ఫిబ్రవరి 2022లో భారత మార్కెట్లో విడుదలైన సరికొత్త కార్లు.. వీటిలో మీ ఫేవరేట్ మోడల్ ఏది..?
కోవిడ్ తెచ్చిన సంక్షోభం మరియు ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన సెమీకండక్టర్ చిప్ కొరత నుండి ఆటోమొబైల్ పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో, కార్ల తయారీ సంస్థలు తమ వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు మరియు కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు సరికొత్త మోడళ్లను ప్రవేశపెడుతున్నాయి. మరికొన్ని కంపెనీ ఇప్పటికే విక్రయిస్తున్న మోడళ్లలో అప్‌గ్రేడెడ్ వెర్షన్లను మరియు స్పెషల్ ఎడిషన్లను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి.

గడచిన ఫిబ్రవరి 2022 నెలలో భారత ఆటోమొబైల్ మార్కెట్లో అనేక కొత్త కార్ మోడల్‌లు ప్రారంభించబడ్డాయి. వీటిలో కొన్ని పూర్తిగా సరికొత్త మోడళ్లు కాడా మరికొన్ని ప్రస్తుత మోడళ్లకు అప్‌గ్రేడెడ్ వెర్షన్లుగా ఉన్నాయి. గత ఫిబ్రవరి నెలలో, మారుతి సుజుకి యొక్క కొత్త 2022 మోడల్ బాలెనో, కియా మోటార్స్ నుండి కారెన్స్ అనే సరికొత్త 7-సీటర్ ఎమ్‌పివి, ఆడి క్యూ7 ఫేస్‌లిఫ్ట్, స్కోడా ఆటో నుండి సరికొత్త మిడ్-సైజ్ సెడాన్ స్లావియా, టాటా మోటార్స్ నుండి కజిరంగా ఎడిషన్ మోడళ్లు మరియు జీప్ ఇండియా బ్రాండ్ నుండి కంపాస్ ట్రైల్‌హైక్ ఎడిషన్ ఎస్‌యూవీలు మార్కెట్లోకి వచ్చాయి. వీటి గురించి మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

1. కొత్త 2022 మారుతి సుజుకి బాలెనో ఫేస్‌లిఫ్ట్ (2022 Baleno Facelift)
మారుతి సుజుకి ఇండియా తమ నెక్సా డీలర్‌షిప్ కేంద్రాల ద్వారా విక్రయిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనో లో కంపెనీ ఓ కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ను ప్రవేశపెట్టింది. ఇదివరకటి బాలెనోతో పోల్చుకుంటే, రిఫ్రెష్డ్ డిజైన్ మరియు సరికొత్త ఫీచర్లను కలిగి ఉన్న ఈ 2022 మోడల్ బాలెనో ప్రారంభ ధర రూ. 6.35 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. కొత్త మారుతి బాలెనో కారును కంపెనీ 6 వేరియంట్లలో ప్రవేశపెట్టింది. ఆసక్తిగల కస్టమర్లు రూ.11,000 టోకెన్ అడ్వాన్స్ చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు.

ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ యొక్క టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.9.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించబడింది. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సిగ్మా, డెల్టా, జీటా, జీటా (O), ఆల్ఫా, ఆల్ఫా (O) వంటి మొత్తం 6 వేరియంట్‌లలో తీసుకురాబడింది. సిగ్మా మినహా అన్ని వేరియంట్లు 5-స్పీడ్ మాన్యువల్ మరియు 5-స్పీడ్ AMTతో అందించబడతాయి. బాలెనోలో మారుతి సుజుకి మొదటిసారిగా ఆప్షన్లను వేరియంట్‌లను జోడించింది. ఇందులో కంపెనీ ఇంజన్ లో ఎలాంటి మార్పు చేయలేదు, అయితే కొత్త ఏఎమ్‌టి గేర్‌బాక్స్ ను మాత్రం ప్రవేశపెట్టింది. - కొత్త 2022 బాలెనోకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

2. కియా కారెన్స్ (Kia Carens)
కొరియన్ కార్ కంపెనీ కియా మోటార్స్ భారత మార్కెట్లో తమ నాల్గవ మోడల్ గా కియా కారెన్స్ 7-సీటర్ ఎమ్‌పివిని విడుదల చేసింది. మార్కెట్లో దీని ప్రారంభ ధర కేవలం రూ. 8.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) మాత్రమే. కియా కారెన్స్ ఎమ్‌పివి ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ మరియు లగ్జరీ ప్లస్ అనే ఐదు వేరియంట్‌లలో విడుదల చేయబడింది మరియు ఇందులో దాని టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 16.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంటుంది.

కియా మోటార్స్ యొక్క పాపులర్ ఎస్‍యూవీ కియా సెల్టోస్ ప్లాట్‌ఫామ్ ను ఆధారంగా చేసుకొని కంపెనీ ఈ ఎమ్‌పివిని తయారు చేసింది. ఫలితంగా, ఇది సెల్టోస్ మాదిరిగానే మూడు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఆసక్తి గల కస్టమర్లు రూ. 25,000 అడ్వాన్స్‌తో ఈ కారును బుక్ చేసుకోవచ్చు. కియా కారెన్స్ ఎమ్‌పివి 6-సీటర్ లేదా 7-సీటర్ కాన్ఫిగరేషన్ లో లభిస్తుంది. ఇందులోని 6-సీటర్ వేరియంట్ లో రెండవ వరుసలో కెప్టెన్ సీట్లు లభిస్తుండగా, 7-సీటర్ వేరియంట్ లో మధ్య వరుసలో బెంచ్ సీట్ లభిస్తుంది. - కియా కారెన్స్ కు సంబంధించి మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

3. రెనో ట్రైబర్ లిమిటెడ్ ఎడిషన్ (Renault Triber Limited Edition)
ప్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న పాపులర్ 7-సీటర్ ఎమ్‌పివి ట్రైబర్ లో కంపెనీ ఓ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్ ను గత ఫిబ్రవరి నెలలో మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో రెనో ట్రైబర్ ఎమ్‌పివి అమ్మకాలు ఒక లక్ష మైలురాయిని చేరుకున్న సందర్భంగా కంపెనీ ఇందులో లిమిటెడ్ ఎడిషన్ ను ప్రవేశపెట్టింది. మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ. 7.24 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా నిర్ణయించబడింది. కంపెనీ ఈ కొత్త ట్రైబర్ లిమిటెడ్ ఎడిషన్ ను ఈ మోడల్ లో స్టాండర్డ్ RXT వేరియంట్‌ను ఆధారంగా చేసుకొని తయారు చేసింది. ఇందులో మరిన్ని అదనపు ఫీచర్లు లభిస్తాయి.

కొత్త 'ట్రైబర్ లిమిటెడ్ ఎడిషన్' రెండు డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. వీటిలో ఒకటి మూన్‌లైట్ సిల్వర్/బ్లాక్ రూఫ్ కాగా, మరొకటి సెడార్ బ్రౌన్/బ్లాక్ రూఫ్ కలర్స్. అంతేకాకుండా, కంపెనీ ఈ కొత్త వేరియంట్ లో 14-ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు మరియు డేటైమ్ రన్నింగ్ లైట్లు, అకాజా ఫాబ్రిక్ అప్‌హోలెస్ట్రీ, బ్లాక్ డోర్ హ్యాండిల్స్, పియానో బ్లాక్ ఫినిషింగ్‌తో కూడిన డ్యూయల్-టోన్ డ్యాష్‌బోర్డ్ మరియు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి అనేక ఆధునిక ఫీచర్స్ ఉన్నాయి. - ట్రైబర్ లిమిటెడ్ ఎడిషన్ కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

4. కొత్త 2022 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 (2022 BMW X3)
జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ (BMW) భారత మార్కెట్లో తమ కొత్త 2022 మోడల్ ఎక్స్3 (X3) ఎస్‌యూవీని విడుదల చేసింది. గతంలో ఇది కేవలం పెట్రోల్ ఇంజన్ తో మాత్రమే లభ్యమయ్యేది, కాగా కంపెనీ ఇప్పుడు ఇందులో డీజిల్ ఇంజన్ ఆప్షన్ ను కూడా ప్రవేశపెట్టింది. డీజిల్ ఇంజన్ కలిగిన కొత్త 2022 BMW X3 ధర రూ. 65.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంటుంది. - ఈ లగ్జరీ ఎస్‌యూవీకి సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

5. టాటా కజిరంగా ఎడిషన్ (Tata Kaziranga Editions)
దేశీయ ఆటోమబైల్ దిగ్గజం టాటా మోటార్స్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న టాటా పంచ్, టాటా నెక్సాన్, టాటా హారియర్ మరియు టాటా సఫారీ మోడళ్లలో కంపెనీ కజిరంగా ఎడిషన్లను విడుదల చేసింది. మార్కెట్లో టాటా కజిరంగా ఎడిషన్ ధరలు రూ.8.58 లక్షల నుంచి రూ.20.99 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి. కంపెనీ వీటిని కజిరంగా జూ నుండి ప్రేరణ పొంది డిజైన్ చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్ మోడళ్లు సాధారణ మోడళ్ల కన్నా ప్రత్యేకంగా ఉంటాయి. డిజైన్ మరియు ఫీచర్లలో కూడా స్వల్ప మార్పులు ఉంటాయి.

