పెట్రోల్ పై రూ.5, డీజిల్ పై రూ.3 పెంపు..సామాన్యుడికి మరో భారీ షాక్ ఇచ్చేందుకు రెడీ అయిన కంపెనీలు ?
మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ జ్వాలలు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సైనిక దాడుల నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. ఈ భారాన్ని తట్టుకోలేక దేశీయ అతిపెద్ద ప్రైవేట్ ఇంధన విక్రయ సంస్థ నయారా ఎనర్జీ (Nayara Energy) కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచుతూ గురువారం (మార్చి 26, 2026) ప్రకటన చేసింది.
ఫిబ్రవరి 28న ఇరాన్‌లోని సైనిక, అణు కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ మెరుపు దాడులు చేయడంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ ఎదురుదాడులకు దిగడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు దాదాపు 50 శాతం మేర పెరిగాయి. ఒక దశలో బారెల్ ధర 119 డాలర్లకు చేరుకుని, ప్రస్తుతం 100 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వం నుండి ఎటువంటి నష్టపరిహారం అందదు కాబట్టి, నష్టాలను తగ్గించుకోవడానికి నయారా ఎనర్జీ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కొన్ని రాష్ట్రాల్లో స్థానిక పన్నుల (VAT) కారణంగా ఈ పెంపు రూ.5.30 వరకు ఉండవచ్చు.
ప్రభుత్వ సంస్థల పరిస్థితి ఏంటి?
దేశవ్యాప్తంగా 90 శాతం మార్కెట్ వాటా కలిగిన ఇండియన్ ఆయిల్ (IOC), భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL) వంటి ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రం ఇప్పటికీ పాత ధరలకే ఇంధనాన్ని విక్రయిస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇవి రేట్లను ఫ్రీజ్ చేశాయి. అయితే, ఇవి కూడా గత వారం 'ప్రీమియం' పెట్రోల్ ధరను లీటరుకు రూ.2, పారిశ్రామిక అవసరాలకు వాడే బల్క్ డీజిల్ ధరను రూ.22 వరకు పెంచాయి. కానీ సాధారణ పెట్రోల్, డీజిల్ ధరల్లో ఇప్పటికైతే ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో సాధారణ పెట్రోల్ ధర రూ. 94.77 వద్దే కొనసాగుతోంది.

దిగుమతులపై యుద్ధ మేఘాలు
భారతదేశం తన ముడిచమురు అవసరాల్లో 88 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇందులో సగానికి పైగా ఇంధనం స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ (Strait of Hormuz) మార్గం గుండానే రావాలి. ప్రస్తుత యుద్ధం కారణంగా ఇరాన్ ఈ మార్గంలో నౌకల రాకపోకలను హెచ్చరించింది. ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఆయిల్ ట్యాంకర్లకు కవరేజీ ఇవ్వడానికి నిరాకరిస్తుండటంతో సరఫరా వ్యవస్థ దెబ్బతింది. చమురు కంపెనీలు గత ఆర్థిక సంవత్సరంలో భారీ లాభాలను ఆర్జించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు వారి మార్జిన్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
జియో-బీపీ, భవిష్యత్తు అంచనాలు
మరోవైపు రిలయన్స్, బీపీ జాయింట్ వెంచర్ అయిన జియో-బీపీ (Jio-bp) కూడా భారీ నష్టాలను చవిచూస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ధరలను పెంచలేదు. ఒకవేళ యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగితే, ప్రభుత్వ రంగ సంస్థలు కూడా రేట్లను పెంచక తప్పని పరిస్థితి ఏర్పడవచ్చు. ప్రస్తుతం నయారా ఎనర్జీ దేశవ్యాప్తంగా 6,967 పెట్రోల్ బంకులను నిర్వహిస్తోంది. ప్రైవేట్ బంకుల్లో రేట్లు పెరగడంతో వినియోగదారులు ప్రభుత్వ బంకుల వైపు మళ్లుతున్నారు, దీనివల్ల అక్కడ విపరీతమైన రద్దీ ఏర్పడుతోంది. ప్రభుత్వం ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కుంటుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications








