బడ్జెట్ ఏదైనా..బండి మాత్రం టాటానే కావాలి..కార్లను తయారు చేయలేక ఎక్స్ట్రా డ్యూటీ చేస్తున్న ఉద్యోగులు
టాటా మోటార్స్ సరికొత్త రికార్డులతో 2026 ఏడాదిని ఘనంగా ప్రారంభించింది. జనవరి 2026 నెలలో కంపెనీ ఏకంగా 71,066 యూనిట్ల విక్రయాలను నమోదు చేసి, ఆటోమొబైల్ మార్కెట్‌లో తన పట్టును చాటుకుంది. గతేడాది ఇదే నెలలో (జనవరి 2025) జరిగిన 48,316 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే ఇది 47.1 శాతం భారీ వృద్ధి కావడం విశేషం. ముఖ్యంగా టాటా నెక్సాన్, టాటా పంచ్ వంటి మోడళ్లు ఆల్-టైమ్ రికార్డులను సృష్టించాయి.
టాటా మోటార్స్ (ఇప్పుడు టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్) భారత ఆటోమొబైల్ రంగంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది. జనవరి 2026లో కంపెనీ మొత్తం 71,066 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇందులో దేశీయ విక్రయాలు 70,222 యూనిట్లు కాగా, ఎగుమతులు కూడా గణనీయంగా పెరిగాయి.

గత ఏడాది జనవరిలో కేవలం 48,076 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే ఏడాది కాలంలోనే కంపెనీ తన విక్రయ సామర్థ్యాన్ని దాదాపు సగం మేర పెంచుకుంది. ఈ భారీ వృద్ధికి ముఖ్యంగా ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జీఎస్టీ తగ్గింపులు, టాటా కార్ల సేఫ్టీ రేటింగ్స్ ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
టాటా నెక్సాన్ ఎస్‌యూవీ ఇప్పుడు భారతీయ కుటుంబాలకు అత్యంత ఇష్టమైన కారుగా మారిపోయింది. జనవరి నెలలోనే 23,000 కంటే ఎక్కువ నెక్సాన్ కార్లు అమ్ముడయ్యాయి. ఇది ఈ మోడల్ చరిత్రలోనే అత్యుత్తమ నెలవారీ అమ్మకం. అంతేకాకుండా, 2017లో లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు నెక్సాన్ 10 లక్షల యూనిట్ల మైలురాయిని అధిగమించి, టాటా పోర్ట్‌ఫోలియోలో అత్యంత విజయవంతమైన కారుగా నిలిచింది. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వెర్షన్లలో అందుబాటులో ఉండటం దీనికి ప్లస్ పాయింట్‌గా మారింది.

టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లాంచ్ అయిన తర్వాత దాని అమ్మకాలు ఊపందుకున్నాయి. ఈ మైక్రో ఎస్‌యూవీ కేవలం 4 ఏళ్ల 3 నెలల కాలంలోనే 7 లక్షల యూనిట్ల విక్రయాలను పూర్తి చేసుకుంది. జనవరిలో 19,000 యూనిట్లతో ఇది తన సత్తా చాటింది. అలాగే, టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్ కూడా 7 లక్షల మార్కును చేరుకుని కంపెనీకి గట్టి మద్దతుగా నిలిచింది.
ఐకానిక్ మోడల్ టాటా సియెర్రా మళ్లీ భారత రోడ్లపైకి రావడంతో వినియోగదారులు బ్రహ్మరథం పడుతున్నారు. రూ.11.49 లక్షల ప్రారంభ ధరతో వచ్చిన ఈ ఎస్‌యూవీకి డిమాండ్ పెరగడంతో, టాటా మోటార్స్ తన తయారీ కేంద్రాల్లో ఉత్పత్తిని పెంచింది. మరోవైపు, కేవలం డీజిల్ ఇంజన్లతోనే ఉన్న హారియర్, సఫారీ కార్లలో కొత్తగా 1.5 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్లను ప్రవేశపెట్టడం వల్ల ఈ ప్రీమియం ఎస్‌యూవీల అమ్మకాలు కూడా పుంజుకున్నాయి. రాబోయే రోజుల్లో కర్వ్, మరిన్ని ఎలక్ట్రిక్ మోడళ్లతో మార్కెట్‌ను ఏలాలని టాటా లక్ష్యంగా పెట్టుకుంది.

బడ్జెట్ అంచనాలు ఎలా ఉన్నా, వినియోగదారుల నమ్మకం మాత్రం టాటా మోటార్స్‌పైనే నిలిచింది. సేఫ్టీ, స్టైల్, విస్తృతమైన మోడల్ ఎంపికలతో పాటు ఎలక్ట్రిక్ భవిష్యత్తుపై స్పష్టమైన దృష్టి పెట్టిన టాటా, 2026 ప్రారంభంలోనే తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ప్రస్తుత వేగాన్ని కొనసాగిస్తే రాబోయే నెలల్లో కొత్త రికార్డులు, కొత్త మైలురాళ్లు టాటా ఖాతాలో చేరడం ఖాయమే. భారత ఆటోమొబైల్ రంగంలో "బండి అంటే టాటా" అన్న మాట మరింత బలంగా వినిపించే రోజులు దూరంలో లేవు.


Click it and Unblock the Notifications








