కంపెనీలోని 8 మోడళ్లకు చుక్కలు చూపించిన చిన్న కారు.. ఒకే నెలలో 21,000 మంది కొనేశారు
ప్రముఖ స్వదేశీ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ ప్రతి నెల సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. జూన్ నెల సేల్స్ రిపోర్ట్‌ను గమనిస్తే కంపెనీ బిజినెస్ భారీగా జరుగుతన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టాటా సంస్థ ఇండియన్ మార్కెట్లో దాదాపు 9 కార్ మోడల్స్ విక్రయిస్తోంది. ఇందులో చాలా వరకు పెట్రోల్, డీజిల్ వెర్షన్లతో పాటు ఎలక్ట్రిక్ రూపంలోనూ అందుబాటులో ఉన్నాయి.
అయితే ఈ మొత్తం కార్లలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది మాత్రం టాటా పంచ్. కేవలం రూ.5,69,990 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లభించే ఈ మైక్రో ఎస్‌యూవీ కంపెనీలోని మిగిలిన 8 మోడళ్లను వెనక్కి నెట్టి నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. జూన్ నెలలో ఏకంగా 21,006 మంది కస్టమర్లు ఈ కారును కొనుగోలు చేసి దేశంలోనే టాప్ సెల్లింగ్ కారుగా నిలబెట్టారు.

టాటా మోటార్స్ గత నెలలో మొత్తంగా 62,076 వాహనాలను విక్రయించింది. గత ఏడాది జూన్ నెలలో కంపెనీ కేవలం 37,083 కార్లను మాత్రమే అమ్మగలిగింది. అంటే ఏడాది ప్రాతిపదికన చూసుకుంటే కంపెనీ ఏకంగా 67 శాతం భారీ వృద్ధిని నమోదు చేసింది. అలాగే మే నెలలో జరిగిన 59,090 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే నెలవారీగా కూడా 5 శాతం గ్రోత్ సాధించింది.
మోడళ్ల వారీగా చూస్తే టాటా పంచ్ గత ఏడాది జూన్ నాటి 10,446 యూనిట్లతో పోలిస్తే ఈసారి 101 శాతం అద్భుతమైన గ్రోత్ చూపించింది. దీని తర్వాత రెండో స్థానంలో టాటా నెక్సాన్ 18,335 యూనిట్ల సేల్స్‌తో నిలిచింది. నెక్సాన్ అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 58 శాతం పెరిగినా, మే నెలతో పోలిస్తే 4 శాతం స్వల్పంగా తగ్గాయి.

టాటా ఫ్యామిలీలోని ఇతర కార్ల విషయానికి వస్తే హ్యాచ్‌బ్యాక్ మోడల్ టాటా టియాగో జూన్ నెలలో 7,329 యూనిట్ల అమ్మకాలతో మూడో స్థానంలో నిలిచింది. ఇది మే నెల అమ్మకాల కంటే ఏకంగా 75 శాతం ఎక్కువ కావడం విశేషం. ఇక మార్కెట్లోకి కొత్తగా అడుగుపెట్టిన మోస్ట్ అవేటెడ్ మోడల్ టాటా సియెర్రా 6,392 యూనిట్ల అమ్మకాలతో అదరగొట్టింది.
ప్రీమియం ఎస్‌యూవీలైన టాటా హారియర్ 135 శాతం వార్షిక వృద్ధితో 2,962 యూనిట్లు, టాటా సఫారీ 38 శాతం గ్రోత్‌తో 1,271 యూనిట్ల అమ్మకాలను నమోదు చేశాయి. అయితే టాటా ఆల్ట్రోజ్ (2,426 యూనిట్లు), టాటా కర్వ్ (1,753 యూనిట్లు), సెడాన్ మోడల్ టాటా టిగోర్ (602 యూనిట్లు) అమ్మకాల్లో గత ఏడాదితో పోలిస్తే కొంత తిరోగమనం కనిపించింది.

