Nissan : సెకండ్ ఇన్నింగ్స్ లో అదరగొడుతున్న జపాన్ కంపెనీ..కార్ లాంచ్ అయ్యిందో లేదో భారీగా సేల్స్
Nissan : భారత ఆటోమొబైల్ రంగంలో జపాన్ దిగ్గజం నిస్సాన్ (Nissan) మళ్ళీ తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. గత కొన్నాళ్లుగా నిలకడగా ఉన్న అమ్మకాలు, కొత్త మోడల్ నిస్సాన్ గ్రావిటే(Nissan Gravite) ఎంట్రీతో ఒక్కసారిగా రాకెట్ వేగంతో పుంజుకున్నాయి. ఫిబ్రవరి 2026 నెల నిస్సాన్ సంస్థకు కనీవినీ ఎరుగని విజయాన్ని అందించింది. వార్షిక ప్రాతిపదికన అమ్మకాల్లో ఏకంగా 23 శాతం వృద్ధిని నమోదు చేసి, ప్రత్యర్థి కంపెనీలకు నిస్సాన్ గట్టి సవాల్ విసిరింది. కొత్త కారు లాంచ్ అయిన వెంటనే కస్టమర్లు షోరూమ్‌లకు క్యూ కట్టడం ఇప్పుడు మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. ఫిబ్రవరి 2026లో నిస్సాన్ మోటార్ ఇండియా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో కలిపి మొత్తం 10,565 వాహనాలను విక్రయించింది. ఇందులో భారత్‌లో జరిగిన విక్రయాలు 2,230 యూనిట్లు కాగా, విదేశాలకు ఎగుమతి చేసిన వాహనాల సంఖ్య 8,335గా ఉంది. నిస్సాన్ బ్రాండ్ మీద భారతీయ కస్టమర్లకు ఉన్న నమ్మకం, ముఖ్యంగా కొత్తగా వచ్చిన గ్రావిటే మోడల్ పట్ల చూపిస్తున్న ఆసక్తి కంపెనీకి కొత్త ఊపిరి పోసింది. నిస్సాన్ మ్యాగ్నైట్ సృష్టించిన సంచలనాన్ని గ్రావిట్ కొనసాగిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

నిస్సాన్ గ్రావిట్ లాంచ్ కావడం ఈ వృద్ధికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఈ మోడల్ కోసం ఆటో ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. కంపెనీ తన గ్రావిటే కారును ఫిబ్రవరిలోనే మార్కెట్లోకి విడుదల చేసింది. అడ్వాన్సుడ్ ఫీచర్లు, అద్భుతమైన డిజైన్, మధ్యతరగతికి అందుబాటులో ఉండే ధర (రూ.5.65 లక్షల నుంచి ప్రారంభం) ఈ కారును సూపర్ హిట్ చేశాయి. ఈ కారు బుకింగ్స్ ఇప్పటికే రికార్డు స్థాయికి చేరగా, మార్చి 1, 2026 నుంచి కంపెనీ డెలివరీలను కూడా ప్రారంభించింది. అంటే, రాబోయే నెలల్లో నిస్సాన్ అమ్మకాల గ్రాఫ్ ఇంకా పైకి వెళ్లడం ఖాయం.
నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ వత్స ఈ ఘనతపై హర్షం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి నెల తమ కంపెనీ భవిష్యత్తుకు ఒక బలమైన పునాది అని ఆయన అభివర్ణించారు. కస్టమర్లు, డీలర్లు, భాగస్వాముల మధ్య నిస్సాన్ బ్రాండ్ పట్ల కనిపిస్తున్న ఉత్సాహం తమ బాధ్యతను మరింత పెంచిందని ఆయన పేర్కొన్నారు. కేవలం కొత్త కార్లను తీసుకురావడమే కాకుండా, కస్టమర్లకు నాణ్యమైన సర్వీస్ అందించడం కోసం డీలర్ నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. నిస్సాన్ తన వ్యూహాన్ని పూర్తిగా మార్చుకుంది. భారతీయ రోడ్లకు, కస్టమర్ల అభిరుచులకు తగ్గట్లుగా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్‌తో వాహనాలను రూపొందిస్తోంది. మ్యాగ్నైట్ మోడల్ ద్వారా నిస్సాన్ ఇప్పటికే బడ్జెట్ ఎస్‌యూవీ విభాగంలో తన సత్తా చాటింది. ఇప్పుడు గ్రావిటే రాకతో మరింత పట్టు సాధించింది. కేవలం భారత్‌లోనే కాకుండా, ఇక్కడి నుంచి తయారైన వాహనాలను విదేశాలకు భారీగా ఎగుమతి చేస్తూ గ్లోబల్ హబ్‌గా ఎదుగుతోంది. ఫిబ్రవరిలో ఎగుమతులు 8 వేలు దాటడమే దీనికి నిదర్శనం.
నిస్సాన్ కార్లలో ముఖ్యంగా భద్రతకు పెద్దపీట వేయడం కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఫోర్ స్టార్ రేటింగ్స్, అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు తక్కువ ధరకే లభిస్తుండటంతో జనం నిస్సాన్ వైపు మొగ్గు చూపుతున్నారు. హోలీ పండుగ సీజన్ కావడంతో నిస్సాన్ గ్రావిట్ తో పాటు మ్యాగ్నైట్ పైనా ఆకర్షణీయమైన ఆఫర్లు మరియు డీల్స్ అందుబాటులో ఉన్నాయి. టాటా పంచ్, మారుతి ఫ్రాంక్స్ వంటి గట్టి పోటీ ఉన్న విభాగంలో నిస్సాన్ 23 శాతం వృద్ధి సాధించడం సామాన్యమైన విషయం కాదు. నిస్సాన్ తన సెకండ్ ఇన్నింగ్స్‌ను అద్భుతంగా ప్రారంభించిందని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications








