డ్రైవర్ మూడ్‌ని బట్టి రంగులు మార్చే కారు - ప్యూజో ఆర్‌సిజెడ్

Posted By:
 Peugeot RCZ

గతంలో వివిధ రంగుల కార్లను ఉపయోగించే వారిని వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుకున్నాం. అయితే కారును నడిపే వారి మూడ్‌ను బట్టి ఆటోమేటిక్ రంగులు మారే కారు గురించి మీరు ఎప్పుడైనా ఊహించారా..? అవును కారును నడిపే వారిని బట్టి ఆటోమేటిక్‌గా ఊసరవెల్లిలా రంగులు మార్చే కారును ఫ్రాన్స్‌కు చెందిన ఆటోమొబైల్ కంపెనీ ప్యూజో అభివృద్ధి చేసింది.

ప్యూజో విడుదల చేసిన 'ఆర్‌సిజెడ్' అనే కారు డ్రైవర్ భావోద్వేగాన్ని (మూడ్) బట్టి రంగులు మారుతుంది. ఇందుకోసం ఓ ప్రత్యేకమైన రియాక్టివ్ పెయింట్‌ను బ్రిటన్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ కారు స్టీరింగ్‌లో అమర్చిన సెన్సార్లు కారును నడుపుతున్న డ్రైవర్ బాధగా ఉన్నాడో లేక సంతోషంగా ఉన్నాడో లేక కోపంతో ఉన్నాడో గుర్తించి దానికి అనుగుణంగా కారు రంగు మారేలా ఓ టెక్నాలజీని పరిశోధకులు అభివృద్ధి చేశారు.

కారు నుండి వెలువడే ఎలక్ట్రానిక్ ఇన్‌పుట్ ద్వారా ఈ రియాక్టివ్ పెయింట్ తన కాంపోజిషన్ (వివిధ రంగుల కలయిక)ను మార్చుకుని కొత్త రంగులోకి మారిపోతుంది. ఈ స్టీరింగ్‌కు అమర్చిన సెన్సార్లు డ్రైవర్ యొక్క ఉష్ణోగ్రతను, నాడి కొట్టుకోవటాన్ని అంచనా వేసి తద్వారా డ్రైవర్ మూడ్‌ను గ్రహిస్తాయి. ఇలా డ్రైవర్ మూడ్‌ని గుర్తించ సెన్సార్లు, కారు బయటి వైపు రంగును మార్చేందుకు సంకేతాలు పంపిస్తాయి.

ఈ సంకేతాలు అందుకున్న వెంటనే రియాక్టివ్ పెయింట్ తన కణ నిర్మాణాన్ని మార్చుకుని ఫలితంగా రంగును కూడా మార్చుకుంటుంది. ఇలా డ్రైవర్ మూడ్‌ని బట్టి కారు కూడా తన రంగును మార్చుకుంటుంది. ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచంలోనే మొట్టమొదటిదని, ఇది తమ వినియోగదారులకి ఓ వింతైన అనుభూతిని అందిస్తుందని ప్యూజో ప్రోడక్ట్ మేనేజర్ విన్స్ క్లిషమ్ తెలిపారు.

అంటే ఇకపై మీరు కోపంగా ఉన్నారో లేక సంతోషంగా ఉన్నారో మీరు చెప్పనవసరం లేకుండా మీ కారు చెప్పేస్తుందున్నమాట. ఇలాంటి కార్లు మన బాస్‌లు ఉపయోగిస్తే ఎంత బావుటుందో కదా..! బాస్ గుర్రుగా ఉన్నాడో లేక జోరు మీదున్నాడో కారు కలర్‌ను బట్టి ఇట్టే తెలిసిపోతుంది. ఏదేమైనప్పటికీ ప్యూజో కనిపెట్టిన ఈ అద్భుతమైన, ఆశ్చర్యకరమైన టెక్నాలజీకి హ్యాట్సాఫ్ అనాల్సిందే. మీరేమంటారు..?

English summary
Some say, the car you own reflects your personality. But do you want a car that also reflects your mood? If your answer is yes, then the new Peugeot RCZ unveiled in London is the car for you. The new RCZ has nothing new in terms of technical specifications or the design. But is unique in the new sports car from Peugeot is its paint.
Please Wait while comments are loading...

Latest Photos