ఇక ఛార్జింగ్ స్టేషన్లకి వెళ్లక్కర్లేదు..ఛార్జింగ్ బండి మీ ఇంటికే వస్తుంది..టాటా కొత్త స్కీమ్ అదిరిపోయిందిగా
భారతదేశ ఎలక్ట్రిక్ వాహన రంగంలో అగ్రగామిగా ఉన్న టాటా మోటార్స్ (Tata Motors) కస్టమర్లను ఆకట్టుకోవడానికి కనీవినీ ఎరుగని రీతిలో సరికొత్త ప్రణాళికలను అమలు చేస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఎంజీ మోటార్, మారుతి సుజుకి వంటి కంపెనీల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న తరుణంలో, తన ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి టాటా ఒక భారీ మాస్టర్ ప్లాన్ వేసింది.
దీనివల్ల ఎలక్ట్రిక్ కార్ల ధరలు ఏకంగా 40 శాతం వరకు తగ్గనున్నాయి. అవును, మీరు చదువుతున్నది నిజమే. కేవలం రూ.10 లక్షల విలువైన కారును కేవలం రూ.6 లక్షలకే ఇంటికి తీసుకెళ్లే అవకాశాన్ని టాటా కల్పిస్తోంది. దీనికి ప్రధాన కారణం టాటా ప్రవేశపెట్టిన బాస్ (BAAS - Battery As A Service) విధానం.

ప్రస్తుతానికి టాటా పంచ్ ఈవీ (Tata Punch EV)ని ఈ బాస్ పద్ధతిలో కొనుగోలు చేయవచ్చు. సాధారణంగా పన్చ్ ఈవీ బేస్ వేరియంట్ ధర రూ.9.69 లక్షలు ఉండగా, బాస్ విధానంలో దీని ధర కేవలం రూ.6.49 లక్షలకే లభిస్తోంది. అంటే కొనుగోలు సమయంలోనే దాదాపు రూ.3.20 లక్షలు ఆదా అవుతాయి. అయితే ఇందులో ఒక చిన్న మెలిక ఉంది.
కారులోని బ్యాటరీని మీరు కొనుగోలు చేయనక్కర్లేదు, దాన్ని కేవలం అద్దెకు వాడుకుంటున్నట్లు లెక్క. దీనికోసం మీరు ప్రయాణించే ప్రతి కిలోమీటరుకు రూ.2.60 చొప్పున ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ప్రారంభంలో భారీ పెట్టుబడి పెట్టలేక ఇబ్బంది పడే మధ్యతరగతి ప్రజలకు ఇది ఒక వరం లాంటి పథకం. రాబోయే రోజుల్లో అన్ని టాటా ఈవీ మోడళ్లకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని కంపెనీ భావిస్తోంది.

ధర తగ్గించడమే కాకుండా, ఎలక్ట్రిక్ కార్ల యజమానులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అయిన ఛార్జింగ్‌కు కూడా టాటా ఒక సూపర్ పరిష్కారాన్ని కనిపెట్టింది. దీనికోసం హోప్‌ఛార్జ్ (Hopcharge) అనే సంస్థతో టాటా మోటార్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పథకం ప్రకారం, మీరు ఛార్జింగ్ స్టేషన్ల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు.
కేవలం ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు, ఛార్జింగ్ వ్యాన్ నేరుగా మీ ఇంటికే వస్తుంది. మీ ఇంటి వద్దే మీ కారును ఫాస్ట్ ఛార్జింగ్ చేసి వెళ్తుంది. దీనికోసం టాటా మూడు రకాల సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను (Experience, Success 3.3, Success 7.2) ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈ సేవలు ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో అందుబాటులో ఉండగా, త్వరలోనే దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు.

టాటా మోటార్స్ ఇంతటితో ఆగకుండా, భవిష్యత్తులో మరిన్ని అద్భుతమైన మోడళ్లను విడుదల చేయబోతోంది. ముఖ్యంగా ఐకానిక్ మోడల్ టాటా సీయెరా ఈవీ (Tata Sierra EV), కొత్త ఫీచర్లతో రాబోతున్న టాటా టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్ (Tata Tiago EV Facelift) పై భారీ అంచనాలు ఉన్నాయి. తక్కువ ధరలో కారును అందించడం, ఇంటి వద్దే ఛార్జింగ్ సౌకర్యం కల్పించడం వంటి వినూత్న ఆలోచనలతో టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని ఆటోమొబైల్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications








