ఇది డిక్కీ కాదు స్టోర్ రూమ్.. 500లీటర్లకు పైగా బూట్ స్పేస్ ఉన్న ఈ టాప్ 5 కార్లు చూస్తే షాక్ అవుతారు
ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తే సూట్‌కేసులు, బ్యాగులతో కారు నిండిపోయి టెన్షన్ పడ్డారా ఎప్పుడైనా ? ఇప్పుడు ఆ సమస్యకు చాలా కంపెనీలు ఫుల్ స్టాప్ పెడుతున్నాయి. మన దేశంలో ఒకప్పుడు కారు అంటే కేవలం ప్రయాణ సాధనం మాత్రమే.. కానీ ఇప్పుడు అది ఒక హోదాకు హోదాకు, సౌకర్యానికి చిహ్నం. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండే మన దేశంలో కారు కొనేటప్పుడు ఇంజిన్ పవర్, మైలేజీతో పాటు చూసే మరో ముఖ్యమైన విషయం బూట్ స్పేస్.
ఊర్లకు వెళ్లాలన్నా, ఎయిర్‌పోర్ట్ నుంచి చుట్టాలను తీసుకురావాలన్నా లేదా వీకెండ్ ట్రిప్స్ వేయాలన్నా లగేజీ పెట్టుకోవడానికి తగినంత స్థలం లేకపోతే ఆ ప్రయాణం నరకంలా అనిపిస్తుంది. అందుకే కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని 500 లీటర్ల కంటే ఎక్కువ బూట్ స్పేస్ అందిస్తున్న టాప్ 5 కార్ల వివరాలు తెలుసుకుందాం.

1. టాటా సియెర్రా (Tata Sierra)
ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది టాటా సంచలనం సియెర్రా. ఈ కారులో ఏకంగా 622 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మిడ్-సైజ్ ఎస్‌యూవీలలో ఇదే అత్యధికం. దీని ధర రూ.11.49 లక్షల నుంచి రూ.21.29 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
కేవలం స్పేస్ మాత్రమే కాదు, ఇందులో 19-అంగుళాల భారీ అలాయ్ వీల్స్, పనోరమిక్ సన్‌రూఫ్, 12.3-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, సేఫ్టీ కోసం లెవల్-2 ADAS వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. పెద్ద కుటుంబాలకు, ఎక్కువ లగేజీతో ప్రయాణించే వారికి ఇది ఒక వరం లాంటిది.

2. ఎంజీ హెక్టార్ (MG Hector)
ప్రాక్టికాలిటీకి మారుపేరుగా నిలిచే ఎంజీ హెక్టార్, 587 లీటర్ల బూట్ స్పేస్‌తో రెండో స్థానంలో ఉంది. ఈ కారు ధర రూ.11.99 లక్షల నుంచి ప్రారంభమై రూ.19.49 లక్షల వరకు ఉంటుంది. దీని డిజైన్, లోపల ఉండే ప్రీమియం ఇంటీరియర్స్ కస్టమర్లను ఇట్టే ఆకట్టుకుంటాయి.
ముఖ్యంగా వీకెండ్ ట్రిప్స్ వేసే వారికి, ఎయిర్‌పోర్ట్ డ్రాప్స్ కి ఈ కారు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇందులో ఉండే పెద్ద టచ్‌స్క్రీన్, వాయిస్ కమాండ్ ఫీచర్లు ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తాయి.

3. స్కోడా స్లావియా & ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ (Skoda Slavia & VW Virtus)
సెడాన్ కార్లు అంటే డిక్కీ చిన్నగా ఉంటుందని అనుకుంటే పొరపాటే. స్కోడా స్లావియా, ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ కార్లు 521 లీటర్ల బూట్ స్పేస్‌తో ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇస్తున్నాయి. వీటి ధర రూ.10.49 లక్షల నుంచి రూ.19 లక్షల వరకు ఉంటుంది.
ఈ కార్లు కేవలం లగేజీకే కాదు, పర్ఫార్మెన్స్‌కు కూడా పెట్టింది పేరు. జర్మన్ ఇంజనీరింగ్‌తో తయారైన ఈ కార్లు హైవేలపై దూసుకుపోవడానికి, అదే సమయంలో ఫ్యామిలీతో కలిసి ఎక్కువ సామాన్లు తీసుకెళ్లడానికి అద్భుతంగా పనికొస్తాయి.

4. రెనాల్ట్ డస్టర్ 2026 (Renault Duster)
కొత్తగా వచ్చిన రెనాల్ట్ డస్టర్ 2026 మోడల్ కస్టమర్లను తన బూట్ స్పేస్‌తో అశ్చర్యపరుస్తోంది. ఇందులో 518 లీటర్ల కార్గో స్పేస్ ఇచ్చారు. సుమారు రూ.10.49 లక్షల ప్రారంభ ధరతో లభిస్తున్న ఈ కారు, అటు ఆఫ్ రోడింగ్ చేసేవారికి ఇటు ఫ్యామిలీతో కలిసి ప్రయాణించేవారికి ఒక గొప్ప ఎంపిక.
దీని రగ్డ్ లుక్, విశాలమైన కేబిన్ ప్రయాణికులకు మంచి కంఫర్ట్‌ను ఇస్తాయి. లాంగ్ జర్నీలలో సామాన్ల విషయంలో అస్సలు రాజీ పడక్కర్లేదని డస్టర్ నిరూపిస్తోంది.

5. టాటా కర్వ్ (Tata Curvv)
టాటా నుండి వచ్చిన మరో అద్భుతం కర్వ్. దీని ఐసీఈ (ICE) మోడల్ ధర రూ.9.69 లక్షల నుంచి రూ.19.10 లక్షల వరకు ఉంది. ఇది స్టైలిష్ కూపే డిజైన్ కలిగి ఉన్నప్పటికీ, బూట్ స్పేస్ విషయంలో ఏమాత్రం తగ్గలేదు. ఇందులో 500 లీటర్ల డిక్కీ స్థలం లభిస్తుంది.
డిజైన్ పరంగా కారు వెనుక భాగం కొంచెం వంపు తిరిగి ఉన్నా, లగేజీ పెట్టుకోవడానికి మాత్రం చాలా తెలివిగా స్థలాన్ని కేటాయించారు. యువతను ఆకట్టుకునే లుక్, ఫ్యామిలీకి కావాల్సిన స్పేస్ రెండూ ఇందులో ఉన్నాయి.


Click it and Unblock the Notifications