నెక్సాన్, బ్రెజ్జా, సోనెట్.. ఇలా ఎన్ని ఉన్నా ఈ ఒక్క కారుకే పట్టం కట్టిన జనాలు
భారత ఆటోమొబైల్ రంగంలో సబ్ 4 మీటర్ ఎస్‌యూవీ (Sub-4m SUV) సెగ్మెంట్ ప్రస్తుతం ఓ రణరంగంలా మారింది. మిడిల్ క్లాస్ ప్రజల డ్రీమ్ కార్లుగా మారిన ఈ బుజ్జి ఎస్యూవీల విక్రయాల్లో గత నెల అంటే మార్చి 2026లో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. టాటా మోటార్స్ తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకోగా, కియా వంటి దిగ్గజ కంపెనీకి చెందిన ఒక మోడల్ మాత్రం ఘోర పరాజయాన్ని అందించింది. నెక్సాన్, బ్రెజ్జా, సోనెట్ వంటి ఉద్దండ పిండాలను సైతం వెనక్కి నెట్టి టాటా పంచ్ (Tata Punch) తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది.
గత నెలలో భారతీయ కస్టమర్లు టాటా పంచ్ (Punch) పై తమ మనసు పారేసుకున్నారు. ఎలక్ట్రిక్, పెట్రోల్ వెర్షన్లలో అందుబాటులో ఉన్న ఈ చిన్న ఎస్యూవీ మార్చి 2026లో ఏకంగా 20,977 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. గతేడాది మార్చిలో అమ్ముడైన 17,714 యూనిట్లతో పోలిస్తే ఇది 18.42 శాతం వృద్ధిని కనబరిచింది. సెగ్మెంట్‌లో 17.09 శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకుని, ఇతర 13 మోడళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దీని మైలేజీ, సేఫ్టీ రేటింగ్, ధర సామాన్యులకు బాగా కనెక్ట్ అయ్యాయి.

టాటా మోటార్స్ నుండి వచ్చిన మరో దిగ్గజం నెక్సాన్ (Nexon) కూడా దూసుకుపోతోంది. మార్చి 2026లో 19,810 యూనిట్లు అమ్ముడై రెండో స్థానంలో నిలిచింది. గతేడాది ఇదే నెలలో దీని విక్రయాలు 16,366 యూనిట్లుగా ఉండేవి, అంటే 21.04 శాతం భారీ వృద్ధిని సాధించింది. ఎలక్ట్రిక్ వెర్షన్‌లో నెక్సాన్ కి పోటీ లేకపోవడం, 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ దీనికి పెద్ద ప్లస్ పాయింట్లుగా మారాయి. టాప్-2 స్థానాలు టాటా ఖాతాలోకే వెళ్లడం విశేషం.
ఒకప్పుడు ఈ సెగ్మెంట్‌ను ఏలిన మారుతి బ్రెజ్జా (Brezza) మూడో స్థానానికి పడిపోయింది. గత నెలలో 16,130 యూనిట్లు అమ్ముడయ్యాయి, ఇది గతేడాది కంటే 2.51 శాతం తక్కువ. అయితే మారుతికి కాస్త ఊరటనిచ్చే విషయం ఏమిటంటే ఫ్రాంక్స్ (Fronx). ఇది 15,540 యూనిట్ల విక్రయాలతో నాలుగో స్థానంలో నిలిచింది. గతేడాది కంటే 13.69 శాతం గ్రోత్ సాధించి మారుతి పరువును కాపాడింది. అయినా టాటా దూకుడును అందుకోవడంలో మారుతి విఫలమైందనే చెప్పాలి.

కియా సోనెట్ (Sonet) ఈసారి అద్భుతమైన పుంజుకుంది. మార్చి 2026లో 12,012 యూనిట్లు అమ్ముడై, గతేడాది కంటే ఏకంగా 55.9 శాతం వృద్ధి సాధించింది. హ్యుందాయ్ వెన్యూ (Venue) కూడా 11,147 యూనిట్లతో తన ఉనికిని చాటుకుంది. ఇక మహీంద్రా XUV3XO/EV విక్రయాలు కూడా 30 శాతం పెరిగి 9,199 యూనిట్లకు చేరాయి. హ్యుందాయ్ ఎక్స్‌టర్, స్కోడా కైలక్ వంటివి మిక్సడ్ రిజల్ట్స్ అందించాయి.
ఈ రిపోర్టులో అందరినీ షాక్ కి గురిచేసిన పేరు కియా సిరోస్ (Kia Syros). గతేడాది మార్చి 2025లో 5,015 యూనిట్లు అమ్ముడైన ఈ మోడల్, ఇప్పుడు మార్చి 2026లో కేవలం 59 యూనిట్లకు పరిమితమైంది. అంటే విక్రయాలు ఏకంగా 98.82 శాతం పడిపోయాయి. ఒకప్పుడు బెస్ట్ సెల్లర్లలో ఒకటిగా ఉన్న ఈ కారుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆ కంపెనీకే తెలియాలి. బహుశా మార్కెట్లో వచ్చిన కొత్త పోటీ లేదా కస్టమర్ల అభిరుచి మారడమే దీనికి కారణం కావచ్చు.

మొత్తంగా చూస్తే మార్చి నెలలో సబ్-4 మీటర్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో 1,22,710 కార్లు అమ్ముడయ్యాయి. ఇది గతేడాది కంటే 8.87 శాతం ఎక్కువ. ఫిబ్రవరి 2026 తో పోలిస్తే కూడా మార్కెట్ 7.14 శాతం వృద్ధిని కనబరిచింది. కస్టమర్లు ఇప్పుడు ఎక్కువగా సేఫ్టీకి (టాటా), మైలేజీకి (మారుతి), టెక్నాలజీకి (కియా/హ్యుందాయ్) ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఈ రేసులో టాటా మోటార్స్ పంచ్ మ్యాజిక్ మాత్రం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. రాబోయే పండగ సీజన్లలో ఈ పోటీ మరింత ముదిరే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








