12 నెలల్లో 4 కొత్త కార్లు తెస్తాం, ర్యాపిడో సిఎన్‌జి వెర్షన్ కూడా వస్తోంది: స్కొడా ఆటో
చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కొడా ఆటో ఈ ఏడాది భారత మార్కెట్లో అనేక కొత్త మోడళ్లను తీసుకురావడానికి కృషి చేస్తోంది. ఇప్పటికే, పలు రకాల మోడళ్లను స్కొడా భారతదేశపు రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది. తాజాగా స్కొడా ర్యాపిడ్ సెడాన్‌లో కంపెనీ ఓ సిఎన్‌జి వెర్షన్‌ను కూడా టెస్ట్ చేస్తోంది.

స్కొడా ర్యాపిడ్ సిఎన్‌జి వేరియంట్ ఈ సంవత్సరంలో ఎప్పుడైనా అమ్మకానికి రావచ్చని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్కొడా ఇండియా బాస్ ధృవీకరించారు. సోషల్ మీడియాలో ఓ నెటిజెన్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, స్కోడా ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ జాక్ హోలిస్ భారత మార్కెట్ కోసం రాపిడ్ సిఎన్‌జిని తీసుకువస్తున్నట్లు ధృవీకరించారు.

భారత్‌లో స్కొడా ర్యాపిడ్ సిఎన్‌జి వెర్షన్ టెస్టింగ్ విషయాన్ని ఆయన ధృవీకరించారు. అంతేకాకుండా, రానున్న 12 నెలల్లో భారతదేశంలో నాలుగు కొత్త ఉత్పత్తులను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నామని హోలిస్ తెలిపారు.

ట్విట్టర్‌లో ఓ నెటిజన్ ర్యాపిడ్ సిఎన్‌జి గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. "అవును ర్యాపిడ్ సిఎన్‌జి పరీక్ష దశలో ఉంది. స్కొడా ద్వారా రానున్న 12 నెలల్లో 4 కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తున్నాము. ఈ నెల స్కొడా కుషాక్ వరల్డ్ ప్రీమియర్‌తో ప్రారంభమవుతుంది." అని హోలిస్ అన్నారు.

భారత మార్కెట్ కోసం స్కొడా ప్లాన్ చేసిన నాలుగు కొత్త మోడళ్లలో ముందుగా వస్తున్నది స్కొడా కుషాక్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ. ఈ నెల చివరి నాటికి స్కొడా కుషాక్‌ను ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. స్కొడా భారత మార్కెట్లో సరికొత్త తరం ఆక్టేవియా సెడాన్‌ను కూడా పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తోంది. దీంతో పాటుగా ఓ సరికొత్త సి-సెగ్మెంట్ సెడాన్‌ను కూడా కంపెనీ విడుదల చేసేందుకు చూస్తోంది.

ప్రస్తుతం, కంపెనీ విక్రయిస్తున్న ర్యాపిడ్ సెడాన్‌లో తాజాగా సిఎన్‌జి వెర్షన్‌ను కూడా ప్రవేశపెడుతున్నట్లు కంపెనీ పేర్కొంది. అంటే స్కొడా నుండి కుషాక్ ఎస్‌యూవీ, కొత్త సి-సెగ్మెంట్ సెడాన్ (స్లావియా), ర్యాపిడ్ సిఎన్‌జి మరియు నెక్స్ట్ జనరేషన్ ఆక్టేవియా సెడాన్లు మార్కెట్లోకి రానున్నాయని తెలుస్తోంది.

ఈ ఏడాది చివరి నాటికి స్కొడా నుండి కొత్త సి-సెగ్మెంట్ సెడాన్ భారతదేశంలో విడుదల కావచ్చని తెలుస్తోంది. ఈ విషయాన్ని కూడా హోలిస్ గతంలో ధృవీకరించారు. ఈ కొత్త సెడాన్ ర్యాపిడ్ కన్నా పెద్దగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ కొత్త స్కొడా కారుకి 'స్లావియా' అని పేరు పెట్టే అవకాశం ఉంది. స్కొడా ఇదివరకే ఈ పేరును ట్రేడ్ మార్క్ కూడా చేసింది. - ఈ కొత్త సెడాన్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

స్కోడా ఆటో ఇండియా ప్రస్తుతం తమ కుషాక్ ఎస్‌యూవీ కోసం వరల్డ్ ప్రీమియర్‌ను నిర్వహించేందుకు కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన ఇంటీరియర్ మరియు ఎక్స్టీరియర్ వివరాలను వెల్లడించే స్కెచ్‌లను కూడా కంపెనీ విడుదల చేసింది. - ఆ స్కెచ్‌లు మరియు వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

స్కొడా ఆటో ఇండియా ఈ 2021 సంవత్సరంలో దేశీయ మార్కెట్ కోసం సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. ముందుగా కుషాక్ ఎస్‌యూవీతో మంచి పోటీతో కూడుకున్న మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి ప్రవేశించనుంది. ఆ తర్వాత హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా, మారుతి సుజుకి సియాజ్ వంటి మోడళ్లకు పోటీగా ఓ కొత్త సి-సెగ్మెంట్ సెడాన్‌ను సిద్ధం చేసుకుంటోంది.


Click it and Unblock the Notifications