ఇందులో టాటా పంచ్ కజిరంగా ఎడిషన్ ను వేలం వేయడం ద్వారా వచ్చే ఆదాయాన్ని కంపెనీ ఖడ్గమృగం యొక్క రక్షణ కోసం ఉపయోగించనున్నట్లు తెలిపింది. టాటా కాజిరంగా ఎడిషన్ గ్రాస్‌ల్యాండ్ బీజ్ కలర్ స్కీమ్‌లో లభిస్తాయి మరియు వాటిపై చాలా చోట్ల ఖడ్గమృగం లోగో కనిపిస్తుంది. కంపెనీ ఇప్పటికే తన వెబ్‌సైట్‌లో పంచ్ కాజిరంగా రిజిస్ట్రేషన్‌ను కూడా ప్రారంభించింది. - టాటా కజిరంగా ఎడిషన్స్ కి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

6. స్కోడా స్లావియా (Skoda Slavia)
చెక్ రిపబ్లిక్ కార్ కంపెనీ స్కోడా ఆటో నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మిడ్-సైజ్ సెడాన్ స్కోడా స్లావియా కూడా గత ఫిబ్రవరి నెలలో మార్కెట్లో విడుదలైంది. దేశీయ విపణిలో ఈ కారు ప్రారంభ ధర రూ. 10.69 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. స్కోడా స్లావియాను కంపెనీ యాక్టివ్, యాంబిషన్ మరియు స్టైల్ అనే వేరియంట్లలో విడుదల చేసింది.

కొత్త స్కోడా స్లావియాను కంపెనీ రెండు ఇంజన్ ఆప్షన్లతో ప్రవేశపెట్టింది. ఇందులో మొదటిది 1.0-లీటర్ TSI టర్బో పెట్రోల్ ఇంజన్. ఇది 115 బిహెచ్‌పి పవర్ మరియు 178 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇక రెండవ ఇంజిన్ 1.5-లీటర్ TSI టర్బో-పెట్రోల్ ఇంజన్ ఇది 150 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో లభిస్తుంది. - స్కోడా స్లావియా వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

7. జీప్ కంపాస్ ట్రైల్‌హాక్ (2022 Jeep Compass Trailhawk)
అమెరికన్ కార్ బ్రాండ్ జీప్, భారత మార్కెట్లో తమ కొత్త 'కంపాస్ ట్రైల్‌హాక్' (Compass Trailhawk) ఎడిషన్ ను విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో ఈ కొత్త 2022 జీప్ కంపాస్ ట్రైల్‌హాక్ (2022 Jeep Compass Trailhawk) ప్రారంభ ధర రూ. 30.72 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా నిర్ణయించబడింది. ఇది దాని స్టాండర్డ్ కంపాస్ టాప్-స్పెక్ మోడల్ అయిన ఎస్ వేరియంట్ ధర కంటే రూ. 1.38 లక్షలు అధిక ధరను కలిగి ఉంటుంది. - ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ లభించే ఫీచర్లను తెలుసుకునేందుకు ఈ లింకుపై క్లిక్ చేయండి.

8. ఆడి Q7 (2022 Audi Q7)
జర్మన్ కార్ బ్రాండ్ ఆడి, దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న క్యూ7 ఎస్‌యూవీలో ఓ కొత్త 2022 మోడల్ ను విడుదల చేసింది. భారత మార్కెట్లో కొత్త 2022 ఆడి క్యూ7 ధర రూ. 79.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించబడింది. ఆడి క్యూ7 రెండు వేరియంట్లలో అందుబటులో ఉంటుంది. ఇందులో మొదటిది ప్రీమియం ప్లస్ కాగా, రెండవది టెక్నాలజీ వేరియంట్. వీటి ధరలు వరుసగా రూ. 79.99 లక్షలు మరియు రూ. 88.33 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) గా ఉన్నాయి. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








