించవచ్చు. ఇది గరిష్టంగా 250 bhp పవర్ ఉత్పత్తి చేయగలదు. అలాగే ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఈ థార్ దాదాపు 400 నుంచి 500 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని అంచనా.
థార్ అంటేనే ఆఫ్‌రోడింగ్. ఎలక్ట్రిక్ వెర్షన్‌లో కూడా మహీంద్రా దీనిని కొనసాగించనుంది. ఈ కారుకు దాదాపు 300 మిమీ గ్రౌండ్ క్లీయరెన్స్ ఉంటుంది. దీనివల్ల లోతైన గుంటలు లేదా నీటి ప్రవాహాలను ఇది సులభంగా దాటగలదు. దీని అప్రోచ్ మరియు డిపార్చర్ యాంగిల్స్ ప్రస్తుత థార్ కంటే మెరుగ్గా ఉంటాయని సమాచారం. కారు లోపల ప్రీమియం ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) వంటి ఫీచర్లు ఉండబోతున్నాయి.

థార్ ఎలక్ట్రిక్ ధర సాధారణ పెట్రోల్/డీజిల్ వేరియంట్ కంటే ఎక్కువగా ఉంటుంది. ముంబై లాంటి నగరాల్లో దీని ఆన్ రోడ్ ధర దాదాపు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉంటుందని అంచనా. మార్కెట్లో దీనికి ప్రధానంగా టాటా హారియర్ ఈవీ, టాటా కర్వ్ ఈవీ, త్వరలో రానున్న హ్యుందాయ్ క్రెటా ఈవీల నుంచి గట్టి పోటీ ఎదురు కాబోతుంది. అయినప్పటికీ థార్‌కున్న బ్రాండ్ ఇమేజ్ ఈ కారును సేల్స్‌లో టాప్‌లో ఉంచుతుందని కంపెనీ ఆశాభావంతో ఉంది.
కేవలం థార్ మాత్రమే కాదు, మహీంద్రా తన ఎలక్ట్రిక్ పోర్ట్‌ఫోలియోను మరింతగా విస్తరిస్తోంది. త్వరలోనే BE 07 అనే మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కూడా లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇది హ్యుందాయ్ క్రెటా ఈవీకి గట్టి పోటీ ఇవ్వనుంది. దీని టెస్టింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. రాబోయే ఐదేళ్లలో మహీంద్రా నుంచి మరిన్ని సరికొత్త ఎలక్ట్రిక్ మోడల్స్‌ను మనం రోడ్ల పై చూడబోతున్నాం.
మహీంద్రా తన థార్ ఎలక్ట్రిక్‌ను 2029 నాటికి మార్కెట్లోకి తీసుకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం దీని డిజైన్, ఇంజనీరింగ్ పనులు చాలా స్పీడుగా జరుగుతున్నాయి. లాంచ్ నాటికి మరిన్ని అప్‌డేటెడ్ ఫీచర్లతో దీనిని తీసుకువచ్చేలా మహీంద్రా ప్లాన్ చేస్తోంది. ఆఫ్‌రోడ్ ప్రియులకు, ఎన్విరాన్‌మెంట్ ఫ్రెండ్లీ వాహనాలను ఇష్టపడే వారికి ఇది ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ కానుంది.


Click it and Unblock the Notifications