ప్రస్తుతం మార్కెట్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను కంపెనీ సరికొత్త డిజైన్‌తో తీర్చిదిద్దింది. తన పాత బాక్సీ, కాంపాక్ట్ లుక్‌ను అలాగే ఉంచుతూనే, ముందు భాగంలో స్లిమ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, ఆకర్షణీయమైన బ్లాక్ గ్రిల్, కొత్త హెడ్‌ల్యాంప్‌లు, రీడిజైన్ చేసిన బంపర్‌తో దీనికి మరింత షార్ప్ లుక్ ఇచ్చారు.
కారు వెనుక భాగంలో కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్, సైడ్ ప్రొఫైల్‌లో కొత్త 16-ఇంచుల డైమండ్-కట్ అలాయ్ వీల్స్ కారుకు ప్రీమియం రూపాన్ని తెచ్చాయి. కస్టమర్ల కోసం ఈ కారును స్మార్ట్, ప్యూర్, ప్యూర్ ప్లస్, అడ్వెంచర్, అకంప్లిష్డ్, అకంప్లిష్డ్ ప్లస్ ఎస్ అనే 6 వేరియంట్లలో, సరికొత్త కలర్ ఆప్షన్లలో విక్రయిస్తున్నారు. నాల్గు దశాబ్దాల భారత ఆటోమొబైల్ చరిత్రలో మారుతి సుజుకి కాకుండా వేరే కంపెనీ కారు దేశంలోనే టాప్ ప్లేస్ సంపాదించడం ఇదే మొదటిసారి.
ఈ చిన్న కారులో కస్టమర్లకు కావాల్సిన అన్ని రకాల అధునాతన సాంకేతిక ఫీచర్లను టాటా సంస్థ జోడించింది. 360-డిగ్రీల కెమెరా సిస్టమ్, బ్లైండ్ వ్యూ మానిటర్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‌వీఎమ్ ఫీచర్లు ఉన్నాయి. 10.24 ఇంచుల హెచ్‌డీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ సపోర్ట్, ప్రీమియం హర్మాన్ ఆడియో సిస్టమ్‌ను అమర్చారు. అంతేకాకుండా ప్రయాణంలో లగేజీ పెట్టుకోవడానికి వీలుగా పెట్రోల్ వేరియంట్‌లో ఈ సెగ్మెంట్‌లోనే అతిపెద్దదైన 366 లీటర్ల బూట్ స్పేస్‌ను అందించారు.
టాటా పంచ్‌లో డ్రైవర్లకు రెండు రకాల ఇంజన్ ఛాయిస్‌లు అందుబాటులో ఉన్నాయి. మొదటిది రెగ్యులర్ 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కాగా, దీనిని కంపెనీ పేటెంట్ కలిగి i-CNG టెక్నాలజీతో కూడా కొనుగోలు చేయవచ్చు. ఇక ఎక్కువ పవర్, వేగాన్ని ఇష్టపడే వారి కోసం మొదటిసారిగా 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను కూడా పరిచయం చేశారు.
సాధారణంగా సీఎన్‌జీ కార్లలో సిలిండర్ల వల్ల డిక్కీలో అస్సలు స్థలం ఉండదు. కానీ టాటా సంస్థ తన అడ్వాన్స్‌డ్ డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా సీఎన్‌జీ మోడల్‌లోనూ ఏకంగా 210 లీటర్ల విశాలమైన, ఉపయోగపడే కార్గో స్పేస్‌ను కస్టమర్లకు అందించడం విశేషం. టాటా కార్లంటేనే అందరికీ గుర్తొచ్చేది వాటి బిల్డ్ క్వాలిటీ, ప్రయాణీకుల భద్రత. ఈ సరికొత్త పంచ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు.
ఇందులో బేస్ వేరియంట్ నుంచే స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి కఠినమైన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రేష్ టెస్టుల్లో ఈ కారుకు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది.


Click it and Unblock the Notifications