గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కిన కారు.. ఒక్క దెబ్బకు రైలునే లాగేసింది.. ఇదిగో వీడియో
జెస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా (JSW MG Motor India)కు చెందిన ఒక SUV ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సాధారణంగా కార్ల గురించి మాట్లాడేటప్పుడు మైలేజ్, ఫీచర్లు లేదా ధరల గురించి చర్చ జరుగుతుంది. కానీ ఈసారి మాత్రం పూర్తిగా భిన్నమైన కారణంతో ఈ బ్రాండ్ వార్తల్లో నిలిచింది. అదే, తన బలాన్ని ప్రపంచానికి నిరూపించిన ఓ అసాధారణ ఘనత. ఎంజీ మెజెస్టర్ (MG Majestor) పేరుతో వచ్చిన ఈ SUV తాజాగా ఒక అద్భుతమైన సాహసం చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. రైల్వే పట్టాలపై నిలిచి ఉన్న భారీ రైలును లాగడం జరిగింది. ఇది సాధారణ విషయం కాదు. ఇలాంటి ప్రయత్నాలు సాధారణంగా ప్రత్యేక యంత్రాలతోనే సాధ్యమవుతాయి. కానీ ఈసారి ఒక SUV ఈ సవాల్‌ను స్వీకరించి, విజయవంతంగా పూర్తి చేయడం నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఈ ప్రయోగంలో ఎంజీ మెజెస్టర్ తన అసలు సామర్థ్యాన్ని చూపించింది. భారీ బరువును లాగగలిగే ఇంజిన్ శక్తి, మెకానికల్ బలం, అలాగే డ్రైవ్‌ట్రైన్ సామర్థ్యం కలిసి ఈ ఘనత సాధించడానికి కీలక పాత్ర పోషించాయి. రైలును కదిలించడం మాత్రమే కాదు, దాన్ని నియంత్రణలో ఉంచుతూ ముందుకు తీసుకెళ్లడం కూడా ఈ SUV పనితీరును స్పష్టంగా తెలియజేసింది. దీంతో అందరూ ప్రస్తుతం ఈ కారు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు.

ఈ అరుదైన ఘనతతో, ఒక SUV ద్వారా రైలును లాగిన అత్యంత భారీ బరువు అనే రికార్డును నెలకొల్పుతూ, మెజెస్టర్ పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (Guinness World Records) పుస్తకాల్లోకి చేరింది. ఈ విషయాన్ని ఎంజీ మోటార్ అధికారికంగా ప్రకటించడం మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గత నెల చివరిలో జమ్మూ & కాశ్మీర్‌లోని లోని కాకాపోరా-అవంతిపోరా మధ్య ఉన్న సురక్షిత రైల్వే ట్రాక్‌పై ఈ అరుదైన ఘనత సాకారమైంది.
సాధారణంగా రైల్వే మార్గాల్లో ఇలాంటి ప్రయోగాలు అత్యంత జాగ్రత్తల మధ్య మాత్రమే నిర్వహిస్తారు. అదే విధంగా అన్ని భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ఈ రికార్డు ప్రయత్నాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సాహసంలో MG Majestor తన అసాధారణ శక్తిని ప్రపంచానికి చూపించింది. మొత్తం 406.4 టన్నుల బరువున్న భారీ రైలును సుమారు 300 అడుగుల దూరం వరకు లాగడం ద్వారా ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది.

గమనించాల్సిన విషయం ఏమిటంటే, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నిర్దేశించిన కనీస ప్రమాణం 400 టన్నులు, 100 అడుగులు మాత్రమే. కానీ ఈ SUV ఆ ప్రమాణాన్ని గణనీయంగా అధిగమించి కొత్త ప్రపంచ రికార్డును సృష్టించడం మరింత విశేషం. ఈ భారీ రైలులో WAG-9HC locomotiveతో పాటు ప్యాసింజర్ కోచ్‌లు, గార్డ్ కోచ్‌లు కూడా జతచేయబడ్డాయి. అంటే ఇది కేవలం ఒక ఖాళీ బోగీ కాదు, పూర్తి స్థాయి రైలును లాగినట్లే.
ఈ మొత్తం బరువును కదిలించడం మాత్రమే కాకుండా, స్థిరంగా నియంత్రణలో ఉంచుతూ ముందుకు తీసుకెళ్లడం కూడా MG Majestor సామర్థ్యాన్ని స్పష్టంగా చూపించింది. ఈ రికార్డు కోసం ఉపయోగించిన MG Majestor పూర్తిగా సాధారణ ఉత్పత్తి మోడల్‌నే కావడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇందులో ఇంజిన్, డ్రైవ్‌ట్రెయిన్ లేదా ట్రాక్షన్ సిస్టమ్‌లలో ఎలాంటి మార్పులు చేయలేదు. అంతేకాదు, ఈ భారీ రైలును లాగడానికి ఎలాంటి బాహ్య సహాయం కూడా ఉపయోగించలేదు.

గత సంవత్సరం Bharat Mobility Global Expo 2025లో తొలిసారి వచ్చిన తర్వాత, కంపెనీ ఇటీవలే దీన్ని పరిచయం చేసింది. ఇందులో 2.0-లీటర్ ట్విన్ టర్బో డీజిల్ ఇంజిన్ ఉండి, 215.5 PS పవర్, 478.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జత చేయబడింది. ధరలను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ప్రీ-రిజర్వేషన్లు మాత్రం ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రూ. 41,000తో బుకింగ్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








