నెక్సాన్ పని ఖల్లాస్.. 35 కిమీ మైలేజీతో మారుతి హైబ్రిడ్ సునామీ.. స్కోడా స్పోర్ట్స్ ఎడిషన్ కూడా రెడీ
మీరు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ముఖ్యంగా టాటా నెక్సాన్ మీ ఫేవరెట్ లిస్ట్‌లో ఉందా? అయితే ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మార్కెట్లోకి నెక్సాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించే అదిరిపోయే కాంపాక్ట్ ఎస్‌యూవీలు (SUVs) వరుసగా అడుగుపెట్టబోతున్నాయి. స్కోడా నుంచి స్టైలిష్ కారు, మారుతి నుంచి అదిరిపోయే మైలేజీ ఇచ్చే హైబ్రిడ్ మోడళ్లు ఇలా ఒక్కటేమిటి.. రాబోయే రోజుల్లో ఆప్షన్లు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఆ వివరాలేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
స్కోడా కైలాక్ స్పోర్ట్స్ లైన్:
స్కోడా తన పాపులర్ మోడల్ కైలాక్‌లో సరికొత్త స్పోర్ట్స్ లైన్ వెర్షన్‌ను ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేయబోతోంది. ఇది చూడటానికి చాలా అగ్రెసివ్‌గా ఉండబోతోంది. గ్లాస్ బ్లాక్ గ్రిల్, బ్లాక్ రూఫ్ రైల్స్, సరికొత్త 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఈ కారుకు ప్రీమియం లుక్ ఇస్తాయి. ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంటుంది, ఇది 115 PS పవర్, 178 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మాన్యువల్ వేరియంట్ ధర సుమారు రూ.12.75 లక్షలు, ఆటోమేటిక్ ధర రూ.13.65 లక్షల వరకు ఉండవచ్చు.

కైలాక్ సిఎన్‌జీ:
స్కోడా కేవలం స్పోర్టీ లుక్ మీదనే కాదు, సామాన్యుడి జేబు మీద కూడా దృష్టి పెట్టింది. కైలాక్ సిఎన్‌జీ వెర్షన్‌ను కూడా కంపెనీ లాంచ్ చేయనుంది. ఇది దాదాపు 23 నుండి 25 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని అంచనా. పెట్రోల్ మోడల్ కంటే ఇది ఒక లక్ష రూపాయలు అదనంగా ఉండే అవకాశం ఉంది. తక్కువ ఖర్చుతో సేఫ్టీ కార్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
మారుతి ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్:
మారుతి సుజుకి నుంచి రాబోతున్న ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ కారులో తీసుకురాబోతున్న సిరీస్ హైబ్రిడ్ టెక్నాలజీ వల్ల ఇది ఏకంగా లీటరుకు 35 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని సమాచారం. ఇందులో పెట్రోల్ ఇంజన్ కేవలం జనరేటర్ లా పనిచేసి బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది, ఆ బ్యాటరీ పవర్ తో ఎలక్ట్రిక్ మోటార్ కారును నడిపిస్తుంది. దీనివల్ల పెట్రోల్ ఖర్చు భారీగా తగ్గుతుంది. దీని ధర రూ.7 లక్షల నుంచి రూ.12 లక్షల మధ్య ఉండొచ్చు.

మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్:
కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్ లో కింగ్ అనిపించుకున్న బ్రెజ్జా ఇప్పుడు కొత్త అవతారంలో రాబోతోంది. ఈసారి బ్రెజ్జాలో 1.0-లీటర్ బూస్టర్‌జెట్ టర్బో పెట్రోల్ ఇంజన్ ను మారుతి పరిచయం చేస్తోంది. అంతేకాకుండా, ఇప్పటివరకు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఉన్న బ్రెజ్జా, ఇప్పుడు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో రాబోతోంది. దీనివల్ల హైవేల మీద కారు స్మూత్ గా వెళ్లడమే కాకుండా మైలేజీ కూడా మెరుగవుతుంది. ఈ అప్‌డేటెడ్ బ్రెజ్జా ఏప్రిల్ లేదా మే నెలలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
టాటా నెక్సాన్ కు గండం తప్పదా?
ప్రస్తుతం నెక్సాన్ తన సేఫ్టీ రేటింగ్, ఫీచర్ల వల్ల నంబర్ వన్ గా ఉంది. కానీ మారుతి నుంచి వస్తున్న 35 కిమీ మైలేజీ హైబ్రిడ్ కార్లు, స్కోడా నుంచి వస్తున్న జర్మన్ టెక్నాలజీ నెక్సాన్ అమ్మకాలపై కచ్చితంగా ప్రభావం చూపిస్తాయి. మీరు ఒకవేళ పర్ఫెక్ట్ వాల్యూ ఫర్ మనీ కారు కావాలనుకుంటే, ఈ కొత్త మోడల్స్ లాంచ్ అయ్యే వరకు ఆగడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications








