కారు కొందామని కలలు కన్నారా? ఎంజీ కంపెనీది కొనాలంటే జేబు ఖాళీ అవ్వడం ఖాయం.. ఏం షాకిచ్చింది భయ్యా
కొత్త ఏడాదిలో కొత్త కారు కొని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుందామనుకుంటున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్! ప్రముఖ వాహన తయారీ సంస్థ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా (JSW MG Motor India) తన కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో దూసుకుపోతున్న ఈ సంస్థ, తన మోడళ్లపై 2 శాతం వరకు ధరలను పెంచుతోంది. ఈ కొత్త ధరలు 2026 జనవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి. అంటే మీరు కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ డిసెంబర్ నెలాఖరు లోపు కొంటేనే పాత ధరలకు లభిస్తాయి. దంటే వచ్చే ఏడాది నుంచి అదనపు భారం తప్పదు.
ఈ ధరల పెంపునకు ప్రధాన కారణం పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలేనని కంపెనీ వెల్లడించింది. ముడి సరుకుల ధరలు (ముఖ్యంగా స్టీల్, అల్యూమినియం వంటివి) పెరగడం, రవాణా ఖర్చులు (Logistics) ఆకాశాన్ని తాకడం, ఇతర ఆర్థిక పరమైన ఒడిదుడుకుల వల్ల ధరలు పెంచక తప్పడం లేదని ఎంజీ స్పష్టం చేసింది. అయితే ఈ 2 శాతం పెంపు అనేది మీరు ఎంచుకునే మోడల్, వేరియంట్‌ను బట్టి మారుతుంది. కొన్ని కార్లపై కొద్దిగా, మరికొన్ని హై-ఎండ్ మోడళ్లపై భారీగా ధర పెరిగే అవకాశం ఉంది.

భారతదేశంలో ఎంజీ మోటార్స్ ప్రయాణం ఒక అద్భుతం అని చెప్పాలి. దేశంలోనే మొట్టమొదటి ఇంటర్నెట్ కారుగా హెక్టార్ (Hector) తో ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ సంస్థ చైనాకు చెందిన ఎస్ఏఐసీ (SAIC), మన దేశపు దిగ్గజం జేఎస్‌డబ్ల్యూ (JSW) గ్రూప్‌తో జతకట్టి సరికొత్త టెక్నాలజీతో దూసుకుపోతోంది.
వీరి ప్రధాన ప్లాంట్ గుజరాత్‌లోని హలోల్‌లో ఉంది. దీని సామర్థ్యం ప్రస్తుతం ఏడాదికి 1.2 లక్షల కార్లకు పెంచబడింది. అంతేకాకుండా, 2028 నాటికి తమ మొత్తం అమ్మకాల్లో 75 శాతం ఎలక్ట్రిక్ కార్లే ఉండాలని వీరు లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇక ప్రస్తుతం మార్కెట్లో ఎంజీ హవా ఎలా ఉందో చూస్తే.. విండ్సర్ ఈవీ (Windsor EV) ఒక రేంజ్‌లో దూసుకుపోతోంది. కేవలం 400 రోజుల్లోనే 50,000 యూనిట్లు అమ్ముడై రికార్డు సృష్టించింది. అలాగే ఇటీవల డిసెంబర్ 15న విడుదలైన 2026 ఎంజీ హెక్టార్ ఫేస్‌లిఫ్ట్ కూడా కేవలం రూ. 11.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందరినీ ఆకర్షిస్తోంది.
వీటితో పాటు చిన్న కారు కామెట్ ఈవీ(Comet EV), ప్రీమియం ఎస్‌యూవీ ZS EV, లగ్జరీ కారు గ్లోస్టర్(Gloster) వంటి మోడళ్లపై కూడా ఈ ధరల పెంపు ప్రభావం ఉండబోతోంది.

కేవలం ఎంజీ మాత్రమే కాదు, లగ్జరీ కార్ల తయారీ సంస్థలైన మెర్సిడెస్ బెంజ్, బీఎమ్‌డబ్ల్యూ వంటివి కూడా జనవరి నుంచి ధరలను పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. అంటే మొత్తం ఆటోమొబైల్ రంగంలో ధరల పెరుగుదల ట్రెండ్ కొనసాగుతోంది. కాబట్టి మీకు ఎంజీ కారు నచ్చితే, ఈ పదిహేను రోజుల్లోనే నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. ధర పెరగకముందే బుక్ చేసుకుంటే వేల రూపాయల సొమ్మును ఆదా చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








